'ప్రజలు మనల్ని చేరుకోలేకపోతే మనమే వారికి చేరువ కావాలి' అంటూ ఉచిత న్యాయసేవల కోసం సరిగ్గా నెల రోజుల క్రితం ఎలుగెత్తిన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్‌వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణమిది. అయిదున్నర దశాబ్దాల క్రితం జస్టిస్ కోకా సుబ్బారావు అలంకరించిన ఆ సమున్నత న్యాయపీఠాన్ని ఇంతకాలానికి తన మరో తనయుడు అధిష్ఠించడం చూసి తెలుగుతల్లి పులకిస్తోంది. నూతన సాధనాలను అందిపుచ్చుకొని సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలు అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయవ్యవస్థకు రూపకల్పన చేయాలని 2019 నాటి రాజ్యాంగ దినోత్సవ వేదికపై జస్టిస్ రమణ అభిలషించారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా తదనుగుణ కార్యాచరణకు వచ్చే 16 నెలల పదవీకాలంలో జస్టిస్ రమణ చిత్తశుద్ధితో కృషి చేయగలరన్న నమ్మకం అన్ని వైపుల నుంచీ వ్యక్తమవుతోందిప్పుడు! న్యాయపాలిక విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాన న్యాయమూర్తిగా అయిదేళ్ల క్రితం టీఎస్ ఠాకుర్ బహిరంగంగా వాపోయిన దరిమిలా, పరిస్థితి అంతకంతకూ దిగజారడమే గాని మెరుగుపడింది లేదు.
'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్'గా..
చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే హయాములో- సుప్రీంకోర్టులో అయిదు ఖాళీలు ఏర్పడ్డా ఏ ఒక్క నియామకమూ కాలేదు. ఈ ఏడాది మరో అయిదు ఖాళీలు వాటికి జత కలుస్తాయంటున్న నేపథ్యంలో కొలీజియాన్ని ఒక్క తాటి మీద నడపడం ద్వారా- కేసులతో పాటు న్యాయ నియామకాల పెండింగ్ సమస్యనూ జస్టిస్ రమణ పరిష్కరించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య 4.4 కోట్లకు చేరిన తరుణంలో దశాబ్దాలుగా మరుగున పడిన 224 ఎ అధికరణ దుమ్ముదులిపి తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీం ధర్మాసనం పచ్చజెండా ఊపడంతో- దాన్ని సక్రమంగా పట్టాలెక్కించే బాధ్యతా కొత్త చీఫ్ జస్టిస్ భుజస్కంధాలపైనే పడింది. ఇలా ఇంటిని చక్కదిద్దుకుంటూ 'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్'గా న్యాయపాలన రథాన్ని సజావుగా నడిపించే ఒడుపుతో జస్టిస్ రమణ నెగ్గుకురావాలి!
దీర్ఘకాలిక సంస్కరణల్ని చేపట్టడానికి వీలుగా భారత ప్రధాన న్యాయమూర్తికి కనీసం మూడేళ్ల పదవీ కాలం ఉండాలని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. పౌరులందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగ సారమైనప్పుడు ఆ క్రమంలో ఎదురయ్యే ఆటంకాల్ని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల దన్నుతో తొలగిస్తూ ముందడుగేసే కార్యశీలతను సుప్రీం ప్రధాన న్యాయమూర్తే కనబరచాలి. క్రమానుగతంగా ప్రధానమంత్రిని భారత ప్రధాన న్యాయమూర్తి కలుస్తూ ఉంటే, ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
ఆశారేఖ..
జ్యుడీషియరీపై ఖర్చును ప్రణాళికేతర వ్యయంగా పరిగణిస్తుండటంతో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు నిధులు సరిపోవడం లేదు. దానికి తోడు న్యాయ విద్యలో దిగనాసి ప్రమాణాలు దిగులు పుట్టిస్తున్నాయని ఈ నెల తొలివారంలో జస్టిస్ రమణే వాపోయారు! రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్ష స్థానంలో న్యాయాధికారుల శిక్షణ ప్రమాణాల్ని పెంచి, జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా భారీయెత్తున లోక్ అదాలత్‌లను నిర్వహించి రాణకెక్కిన జస్టిస్ రమణ పదోన్నతిని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ 'ఆశారేఖ'గా అభివర్ణిస్తోంది. కరోనా మహమ్మారి విలయంతో ఆరోగ్య వ్యవస్థలు, సంకుచిత రాజకీయాల ప్రజ్వలనంతో ఇతరేతర యంత్రాంగాలూ కుదేలవుతున్న వేళ పౌరహక్కులకు తూరుపు దిక్కుగా సుప్రీంకోర్టు గురుతర బాధ్యత పోషించాలి. న్యాయవ్యవస్థ విలువలు ప్రమాణాల్ని, విశిష్ట గౌరవాన్నీ కాపాడుతూ విధ్యుక్తధర్మ నిర్వహణలో జస్టిస్ రమణ నెగ్గుకొస్తే తెలుగునేల గర్విస్తుంది. నిజాయతీ నిర్భీతి సహజ లక్షణాలుగా మేలిమి తీర్పులతో జస్టిస్ కోకా సుబ్బారావు చరిత్రపుటల్లోకి ఎక్కినట్లుగా- సర్వోన్నత న్యాయపీఠంపై తాజా తెలుగుతేజమూ భాసించాలి!
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచుపెళ్లలు