ETV Bharat / opinion

సాగరంలో స్వదేశీ గర్జన.. 'విక్రాంత్​'తో చైనా ఎత్తులకు చెక్! - భారత్ యుద్ధ నౌకలు

2030కల్లా చైనా వద్ద అయిదారు విమాన వాహక యుద్ధ నౌకలు ఉండవచ్చు. అప్పుడు హిందూ మహాసముద్రంలోనూ నిరాటంకంగా సంచరించే సామర్థ్యం చైనాకు సమకూరుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే భారత్​ కూడా నౌకా దళ సామర్థ్యాన్ని పెంచుకోవడం తక్షణావసరం.

ins vikrant 2022
సాగరంలో స్వదేశీ గర్జన.. 'విక్రాంత్​'తో చైనా ఎత్తులకు చెక్!
author img

By

Published : Sep 2, 2022, 7:47 AM IST

భారత్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహక యుద్ధ నౌక 'ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు. 40,000 టన్నులకుపైగా బరువుండే విమాన వాహక నౌకలను సొంతంగా తయారు చేసే సామర్థ్యం కలిగిన ఆరు దేశాల్లో ఇప్పుడు భారతదేశమూ ఒకటిగా నిలిచింది. ఇంతకుముందు బ్రిటిష్‌ విమాన వాహక నౌకలు హెర్క్యులిస్‌, హెర్మిస్‌లను భారతదేశం స్వీకరించి వాటికి విక్రాంత్‌, విరాట్‌ అని పునఃనామకరణం చేసింది. విక్రాంత్‌ 1961లో, విరాట్‌ 1987లో భారత నౌకాదళంలో చేరాయి. ఇప్పుడు అవి పాతబడిపోవడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసిన 44,500 టన్నుల విక్రమాదిత్య ఒక్కటే ఇప్పుడు భారత నౌకాదళంలో మిగిలిన ఏకైక విమాన వాహక యుద్ధ నౌక. దానిపై 24 మిగ్‌-29కె యుద్ధ విమానాలు, ఆరు జలాంతర్గామి వినాశక హెలికాప్టర్లు ఉన్నాయి.

INS Vikrant 2022 details : విక్రమాదిత్యకు తోడుగా నేడు రంగప్రవేశం చేస్తున్న రెండో విమాన వాహక నౌక 43,000 టన్నుల విక్రాంత్‌ 2023 నాటికి పూర్తిస్థాయిలో పోరాట విధులు నిర్వహించగలదు. బ్రిటిష్‌ నౌకగా మొదలై, 1961లో విక్రాంత్‌గా మారి 1997లో విధుల నుంచి తప్పుకొన్నదాని స్థానంలో వస్తున్న కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌కు తిరిగి విక్రాంత్‌ అని నామకరణం చేశారు. ఇది 30 యుద్ధ విమానాలను, అధునాతన హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. భారత్‌ సొంతంగా తయారు చేసిన తేజస్‌ యుద్ధ విమానం, అడ్వాన్స్డ్‌ లైట్‌ హెలికాప్టర్లనూ విక్రాంత్‌పై మోహరించవచ్చు. భారతదేశ తీరం నుంచి సుదూర సముద్ర జలాల్లోనూ పోరాడే సత్తా విక్రాంత్‌కు ఉంది. శత్రు జలాంతర్గాములను, విమానాలను అది చిత్తు చేయగలదు. ఆత్మరక్షణకే కాక ఎదురు దాడికీ అది అమోఘ అస్త్రమని నౌకాదళం చెబుతోంది.

భారత్‌, చైనా బలాబలాలు
చైనా తన పెరడులా భావించే పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రవేశించడానికి, అక్కడ అవసరమైతే దాడి చేయడానికి విమాన వాహక నౌక కీలకం. ఇంతవరకు ఈ సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు మాత్రమే ఉందని, ఇప్పుడు భారత్‌ కూడా విమాన వాహక నౌక ద్వారా ఆ సామర్థ్యాన్ని సమకూర్చుకొంటోందని బీజింగ్‌కు అర్థమయింది. 1961 నుంచే విమాన వాహక నౌకలను నిర్వహించిన అనుభవం భారత్‌కు ఉంది. ఇతర నౌకల కన్నా విమాన వాహక నౌకను నడపడం, యుద్ధంలో దాన్ని ఉపయోగించడం ఎక్కువ సంక్లిష్టమైన కార్యం. దాన్ని నిర్వహించడానికి అనుభవజ్ఞులైన నిపుణులు కావాలి. 1971 యుద్ధంలో బంగాళాఖాతంలో పాత విక్రాంత్‌ ద్వారా అలాంటి అనుభవం, సామర్థ్యం భారత్‌కు చేకూరాయి. విక్రాంత్‌ నుంచి దూసుకెళ్ళిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు అప్పటి తూర్పు పాకిస్థాన్‌(నేటి బంగ్లాదేశ్‌)లోని కాక్స్‌ బజార్‌, చిట్టగాంగ్‌, ఖుల్నా, మోంగ్లా రేవులపై బాంబులు కురిపించాయి. ఆ రేవులను దిగ్బంధించడంతో తూర్పు పాకిస్థాన్‌ నుంచి పాక్‌ సేనలు సముద్ర మార్గంలో తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అందుకే సుమారు లక్షమంది పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఇప్పటివరకు రెండు విమాన వాహక నౌకలు- లియావోనింగ్‌, షాండోంగ్‌లను కలిగి ఉన్న చైనా తాజాగా మూడో నౌక ఫ్యూజియాన్‌ను జలప్రవేశం చేయించింది. రాబోయే దశాబ్ద కాలంలో మరి రెండింటిని రంగప్రవేశం చేయించాలనుకొంటోంది. 2030కల్లా చైనా వద్ద అయిదారు విమానవాహక యుద్ధ నౌకలు ఉండవచ్చు. అప్పుడు హిందూ మహాసముద్రంలోనూ నిరాటంకంగా సంచరించే సామర్థ్యం చైనాకు సమకూరుతుంది.

