ఇటీవల శ్రీలంకలో అకస్మాత్తుగా పెరిగిన ఆహార ధాన్యాల ధరలను చూసి ఆ దేశ ప్రజల గుండెలు అవిసిపోయాయి. అక్కడ ఆహార కొరత(Sri Lanka Food Crisis) ఎదురుకావడం వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. కరోనాతో పర్యాటక రంగం దెబ్బతిని విదేశ మారక ద్రవ్యం పతనమైన సమయంలోనే సేంద్రియ సాగు విధానాన్ని(Sri Lanka Organic Farming) అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అది చేటు తెచ్చి, పంటలు నాశనమయ్యే ముప్పు తలెత్తింది. మరోవైపు విదేశ మారక ద్రవ్య నిల్వలు లేక దిగుమతులూ క్షీణించాయి. కొవిడ్ సంక్షోభంలో నెలకొన్న ఈ పరిణామాలు(Sri Lanka Food Crisis) ఆ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రతికూల ప్రభావం
పూర్తిస్థాయి సేంద్రియ ఆహారాన్ని(Sri Lanka Organic Fertilizer) ఉత్పత్తి చేసిన తొలి దేశంగా నిలవాలన్న శ్రీలంక కల ఇప్పుడు యావత్ దేశానికే నష్టం కలిగిస్తోంది. సేంద్రియ వ్యవసాయం కోసం శ్రీలంక రసాయన ఎరువులను (Sri Lanka Fertilizer Ban) నిషేధించింది. పంటలు నాశనమయ్యే దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తేయాకు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. శ్రీలంక ఎగుమతుల్లో తేయాకుది మొదటి స్థానం. ఏటా 125 కోట్ల డాలర్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతుంటాయి. మొత్తం ఎగుమతుల ఆదాయంలో అది 10శాతం. విదేశ మారక ద్రవ్యం కొరత కారణంగా ప్రభుత్వం దిగుమతులను నిలిపివేసింది. ధాన్యం ఉత్పత్తి సైతం క్షీణించింది. పంటలు తగ్గిపోవడంతో కూరగాయలు పండిచే రైతులు నిరసన బాట పట్టారు. 'పూర్తిగా సేంద్రియ విధానాన్ని అమలు చేస్తే 50శాతం పంటను కోల్పోతాం. దానికి తగ్గట్లు మాకు 50శాతం అధిక ధరలు దక్కవు' అంటూ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రజల ఆహారభద్రతకు హామీనిస్తూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 2019లో శ్రీలంక సేంద్రియ వ్యవసాయానికి(Sri Lanka Organic Farming) శ్రీకారం చుట్టింది. శ్రీలంకలోని 41.63శాతం భూమిలో వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇందులో వరి వంటి పంటల వాటా 23.45శాతం. శ్రీలంకలో వరి దిగుబడి అంతర్జాతీయ సగటుకన్నా తక్కువే. అన్నం ప్రధాన ఆహారమైన దేశంలో సరిపడా సరఫరా(Sri Lanka Food Crisis) లేకుండా పోయింది. శ్రీలంక రైతులకు సేంద్రియ వ్యవసాయంపై సరైన అవగాహన లేదు. విత్తనాలు ఎంచుకోవడంపై శిక్షణ లభించలేదు. సేంద్రియ సాగుకు సరైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి సరఫరా గొలుసులను బలోపేతం చేయాలి. తేయాకు తోటలకు మద్దతునిచ్చే దిశగా విధానాలు మార్చుకోకపోతే సేంద్రియ వ్యవసాయం ప్రమాదంలో పడుతుంది.
