International human rights day: చరిత్రలో మానవ హక్కుల ఉల్లంఘనలు, వాటి దుష్ప్రభావం బడుగు వర్గాలను తరతరాలుగా వెన్నాడటం చూస్తూనే ఉన్నాం. అమెరికాలో నల్లజాతివారిపై తెల్లజాతివారి ఆధిపత్య ధోరణులు, భారత్‌లో సమన్యాయం కోసం నిరంతర పోరాటాలు చోటు చేసుకొంటున్నాయి. ఆఫ్రికాలో తెల్లజాతి వలస పాలనలో జరిగిన దాష్టీకాలను, జాతిపరమైన దుర్విచక్షణను స్థానికులు ఎన్నటికీ మరవలేరు. అందుకే, తెల్లజాతి వారసులపై కొన్ని ఆఫ్రికా దేశాల్లో దాడులు జరిగిన సందర్భాల గురించి వింటూ ఉంటాం. మానవ హక్కుల ఉల్లంఘనల ప్రభావం మలితరాలపైనా ఉంటుందనడానికి ఇవే నిదర్శనాలు.
Universal Declaration of Human Rights
ఆధునిక యుగంలోనూ నిరంకుశ ప్రభుత్వాలు తమ ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటి అయింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కులను కాపాడటానికి 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి సార్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. భారత స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు, సైద్ధాంతిక భావజాలాలకు చెందిన ఉద్దండులు కలిసి రూపొందించిన ప్రకటన అది. అప్పటి నుంచి ఏటా అదేరోజున ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ఐరాస మానవ హక్కుల ప్రకటన భారత్‌తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తోంది. ఐరాస సభ్యదేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు; అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడింది.
ఇదీ చూడండి: లంచంపై పోరుకు ఆన్‌లైన్ ఆయుధం
సమానత్వానికే ప్రాధాన్యం
Human rights are fundamental rights: కొందరు ఉన్నత వర్గీయులు- సమాజంలోని మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురూహ, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది. ఈ ఆధిక్యతా వాదమే- బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషాపరమైన అమానుషాలకు దారితీస్తోంది. 1857లో 'డ్రెడ్ స్కాట్ వర్సెస్ శాండ్ ఫోర్డ్' కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్లజాతి బానిసలు దేశ పౌరులు కారని తీర్పు చెప్పిందంటే- జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. తరవాత 1886లో అదే కోర్టు అమెరికా కంపెనీలకు దేశ పౌరసత్వం కల్పించింది. అమెరికాలో నల్లజాతివారికన్నా ముందుగా కంపెనీలకు పౌరసత్వ హక్కులు లభించాయి. మనుషులకన్నా కంపెనీలే అధికమంటున్న ఆ తీర్పుకన్నా దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి దురాగతాలను నివారించడానికి ఐరాస మానవ హక్కుల ప్రకటన మనుషులంతా సమానులేనని ఉద్ఘాటించింది. మానవ హక్కులు ప్రాథమిక హక్కులే. వాటిని ఎవరూ హరించలేరు. ప్రజాప్రయోజనాల కోసం ఎంతో అవసరమైతే తప్ప ప్రభుత్వాలూ వాటిని సస్పెండ్ చేయలేవు.
కమిషన్ల అంతంతమాత్రంగానే..
Human Rights Commission: ఐరాస సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను అనుసరించి భారత్ సహా పలు దేశాలు జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్లను నెలకొల్పాయి. భారత్‌లో రాష్ట్ర స్థాయిలోనూ ఇలాంటి కమిషన్లు పనిచేస్తున్నాయి. అయితే, ఈ కమిషన్లు సిఫార్సులు మాత్రమే చేయగలవు తప్ప శిక్షలు విధించలేవు. కాబట్టి మానవ హక్కుల రక్షణలో అవి సాధిస్తున్నది అంతంతమాత్రమే. అంతర్జాతీయ మానవాభివృద్ధి సూచీలో, క్షుద్బాధా నివారణ సూచీలో భారత్ ఎక్కడో అడుగున ఉండటం చూస్తే, ఈ దేశంలో మానవ హక్కుల సంరక్షణ తీరుపై ఆశాభావం కలగదు. దారిద్య్ర సంద్రంలో ఐశ్వర్య ద్వీపాలు వర్ధిల్లడం అమానుషమనే అమెరికా పౌరహక్కుల ఉద్యమకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పలుకులు ఇక్కడ స్మరణీయం. డి.కె.బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ (1997) కేసులో సుప్రీం కోర్టు 'వ్యక్తి అరెస్టు'కు కొన్ని సూత్రాలను నిర్దేశించింది. అరుణేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ (2014) కేసులో పోలీసుల ఏకపక్ష వైఖరిని నిరోధిస్తూ బెయిలుకు నిబంధనలు విధించింది. నిర్దేశిత వ్యవధిలో ఎఫ్‌ఐఆర్‌లను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని యూత్ బార్ అసోసియేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో ఆదేశించింది. వీటి గురించి సాధారణ ప్రజానీకానికి తెలియకపోవడంతో పోలీసు యంత్రాంగంలో ఇంకా పూర్తిస్థాయి జవాబుదారీతనం ఏర్పడలేదు.