మూడో నౌక తక్షణావసరం
Indian warships news : పెరుగుతున్న చైనా నౌకాదళ ముప్పును ఎదుర్కోవాలంటే విక్రాంత్‌, విక్రమాదిత్యలకు తోడు మూడో విమాన వాహక నౌక అవసరమని 2015లోనే భారత నౌకాదళం గ్రహించింది. 65,000 టన్నుల విశాల్‌ తయారీని చేపట్టనుంది. భారత్‌కు కనీసం మూడు విమాన వాహక నౌకలు కావాలని, ఉన్న రెండు నౌకల్లో ఒకటి మరమ్మతులో ఉంటే మూడో నౌక అక్కరకొస్తుందని 2021 డిసెంబరులో రక్షణపై పార్లమెంటరీ స్థాయీసంఘం సైతం పేర్కొంది. ఈ విషయంలో నౌకాదళంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. విక్రాంత్‌, విక్రమాదిత్యల నుంచి యుద్ధ విమానాలు పైకి ఎగరడానికి ఉపయోగిస్తున్న స్టోబార్‌ యంత్రాంగంకన్నా ఆధునికమైన కాటోబార్‌, ఇమాల్స్‌ వ్యవస్థలను చైనీస్‌ ఫ్యూజియాన్‌లో ఏర్పాటుచేశారు. తన మూడో విమాన వాహక నౌక విశాల్‌లో ఈ ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భారత నౌకాదళం యోచిస్తోంది. దీనికోసం అమెరికాతో కలిసి అధ్యయనం ప్రారంభించింది. భారత్‌ వేగంగా అభివృద్ధి సాధించాలంటే సముద్ర రవాణా మార్గాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. ఈ మార్గాలను చైనా దిగ్బంధించకుండా జాగ్రత్త పడాలంటే భారత్‌ మూడో విమాన వాహక నౌకను సమకూర్చుకోక తప్పదు.

విమాన వాహక యుద్ధ నౌక చేతిలో ఉందంటే అది ఇతర దేశాల్లో సైనిక స్థావరం ఏర్పరచడంతో సమానం. దాదాపు 70 యుద్ధ విమానాలతో ఒక విమాన వాహక నౌక, దాని వెంబడి క్రూయిజర్‌ నౌకలు, శత్రు విమానాలను, జలాంతర్గాములను ఎదుర్కొనే నౌకలు తదితరాలతో కదిలే దళాన్ని క్యారియర్‌ బృందం అంటారు. ఇలాంటి బృందాలు సముద్రాలపై అదుపు సాధించిపెడతాయని 2015లో భారత సముద్ర భద్రతా సిద్ధాంత ప్రకటన స్పష్టం చేసింది.

పోరాట పటిమ
స్వదేశానికి దూరంగా ఉన్న సముద్రాల్లోనూ పోరాట పటిమ ప్రదర్శించగల నౌకాదళాన్ని బ్లూవాటర్‌ నౌకాదళం అంటారు. ఆఫ్రికా తూర్పు తీరం నుంచి హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి, దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు, తూర్పు, దక్షిణ పసిపిక్‌ మహా సముద్ర జలాల వరకు భారతదేశ వాణిజ్య మార్గాలు విస్తరించి ఉన్నాయి. అవి యుద్ధ వ్యూహాల రీత్యా అత్యంత కీలకమైనవి కూడా. ఈ మార్గాల్లో భారత్‌ ప్రయోజనాలకు ముప్పు కలిగితే శీఘ్రంగా ఎదుర్కోవడానికి 'బ్లూవాటర్‌' వ్యవస్థ చాలా అవసరమని 2007లో సముద్ర పోరాట సామర్థ్య ప్రణాళికలో భారత నౌకాదళం స్పష్టీకరించింది. అప్పటి నుంచి పర్షియన్‌ సింధు శాఖ, మలక్కా జలసంధి తదితర ప్రాంతాల్లో సముద్ర దొంగల పనిపట్టే కార్యక్రమాన్ని భారత నౌకాదళం నిర్వహిస్తోంది. ఇతర దేశాల నౌకాదళాలతో సాన్నిహిత్యం పెంచుకొంటోంది. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో, మధ్యధరా సముద్రంలో రెండుమూడు నెలలకు ఒకసారి విన్యాసాలు నిర్వహిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.