అత్యంత విలువైన బంగారం నిల్వలు ఇండియాలో ఖనిజ రూపంలో కంటే భారతీయుల ఇళ్లలోనే అధికంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు బంగారం నిల్వల్ని తగ్గించుకొని విదేశ మారక ద్రవ్యం పెంచుకోవడానికి పాకులాడుతుంటే, దేశీయావసరాల కోసమే ఇండియా ఇప్పటికీ ఏటా వెయ్యి టన్నుల స్వర్ణాన్ని దిగుమతి చేసుకోక తప్పడంలేదు. చారెడు భూమిని అస్తిత్వ చిహ్నంగా భావించే ప్రజానీకం చిన్నమెత్తు బంగారాన్ని అవసరానికి అక్కరకొచ్చే నేస్తంగా భావిస్తుంటుంది. కాంచనానికి తరగని గిరాకీ ఒకవంక, దానిపై ప్రభుత్వాల సుంకాల బాదుడు మరోవంక- విచ్చలవిడిగా బంగారం అక్రమ రవాణాకు లాకులెత్తుతున్నాయి.
చడీచప్పుడు లేకుండా..
దేవభూమి కేరళలో రెండు వారాలనాడు వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ బాగోతం- పలు రాజకీయ మలుపులు తిరిగి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరొక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ వంటి ఘనాపాటి సంస్థల దర్యాప్తులోకి వెళ్ళింది. పోయినేడు అక్రమ బంగారం దిగుమతుల్లో జాతీయ రికార్డు సృష్టించిన కేరళ్లలో ఎకాయెకి 550 కిలోలకు పైగా స్వర్ణాన్ని స్వాధీనపరచుకొన్నా ఎలాంటి చడీచప్పుడూ లేదు. అదే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దౌత్య కార్యాలయం, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రమేయాలతో రచ్చకెక్కిన స్మగ్లింగ్ రగడ- బంగారం అక్రమ దిగుమతుల జాడ్యాన్ని అరికట్టే పరిష్కారాలకు దారితీస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడు లేడు!
తనిఖీలు లేనందుకే..
వియన్నా కన్వెన్షన్ మేరకు కాన్సులేట్ జనరల్ స్థాయిలో ఉన్నవారికి దౌత్యపరమైన రక్షణలుంటాయి. ఆ మేరకు కేరళలోని యూఏఈ కాన్సులేట్ చిరునామాకు విమానం ద్వారా వచ్చిన సరకును ఏ మాత్రం తనిఖీలు చెయ్యకుండా కస్టమ్స్ అధికారులు పంపించేయడం ఆనవాయితీ. మొన్న అయిదో తేదీన తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అలాగే ఓ భారీ లగేజీ వచ్చింది. దౌత్యపర రక్షణ గల ఓ వ్యక్తి పేరును దుర్వినియోగం చేస్తూ స్మగ్లింగ్ సిండికేట్ బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతోందన్న రహస్య సమాచారం ఈలోగా కస్టమ్స్ అధికారులకు చేరింది. చట్టబద్ధంగా పలు విభాగాల పెద్దల ఎదుట ఆ లగేజీని అధికారులు తనిఖీ చేస్తే అక్షరాలా రూ.15 కోట్ల విలువైన 30 కిలోల మేలిమి బంగారం బయటపడింది.
అదే కీలకం..
దౌత్యపరమైన రక్షణలున్నాయన్న ధీమాతో స్మగ్లర్లు సరుకు రవాణాలో ఏ మాత్రం 'అలక్ష్యం' ప్రదర్శించలేదు- బాత్‌రూమ్ పైపులు గట్రా సామగ్రి లోపల జాగ్రత్తగా బంగారాన్ని దాచి కస్టమ్స్‌వారి కళ్లు కప్పడానికి శతథా ప్రయత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ లోగడ కాన్సులేట్ ఉద్యోగిగా పనిచేసి, ప్రస్తుతం కేరళ ఐటీ విభాగం చేపట్టిన ప్రాజెక్టులో పొరుగు సేవల ఉద్యోగినిగా కుదురుకొంది. స్మగ్లింగ్ గుట్టు రట్టు అయ్యేసరికి ఆమె కాన్సులేట్ జనరల్‌తో 138సార్లు, మరో కీలక నిందితుడు పీఎస్ సరిత్‌తో 45సార్లు, కాన్సులేట్ దౌత్యాధికారితో 28సార్లు మాట్లాడిందంటేనే ఆమె పరపతి తెలుస్తోంది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఐటీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఎం.శివశంకర్‌కు కస్టమ్స్‌వారు ఉచ్చు బిగించడం కేసులో కీలక మలుపు.