ఇదీ చూడండి: Nagaland Army killings: అమిత్ షా వివరణ అసంబద్ధం.. పరిహారం అమానవీయం!
ప్రజా తీర్పులతోనే మార్పు
Human rights violation during covid 19: ఇటీవల నాగాలాండ్‌లో పని స్థలం నుంచి ఇళ్లకు తిరిగివెళుతున్న అమాయక పౌరులపై అస్సాం రైఫిల్స్ అకారణంగా కాల్పులు జరిపి పలువురి ప్రాణాలు బలితీసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులకు, భద్రతా దళాలకు అపరిమిత అధికారాలను కట్టబెడితే జరిగే అనర్థమేమిటో కళ్లకు కట్టింది. ఇంతకన్నా మానవ హక్కుల అతిక్రమణ మరొకటి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం, కొన్ని రాష్ట్రాల్లో మతాంతర వివాహాలను నియంత్రిస్తూ తెచ్చిన చట్టం, గోరక్షణ చట్టం వంటివి దుర్వినియోగం అయిన ఉదంతాలెన్నో ఉన్నాయి. కొవిడ్ కాలంలో ప్రజలకు సరైన ఆరోగ్య, పారిశుద్ధ్య సేవలు అందకపోవడమూ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. మానవ హక్కుల రక్షణకు, వాటిని కట్టుదిట్టంగా అమలు చేయడానికీ పటిష్ఠ యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ప్రతి చట్టానికీ మానవ హక్కుల రక్షణ ఇరుసు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో ఐరాస సార్వజనీన మానవ హక్కుల తీర్మాన స్ఫూర్తి ప్రతిఫలించాలి. మానవ హక్కులను ఉల్లంఘించే ప్రభుత్వ సంస్థలు, విభాగాలు- వాటి సొంత ఖాతాల నుంచి మూల్యం చెల్లించాలి. మానవ హక్కులను రక్షించడం, వ్యక్తి గౌరవాన్ని కాపాడటం రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత అని పాఠశాల స్థాయి నుంచే నూరిపోయాలి. నేటి బాలలే రేపటి పౌరులని గమనించాలి. వలసకాలంనాటి యజమాని-నౌకరు మనస్తత్వం ప్రజాస్వామ్య భారతంలో కొనసాగకూడదనే చైతన్యంతో ప్రభుత్వం, దాని విభాగాలు పనిచేయాలి. రాజ్యాంగం ప్రకారం ప్రజలే సార్వభౌములనే వాస్తవాన్ని సదా గుర్తుంచుకుంటూ పాలకులు, ప్రభుత్వ సిబ్బంది ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. వారు అలా నడుచుకొనే రీతిలో ప్రజలు ఎన్నికల్లో తీర్పులివ్వాలి.
చట్టాలే ఉల్లంఘిస్తున్న వైనం
Uapa act misuse: ప్రభుత్వ విధానాలు, దేశ చట్టాలు సైతం పలు సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆస్కారమిస్తున్నాయి. భారత రాజ్యాంగం అన్ని వర్గాలకూ ప్రాథమిక హక్కులు కల్పించినా, ఆచరణలో ఏదో ఒక రూపంలో దుర్విచక్షణ కొనసాగుతోంది. గతంలోకన్నా దాని తీవ్రత తగ్గడం కొంత ఊరట కలిగించే అంశం. రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక ధోరణులూ మారాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేసే హక్కును పౌరులకు రాజ్యాంగం ప్రసాదించినా- ప్రభుత్వం శాంతియుత ప్రదర్శకులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం, దేశద్రోహ చట్టాలను ప్రయోగిస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తూనే ఉంది. ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసి దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచుతోంది. వారిపై పెట్టిన కేసుల్లో రెండు శాతం మాత్రమే శిక్షలకు దారితీస్తున్నాయంటే వ్యవహారం ఎంత అడ్డగోలుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవీ చూడండి: