భారత్, పాకిస్థాన్, చైనా దేశాలు 2020 ఏడాదిలో తమ అణ్వాయుధాలను పెంచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆయుధాల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. ఈ మూడు దేశాల్లో మాత్రం ఆయుధాలు పెరిగాయని సిప్రి(స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
సిప్రి నివేదిక ప్రకారం.. 2020లో భారత్ వద్ద 150గా ఉన్న అణ్వాయుధాల సంఖ్య 2021 జనవరి నాటికి 156కు పెరిగింది. ఇదే సమయంలో చైనా తన ఆయుధాలను 320 నుంచి 350కు, పాకిస్థాన్ 160 నుంచి 165కు పెంచుకున్నాయి. ఈ మూడు దేశాలు కలిపి గతేడాది 41 కొత్త అణ్వాయుధాలను అందుబాటులోకి తెచ్చాయి.
సగం అమెరికా, రష్యాలవే
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినప్పటికీ.. వాడుకకు సిద్ధంగా ఉన్న న్యూక్లియర్ ఆయుధాల సంఖ్య 3,720 నుంచి 3,825కు పెరిగింది. ఇందులో 50 శాతం వాటా అమెరికా(1,800), రష్యా(1,625) దేశాలవే కావడం గమనార్హం.
అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాల వద్ద 2020 ప్రారంభంలో 13,400 అణ్వాయుధాలు ఉండగా.. 2021 జనవరి నాటికి ఈ సంఖ్య 13,080కి తగ్గింది.
(సంజయ్ బారువా, సీనియర్ పాత్రికేయులు)