ఆ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు
భారత్‌లో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు అడుగులేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలూ వరి, గోధుమ, పసుపు, చెరకు కోసం పైలట్ ప్రాజెక్టులు చేపట్టాయి. వీటిలో ఇంకా పురోగతి సాధించలేదు. ఈ క్రమంలో శ్రీలంక అనుభవాలు మనకు పాఠాలుగా ఉపకరిస్తాయి. రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మొగ్గు చూపకపోవడానికి వాటి ఉత్పత్తులకు అనుగుణంగా ధరలు లభించకపోవడం ముఖ్య కారణం. ఉత్పత్తి చేసినా, వాటిని అమ్మే వ్యవస్థలు అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వాలను విశ్వసించే స్థితిలోనూ రైతులు లేరు. సేంద్రియంతో తగిన మోతాదులో కావాల్సిన పోషకాలు లభిస్తాయా అన్న ప్రశ్నకు నిపుణులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు ప్రస్తుతమున్న సేంద్రియ ఉత్పత్తులు దేశ అవసరాలను తీర్చలేవనే వాస్తవాన్ని విస్మరించరాదు. 2020లో జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమాన్ని (ఎన్‌పీఓపీ) ఆమోదించినా- రాష్ట్రాల స్థాయిలో సేంద్రియ సాగు విధానాల రూపకల్పన జరగలేదు. దాని అమలుకు విశ్వసనీయమైన యంత్రాంగాన్ని ప్రభుత్వాలు రూపొందించలేదు. గుర్తింపునిచ్చేందుకు నాలుగు ఏజెన్సీలు ఉన్నా- అవి టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులకే పరిమితం. సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించే సంస్థల సంఖ్య గణనీయంగా పెరగాలి.
ఎన్నో సవాళ్లు
ఇండియాలో కొందరు చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ సాగు విధానాలను సంప్రదాయంగా అనుసరిస్తున్నారు. పర్యావరణ హితకర విధానాలతో స్థానిక, సొంత పునరుత్పాదక వనరులను వినియోగించుకుని సాగు చేపడుతున్నారు. ఈ విధానంలో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో వారు నష్టపోతున్నారు. దేశంలో బయో ఎరువుల వినియోగం ఇంకా ఊపందుకోలేదు. ఉత్పత్తులకు సరిపడా గిరాకీ లేకపోయేసరికి చిల్లర వ్యాపారులూ ఆ ఉత్పత్తులను విక్రయించడంపై ఆసక్తి చూపడంలేదు. పెద్ద నగరాల్లో స్వల్ప సంఖ్యలో ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలు మాత్రమే సేంద్రియ ఉత్పత్తులను విక్రయించగలుగుతున్నాయి. అవి తక్కువ సంఖ్యలో రైతులు లేదా సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘాలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాయి. సాధారణ మార్కెటింగ్, పంపిణీ వ్యవస్థ బలహీనంగా ఉంది. మరోవైపు రసాయన ఎరువులు, పురుగు మందుల ద్వారా చిల్లర వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. వీటిపై తయారీదారులు, డీలర్లు భారీయెత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ సేంద్రియ సాగుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రయోజనకర కీటకాల జనాభా పెంచడం, చీడపురుగులు లేకుండా చేయడం, నత్రజని స్థిరీకరణ వంటి పూర్తి జీవసంబంధ కార్యకలాపాల పునరుద్ధరణకు కొంత సమయం పడుతుంది. పొలాల్లో సేంద్రియ దిగుబడులు పెరగాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. మొత్తంమీద ఖరీదైన సేంద్రియ సాగు విధానాలు రైతులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఉత్పత్తి పరిమితంగా ఉండటం, సరఫరా గొలుసులో అవకతవకలు, నిల్వ, మార్కెట్‌లో పోటీ వంటి సమస్యలతో దేశ సేంద్రియ వ్యవసాయానికి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాలి. సేంద్రియ ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం అందించాలి. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకొంటూ పోవడం తప్పనిసరి.
సాధించాల్సిందెంతో...
భారత్‌లో సేంద్రియ సాగు(India organic farming) శైశవ దశలోనే ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్లకు పైమాటే. అందులో సేంద్రియ సాగు దాదాపు 27లక్షల హెక్టార్లలో మాత్రమే సాగుతోంది. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో సేంద్రియ వాటా రెండు శాతమే. స్విట్జర్లాండ్ జర్మనీలకు చెందిన సేంద్రియ పరిశోధన సంస్థలు చేపట్టిన ఒక సర్వే ప్రకారం 2018లో సేంద్రియ సాగులో ఆస్ట్రేలియా మూడున్నర కోట్ల హెక్టార్లతో అగ్రస్థానంలో ఉంటే- అర్జెంటీనా, చైనా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ సాగులో పదో స్థానంలో ఉంది. ప్రపంచ సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల్లో అమెరికా మొదటిస్థానంలో(42శాతం), ఐరోపా దేశాలు రెండో స్థానంలో(38.5శాతం), చైనా మూడోస్థానంలో(8.3శాతం) నిలుస్తున్నాయి.
-పరిటాల పురుషోత్తం (రచయిత- సామాజిక, ఆర్థిక విశ్లేషకులు)
ఇవీ చూడండి