India Russia relations: విశ్వసనీయ భాగస్వామిగా ఇటీవల ఇండియాను అభివర్ణించిన రష్యా- చిరకాల మిత్రులమైన తమ మధ్య ఎటువంటి భిన్నాభిప్రాయాలు, అపోహలు లేవని ప్రకటించింది. వాస్తవంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో భారత పొత్తుపై కొన్నాళ్లుగా మాస్కో చిర్రుబుర్రులాడుతోంది. ఇండో-పసిఫిక్ చతుర్భుజ కూటమి(క్వాడ్)ని చైనాకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం పన్నిన వంచనా వ్యూహమని ఈసడిస్తోంది. ఉక్రెయిన్‌తో కయ్యానికి కాలుదువ్విన దరిమిలా పాశ్చాత్య ప్రపంచానికి పోనుపోను దూరమవుతున్న క్రెమ్లిన్, క్రమేణా డ్రాగన్‌కు చేరువవుతోంది. పాకిస్థాన్‌తోనూ మాటామంతీ నెరపుతోంది.
ఇండో-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలు ఒడుదొడుకులకు లోనవుతున్న తరుణంలో దిల్లీకి విచ్చేసిన ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్- భారతదేశాన్ని బలీయశక్తిగా శ్లాఘించారు. ఆయనను సాదరంగా స్వాగతించిన ప్రధాని మోదీ, ఇరుపక్షాల నడుమ పటిష్ఠ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆకాంక్షించారు. ప్రాంతీయ విశ్వాసం, అంతర్జాతీయ భద్రతల కోసం సమష్టి కృషిని ద్విగుణీకృతం చేయాలన్న ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల తొలి '2+2 భేటీ'- సానుకూల సందేశాన్నే అందించింది. అఫ్గానిస్థాన్ అనిశ్చితిని ప్రస్తావించిన భారత్, మధ్య ఆసియాతో పాటు వివిధ ప్రాంతాలను అది ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తపరచింది.
India Russia deal
పుతిన్ భారత పర్యటన స్వల్ప సమయానికే పరిమితమైనా- కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించినట్లు, ఫలప్రదమైంది. సైనిక, సాంకేతిక సహకార సంబంధాలను మరో దశాబ్ద కాలం కొనసాగించడం, ఇండియాకు అత్యవసరమైన ఆరు లక్షలకు పైగా ఏకే-203 తుపాకుల తయారీతో పాటు మొత్తం 28 కీలక ఒప్పందాలు, అవగాహన ఒడంబడికలపై ఈ సందర్భంగా సంతకాలయ్యాయి. పరస్పర అభివృద్ధి, శాంతి సౌభాగ్యాలే ఆశయంగా అంతర్గత జలమార్గాలు, ఎరువుల వంటి రంగాల్లో దీర్ఘకాల సహాయ సహకారాలను అభిలషించిన రెండు దేశాలు- ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను ద్విగుణీకృతం చేయాలని నిశ్చయించాయి. వార్షిక శిఖరాగ్ర సదస్సుల్లో ఆ మేరకు లోగడే ఘనమైన లక్ష్యాలు ప్రకటితమైనా, ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా ఉంది!
India Russia trade:
భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 సంవత్సరం కల్లా మూడు వేల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరింపజేయాలని రెండేళ్ల నాటి సదస్సులోనే తీర్మానించారు. సరిహద్దుల్లో నిరంతరం వివాదాలు కొనసాగుతున్నా చైనాతో ఇండియా వాణిజ్య విలువ పది వేల కోట్ల డాలర్లకు చేరుకుంది. చిరకాల నేస్తమైన రష్యాతో మాత్రం అది వెయ్యి కోట్ల డాలర్లకే పరిమితమైంది. అణు, ఇంధనాది రంగాల్లో అందెవేసిన చెయ్యిగా గుర్తింపు పొందిన మాస్కోతో వాణిజ్య అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ సమధిక ప్రాధాన్యమివ్వాలి. గడచిన ఏడు దశాబ్దాలుగా ఇండియా సైనిక అవసరాలను కాచుకోవడంలో రష్యా కీలకపాత్ర పోషిస్తోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, ఐరోపా దేశాల నుంచి రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న భారత వైఖరి ఆ దేశానికి కంటగింపు అవుతోంది. ఆ లోటును పూడ్చేలా, అమెరికా హుంకరింపులను తోసిరాజని మరీ రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అతిత్వరలోనే అందుబాటులోకి రానున్న ఆ రక్షాకవచం- దేశ ఉత్తర సరిహద్దును దుర్భేద్యం చేయనుంది.
కాలపరీక్షకు నిలిచిన మైత్రి..
'ఒక దేశానికి స్నేహహస్తం చాస్తున్నామంటే, మరొకరికి దూరమవుతున్నట్లు కాదు' అని భారత ప్రధానిగా వాజ్‌పేయీ ఏనాడో స్పష్టీకరించారు. పక్కలో బల్లెం వంటి పాకిస్థాన్ కుయుక్తులు, వాటికి వంత పాడుతున్న చైనా దూకుడుకు పగ్గాలు వేయాలంటే క్వాడ్‌లో భారత భాగస్వామ్యం తప్పనిసరి! దేశ ప్రయోజనాల లక్ష్యంగా ప్రాంతీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే, డ్రాగన్‌కు రష్యా మరింత సన్నిహితం కాకుండా ఇండియా జాగ్రత్త వహించాలి. భద్రతాపరంగా భారతదేశ ఆందోళనలను అర్థం చేసుకుంటూ మాస్కో కూడివస్తేనే- కాలపరీక్షకు నిలిచిన మైత్రిగా ఇరు దేశాల అనుబంధం ఉభయతారకమై వన్నెలీనుతుంది!
ఇదీ చదవండి: చిరకాల చెలిమి.. కదనాన బలిమి!