దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతంలోని పదకొండు దేశాల్లోకెల్లా- భారతీయ మహిళల ఆరోగ్యకరమైన జీవితకాలం అత్యంత తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక వెల్లడిస్తోంది. కేవలం అరవై ఏళ్లవరకే ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నట్లు ఆ సంస్థ నివేదిక వెల్లడించింది. మహిళల ఆరోగ్యం ఆయా దేశాల ఔన్నత్యానికి, ఆర్థిక ప్రగతికి సూచిక. కానీ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలతోపాటు, ఆరోగ్య అంశాల్లోనూ ఆధునిక మహిళ దుర్విచక్షణను ఎదుర్కొంటోంది.
పోషక లోపమూ సమస్యే
గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆడబిడ్డపై దుర్విచక్షణ మొదలవుతోంది. కడుపులో పిండం ఆడశిశువని తెలిస్తే గర్భస్రావం జరుగుతోంది. పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనే విషయం వెల్లడించడం చట్టరీత్యా నేరమైనా, దేశవ్యాప్తంగా జోరుగా ఉల్లంఘనలు సాగుతున్నాయి. సాధారణంగా ప్రతి వందమంది అమ్మాయిలకు 105-107 మంది అబ్బాయిలు ఉండటం సహజమైన నిష్పత్తిగా పరిగణించవచ్చు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే ధోరణి కొనసాగుతోంది. మన దేశంలో అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంటోంది. ఆడ శిశువుపై దుర్విచక్షణే ఇందుకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.
అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే ఆసియాలో పలుచోట్ల స్త్రీపురుష నిష్పత్తి అధికంగా ఉండటానికి మహిళల్లో మరణాల రేటు అధికంగా ఉండటమే కారణమని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. మంచి పోషకాహారం అందించి, సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తే మహిళలు, పురుషులకన్నా ఎక్కువకాలం జీవించగలుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల్లో కుమారులతో పోలిస్తే, ఆడబిడ్డలకు తక్కువ ఆహారం దక్కే అవకాశం ఉందన్నది కఠోర వాస్తవం. ఇది గ్రామీణ, పేద కుటుంబాల్లో మహిళలు కనీస ఆరోగ్య సామర్థ్యాన్నీ సాధించలేని దుస్థితికి కారణమవుతోంది.
సామాజిక రుగ్మతలు..
మరోవైపు బాల్య వివాహాలు, వరకట్న సమస్యలు, లింగ దుర్విచక్షణ, అత్యాచారాలు వంటి సామాజిక రుగ్మతలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గర్భస్రావాల కారణంగా మరణిస్తున్న మహిళల్లో 20శాతం మన దేశానికి చెందినవారే. భారతీయ మహిళలను గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు మాత్రమే కాకుండా అనేక సాంక్రామికేతర వ్యాధులు వేధిస్తున్నాయి. 53శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్య పోషకాహార లోపమని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ సమస్య మహిళలతోపాటు, వారి పిల్లల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోంది. విపరీతమైన పని ఒత్తిడి, పేదరికం, ఎక్కువ ప్రసవాలు- పోషకాహార లోపానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సగానికిపైగా బాలికలు పోషకాహార లోపంతో సతమతమవుతున్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. ప్రసూతి వేళలో తగిన సహాయం అందక చనిపోతున్న వారూ అధికమే. శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా కాన్పు చేయించుకుంటున్నవారు ఇప్పటికీ 60-80శాతం మాత్రమే. గర్భిణుల్లో మరణాలకు చాలావరకు సామాజిక ఆర్థిక అంశాలే కారణమవుతున్నాయి. సమయానికి ఆసుపత్రికి వెళ్ళే అవకాశం లేక కూడా ఎంతోమంది గర్భిణులు మరణిస్తున్నారు.
అవగాహన అవసరం
మహిళలు విద్యావంతులై ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉంటే- పరిశుభ్రత, వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లను ఆచరించడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే అవకాశం ఉంది. మగవారికంటే స్త్రీలలోనే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండటానికి కారణం- మహిళలకు కుటుంబం నుంచి ఆరోగ్యకరమైన సౌకర్యాలు అందకపోవడమే. స్త్రీ పురుషుల ఆరోగ్య అవసరాలు భిన్నంగా ఉంటాయని గుర్తించకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆరోగ్యపరంగా వివిధ వయసుల్లో మహిళల అవసరాలు మారుతుంటాయి. విధాన రూపకర్తలు ఇలాంటి అంశాలను విస్మరించకూడదు. కేవలం కుటుంబ నియంత్రణ మాత్రమే మహిళలకు సంబంధించిన అంశంగా భావించకుండా- అనేక ఇతరత్రా ఆరోగ్య సమస్యలనూ పరిగణనలోకి తీసుకుంటూ సరైన ప్రణాళికలను రూపుదిద్దాలి. గత రెండు దశాబ్దాలుగా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు గణనీయమైన కృషి జరుగుతున్నా, చేయాల్సింది మరెంతో ఉంది. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యచికిత్సలను అందించడం అత్యవసరం. మహిళల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులను ఆలస్యంగా గుర్తించడమే కాకుండా చికిత్సలోనూ ప్రాధాన్యం దక్కడం లేదు. ఇలాంటి విషయాల్లో ఆరోగ్య నిపుణుల్లో సైతం అవగాహన పెంపొందించేందుకు తగిన విధాన రూపకల్పన జరగాలి.
రచయిత- డాక్టర్ శ్రీ భూషణ్ రాజు
(హైదరాబాద్ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి)
ఇదీ చూడండి: 'వారం రోజుల్లోనే 21% పెరిగిన కరోనా మరణాలు'