'న్యాయస్థానాల్లో (Judiciary In India) మౌలిక వసతుల పరంగా రాష్ట్రాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడంపై ఎవరూ దృష్టిసారించడం లేదు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే' అని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సామాన్యులకు సకాలంలో న్యాయసేవలు అందించడంలో అవరోధమవుతున్న ఈ దుస్థితిపై సీజేఐ ఎన్.వి.రమణ తాజాగా ఆవేదనాభరితంగా స్పందించారు. న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత కల్పించే దిశగా రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. మౌలిక సదుపాయాల లేమితో (Infrastructure In Judiciary) పాటు పరిపాలన సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో జాప్యం తదితర సమస్యలూ న్యాయవ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి లోగడ ఆందోళన వ్యక్తంచేశారు.
అధ్యయనం ఏం చేప్తోంది..?
దేశవ్యాప్తంగా 665 జిల్లా న్యాయస్థానాల స్థితిగతులపై 2018లో సాగిన అధ్యయనం- చేదునిజాలు ఎన్నింటినో వెలుగులోకి తెచ్చింది. అరవై శాతం కోర్టుల్లో తీరైన మరుగుదొడ్లే లేవని, కక్షిదారులు వేచి ఉండే గదులు 46శాతం న్యాయస్థానాల్లో పూజ్యమని ఆ నివేదిక స్పష్టీకరించింది. బిహార్, ఝార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లో మౌలిక వసతులు మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఏపీలో 46శాతం, తెలంగాణలో 50శాతం జిల్లాకోర్టుల్లో సహాయ కేంద్రాలు కొరవడ్డాయి. న్యాయాలయాల్లో సదుపాయాలపై 2012లో సమగ్ర నివేదికను రూపొందించిన 'జాతీయ న్యాయస్థానాల నిర్వహణ వ్యవస్థలు'(ఎన్‌సీఎంఎస్) ఉపసంఘం- వసతుల వృద్ధికి నిధులు బిగపట్టడం ద్వారా న్యాయపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోజాలదని హెచ్చరించింది. సమస్యలు మేటవేయడానికి కారణం మీరంటే మీరంటూ కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విమర్శలతో పొద్దుపుచ్చరాదని హితవు పలికింది.
నిధుల కేటాయింపు..
దిగువ కోర్టుల్లో సౌకర్యాల పెంపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 2025-26 వరకు పొడిగించిన మోదీ సర్కారు, ప్రతిపాదిత వ్యయం తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో 60శాతం నిధులను తానే వెచ్చించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. సీజేఐ సూచిస్తున్నట్లుగా జాతీయ న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కొలువుతీరితేనే- న్యాయాలయాల వెతలు తీరి, భారతీయ న్యాయవ్యవస్థ ఆధునికతను అందిపుచ్చుకోగలుగుతుంది!
వ్యాజ్యాల భారతం..
దేశీయంగా అక్షరాస్యత, తలసరి ఆదాయాలు ఇనుమడిస్తున్న కొద్దీ న్యాయస్థానాల్లో పోగుపడుతున్న కేసుల సంఖ్య ఇంతలంతలవుతోంది. నాలుగు కోట్లకు పైబడిన అపరిష్కృత వ్యాజ్యాల భారంతో న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఈసురోమంటోంది. రాబోయే మూడు దశాబ్దాల్లో ఏడాదికి 15 కోట్ల కేసులు దాఖలవుతాయని అంచనా! ఆ ఒత్తిడిని తట్టుకోవాలంటే న్యాయస్థానాల్లో సదుపాయాలతో పాటు న్యాయమూర్తుల పోస్టులనూ భారీగా పెంచాలన్నది ఎన్‌సీఎంఎస్ ఉపసంఘం సూచన.
వెంటాడుతున్న న్యాయమూర్తుల లేమి...
దేశీయులకు మెరుగైన న్యాయసేవలు ఒనగూడాలంటే ప్రతి పది లక్షల జనాభాకు 50 మంది న్యాయమూర్తులు అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. నేటికీ దేశంలో సగటున పది లక్షల మందికి 21.03 మంది న్యాయమూర్తులే ఉన్నట్లు ఇటీవల రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది. సీజేఐ చొరవతో హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం ఈమధ్య జోరందుకున్నా- 25 ఉన్నత న్యాయస్థానాల్లో అక్టోబరు ఒకటి నాటికి 471 మంది న్యాయాధీశులకు కొరత ఉంది. న్యాయసేవల్లో ఆలస్యమంటే- ప్రజలకు న్యాయాన్ని నిరాకరించడమే! ఆ దుస్థితి తొలగిపోవాలంటే సుప్రీంకోర్టే లోగడ స్పష్టీకరించినట్లు 'వాయిదాల సంస్కృతి'ని న్యాయవ్యవస్థ వదిలించుకోవాలి. సామాన్యులకు న్యాయస్థానాలు మరింత చేరువ కావాలంటే- జస్టిస్ రమణ అభిలషిస్తున్నట్లు న్యాయాలయాల భాష నుంచి వివిధ అంశాల్లో సంస్కరణలు అత్యవసరం. పౌరహక్కులకు రక్షణఛత్రం బలీయం కావడమన్నది- క్రియాశీల న్యాయవ్యవస్థతోనే సాధ్యం. ఆ మేరకు దాన్ని పటిష్ఠీకరించడంలో సీజేఐ మేలిమి సూచనలకు పాలకులు పట్టం కడితే- అందరికీ సమాన న్యాయఫలాలు అందడానికి మార్గం సుగమమవుతుంది!
ఇదీ చూడండి: 'భాషను మరిచిపోతే సంస్కృతీ దూరం'