ETV Bharat / opinion

వేడెక్కుతున్న సాగరాలు- భూతాపంతో విపత్తులు

భీకర తుపానులన్నింటికీ ఎక్కువ శాతం బంగాళాఖాతమే కారణమవుతుండటం గమనార్హం. సాధారణంకన్నా మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందువల్లే బంగాళాఖాతంలో పెను తుపానులు ఏర్పడుతున్నాయనేది నిపుణుల మాటల్లోని సారాంశం. సముద్రంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి కారణం- వాతావరణంలో కలుగుతున్న అనూహ్య పరిణామాలే.

Increase in temperature of sea is a threat to human
ఎన్నడూ లేని విధంగా 'వేడెక్కుతున్న' సముద్రం
author img

By

Published : May 24, 2020, 7:00 AM IST

బంగాళాఖాతంలో ఏటా మే-జూన్‌ నెలల మధ్య కనీసం అయిదు తుపానులు, అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యలో మరో నాలుగు తుపానులు విరుచుకుపడుతున్నాయి. భీకర తుపానులన్నింటికీ ఎక్కువ శాతం బంగాళాఖాతమే కారణమవుతుండటం గమనార్హం. సాధారణంకన్నా మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందువల్లే బంగాళాఖాతంలో పెను తుపానులు ఏర్పడుతున్నాయనేది నిపుణుల మాటల్లోని సారాంశం. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల సముద్ర ఉపరితలం మీద ఏర్పడుతున్న వేడి, తేమ నుంచే తుపానులు సాధారణంగా శక్తిని గ్రహించుకుని బలపడతాయి. ఈ సంవత్సరం బంగాళాఖాతం సముద్ర ఉపరితలం మీద గరిష్ఠ వేసవి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడుతున్న ఉద్గారాలు భూతాపానికి కారణమవుతున్నాయి. తద్వారా సముద్రాలూ వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితలం బాగా వేడెక్కిందని గణాంకాలు చెబుతున్నాయి.

అసాధారణ ఉష్ణోగ్రతలు

ఈ నెలలో వరసగా మొదటి, రెండో వారంలో బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావడం సముద్ర జలాల వేడి తీవ్రతను ధ్రువీకరిస్తోంది. ఈ స్థాయి ఉష్ణోగ్రత భూ ఉపరితలంపై సాధారణమే అయినప్పటికీ, సముద్ర ఉపరితలంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి కారణం- వాతావరణంలో కలుగుతున్న అనూహ్య పరిణామాలే. తుపానుల తీవ్రత కూడా అంతకంతకూ పెరుగుతుండటాన్ని గమనించవచ్చు. 18 గంటల వ్యవధిలోనే తుపాను కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5కు పెరగడం అసాధారణ పరిణామంగా భావించవచ్చు. గత ఏడాది బంగాళాఖాతంలో 'ఫొని' తుపాను (కేటగిరీ 4) కూడా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే సంభవించి ఒడిశా తీరాన్ని ముంచెత్తింది. వేసవి కాలంలో సముద్రాల్లో సంభవించే ఈ ఉష్ణమండల తుపానులు సాధారణమైనవేనని, అంతేగాక రుతు పవనాల రాకకు ప్రధానంగా దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవి అసాధారణ రీతిలో విరుచుకుపడి భారీ ఆస్తినష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగాళాఖాతానికే పరిమితం కాకుండా అరేబియా, హిందూ మహా సముద్రాల్లోనూ ఉత్పన్నమయ్యే ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే పెరుగుతున్న భూతాపం తాలూకు దుష్పరిణామాలు అన్ని సముద్ర జలాలు వేడెక్కటానికి, జలమట్టాలు పెరగడానికి కారణమవుతున్నాయన్నది సుస్పష్టం. దీనికితోడు దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, కర్బన ఉద్గారాలు ఇండో-గంగా మైదాన ప్రాంతాల మీదుగా బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తూ సముద్ర ఉపరితలంపై మేఘాలు ఆవరించడానికి దారి తీస్తున్నాయి. ఫలితంగా తక్కువ పరిమాణంలోని మేఘాలపై సముద్ర జలాల నుంచి పుట్టే అతి వేడి సెగలు తుపానులు బలపడటానికి దోహదకారిగా పని చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పరిస్థితుల మూలంగా సాధారణంకన్నా ఒకటి నుంచి మూడు డిగ్రీల సెల్సియస్‌ మేర సముద్ర జలాలు వేడెక్కాయని ఇందుకు సంబంధించి పరిశోధనలు చేపడుతున్న పుణెలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ సంస్థ శాస్త్రవేత్తల బృందం సూత్రప్రాయంగా ప్రకటించింది. దీనిపై కచ్చితమైన సమాచారం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. లాక్‌డౌన్‌ మూలంగా పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యకారక ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోయాయి. కానీ, బలమైన తుపానులు ఏర్పడి వాతావరణ మార్పులు చోటుచేసుకోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

నియంత్రణే మార్గం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- వడగాడ్పులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయం, ఆర్థిక, పర్యావరణ రంగాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. భూగోళం నానాటికీ వేడెక్కుతుండటంతో తద్వారా సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమవుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతలు చల్లబడే పరిస్థితులు లేనప్పుడు ఆకస్మికంగా పెరిగే ఉష్ణోగ్రతలు మెదడును దెబ్బతీస్తాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితేనే 50 కోట్ల మంది ప్రజలకు ఆవాసమైన ప్రాంతాలు ప్రభావితమవుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందున్న నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికే భూగోళం మీద 1.2 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అదే ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే 120 కోట్ల మంది ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందనేది వాతావరణ మార్పుల అధ్యయనాలు వెల్లడిస్తున్న కఠోరవాస్తవం. ఆకస్మిక వరదలు, హుద్‌హుద్‌, ఐలా, అంపన్‌ వంటి పెను తుపానులు, కరవు కాటకాలు, సముద్ర జలమట్టాలు పెరగడం, సముద్ర జలాలు వేడెక్కడం వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించాలంటే భూతాపం పెరగకుండా చూడటమే ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం.

- మనస్వి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.