ఉగ్రవాదుల కోసమే స్మగ్లింగ్..
యూఏఈ కాన్సులేట్‌లో లోగడ ప్రజాసంబంధాల అధికారిగా పనిచేసిన సరిత్- అనేక పర్యాయాలు శివశంకర్‌కు ఫోన్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో- స్వప్నా సురేశ్‌తోను, ఈ బంగారం స్మగ్లింగ్‌తోను ఆయన సంబంధాలపై ఎన్‌ఐఏ సైతం దృష్టి సారించింది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమనే రాజకీయం ఎన్నికల వేళ మరింత రంజుగా రాణకెక్కింది. త్వరలో స్థానిక ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో- నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చెయ్యాలని విపక్షం కోడై కూసింది. ముఖ్యకార్యదర్శిని పదవి నుంచి ఊడబెరికి, దేశ భద్రతతో ముడివడిన ఈ స్మగ్లింగ్ బాగోతంపై కేంద్ర దర్యాప్తును ముఖ్యమంత్రి విజయనే కోరడంతో- జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలన్నీ తెరవెనక శాల్తీల కోసం జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాద నిధుల కోసమే ఈ స్మగ్లింగ్ సాగుతున్నట్లు ఎన్‌ఐఏ చేసిన ప్రకటన ఈ కుంభకోణంలో కుట్ర కోణాల తీవ్రతను వెల్లడిస్తోంది!
పన్నులు పెరిగేకొలదీ..
గత పది నెలల్లో 150 కిలోల బంగారం కేరళకు అక్రమంగా తరలివచ్చిందన్న ఎన్‌ఐఏ- మలప్పురం వ్యాపారి రమీజ్‌ను నిర్బంధించిన దరిమిలా ఈ కుంభకోణంలో ఉగ్రవాదం నీలినీడల్నీ తోసిపుచ్చలేమంటోంది! 2019లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న బంగారం పరిమాణం 119 టన్నులు. కస్టమ్స్ కళ్లు పడకుండా గమ్యస్థానాలకు చేరిన సరకెంతో లెక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బంగారంలో మూడోవంతు ఇండియా మీదుగానే తరలిపోతోంది. నిరుడు రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి దేశీయ అవసరాల కోసం ఇండియా బంగారం దిగుమతి చేసుకొంది. అయినా బంగారం స్మగ్లింగ్ అడ్డూఆపూ లేకుండా జరగడానికి కారణం ఏమిటి? అక్రమంగా తెచ్చిన మేలిమి బంగారం ప్రతి కిలోమీదా అయిదారు లక్షల రూపాయల లాభం స్మగ్లర్ల పంట పండిస్తోంది. దేశీయంగా బంగారంపై పన్నులు పెంచే కొద్దీ అది అక్రమ సరఫరాదారులకు రాచబాటలు పరుస్తోంది. యూఏఈ, చైనా, తైవాన్, హాంకాంగ్, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచీ విచ్చలవిడిగా సాగుతున్న స్మగ్లింగును కట్టుదిట్టంగా అరికట్టడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. బంగారం అక్రమ రవాణాలో ఉగ్రవాద కోణాలూ వెలుగుచూస్తున్నందువల్ల- సమస్య లోతుపాతుల్ని మరే మాత్రం విస్మరించే వీల్లేదు. సుంకాలను తగ్గించి అక్రమ రవాణా నష్టదాయకమయ్యేలా చూడటం, నిఘాకు కోరలు తొడిగి నేరగాళ్ల భరతం పట్టడం వంటి చర్యలు వేగవంతం కావాలిప్పుడు! ఏమంటారు?
- పర్వతం మూర్తి, రచయిత
ఇదీ చదవండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!