శరవేగంతో పరుగులు తీస్తున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణలవల్ల ప్రపంచ మౌలిక సదుపాయాల రంగం వేగంగా పురోగమిస్తోంది. నిర్మాణాలకు ఇసుక అవసరం గణనీయంగా పెరుగుతోంది. ఇసుక అందుబాటుతో పోలిస్తే వినియోగం అధిక స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక (2019) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నీటి తరవాత అత్యధిక వాడకం ఇసుకదే కావడంవల్ల- రానున్న రోజుల్లో పర్యావరణానికి ఇది తీవ్ర విఘాతం కలిగించనుందని తక్షణమే తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని హెచ్చరించింది.
సహజ వనరుగా 'ఇసుక'
ప్రపంచవ్యాప్తంగా సుమారు 85శాతం నుంచి 90శాతం ఇసుకను క్వారీల నుంచి సేకరిస్తారు. ఇసుకను సహజ ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. నదుల్లో నీటిప్రవాహాలవల్ల ఏర్పడే ఇసుక- రేణువుల రూపం పలు కోణాల్లో నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. ఎడారుల్లో ఇసుక గాలివల్ల ఏర్పడటంవల్ల ఆ రేణువులు గుండ్రంగా ఉంటాయి. ఆ ఇసుకను పారిశ్రామిక అవసరాలకు వాడతారు. తీరప్రాంతాల్లో సముద్రపు అలల కారణంగా తీరం ఒడ్డుకు కొట్టుకొని వచ్చే ఇసుక ఉప్పగా ఉంటుంది. దీనికి ఇనుమును నాశనం చేసే రసాయనిక లక్షణం ఉండటంవల్ల నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువే.
అక్రమ పద్ధతులతో నష్టం అపారం
‘స్టాటిస్టా (2020)’ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2019లో ఇసుక లభ్యతలో అమెరికా అగ్రస్థానంలో, భారత్ ఆరో స్థానంలో ఉన్నాయి. వినియోగంలో మాత్రం చైనా ప్రథమ స్థానంలో, ఇండియా రెండో స్థానంలో ఉన్నాయి. ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరగడం- 21వ శతాబ్దపు సమస్యల్లో ఒకటిగా నిలిచింది.
ఈ ప్రక్రియ నదుల భౌగోళిక స్వరూపాలను, నీటి ప్రవహాల గమనాలను మారుస్తుంది. ఫలితంగా, వరదలు, కరవు సంభవించే ప్రమాదం ఉంది.
నదుల పరీవాహక ప్రాంతాల్లో సారవంతమైన మృత్తిక కోతకు, భూక్షయానికి దారి తీసి, పంటల దిగుబడి తగ్గుతుంది. మంచినీటి, సముద్ర మత్స్య, జల పర్యావరణ, వన్య జాతుల వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఆనకట్టల పునాదుల స్థిరత్వం దెబ్బతిని, వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.
ఒక్కోసారి దీవులు కూడా అంతరించి పోతాయి. ఉదాహరణకు గడచిన రెండు దశాబ్దాల కాలంలో సింగపూర్ అధిక స్థాయిలో ఇండొనేసియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకోవడంవల్ల అక్కడి చాలా దీవులు మాయమయ్యాయి.
భారత్‌లో వివాదాస్పదంగానే?
భారత్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇది ఎప్పుడూ వివాదాస్పద సమస్యగానే మిగిలిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఇసుక మాఫియా. ఇసుక తవ్వకాలు ఆర్థిక లాభాలతో ముడిపడి ఉండటంవల్ల వ్యవస్థీకృత ముఠాలు తయారై ఇసుక తవ్వకాలను తీవ్రతరం చేస్తున్నాయి.
ఈ మాఫియాకు రాజకీయ అండదండలు ఉండటంవల్ల ప్రభుత్వ అధికారులు ఇసుక తవ్వకాల విషయంలో సరైన నియంత్రణ చేపట్టలేకపోతున్నారు. కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన కొందరు అధికారులను ఈ మాఫియా బలి తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
'అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేలా '
భారత్‌లో నదుల సంరక్షణకోసం 2013లో సరైన పర్యావరణ అనుమతి లేకుండా ఇసుక తవ్వడాన్ని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ అక్రమ ఇసుక తవ్వకాలు ఏ మాత్రం తగ్గలేదు. 2016లో స్థిరమైన ఇసుక తవ్వకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. ఆశించిన ఫలితాలు రాలేదు.
మళ్ళీ 2020 జనవరిలో కొత్త ఇసుక తవ్వకాల కోసం ‘అమలు, పర్యవేక్షణ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం నదులను పలు జాతుల ఆవాసాలను రక్షించాల్సి ఉంది. ఇసుక తవ్వకాల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించాలి. పర్యావరణ అనుమతులు, ఆడిట్ వంటివి కచ్చితంగా అమలయ్యేలా చూడాలి.
కేంద్ర గనుల శాఖ అక్రమ ఇసుక తవ్వకాలను ఆరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనే సౌకర్యాలను కూడా కల్పించింది. ఈ మార్గదర్శకాలను సమర్థంగా నిర్వర్తించడానికి చిత్తశుద్ధి అవసరం. భారత్‌లోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇసుక తవ్వకాల్లో నిబంధనలను సక్రమంగా అమలు చేస్తేనే పర్యావరణాన్ని కాపాడగలం.
కఠిన ఆంక్షలు తప్పనిసరి
సమర్థమైన విధానం, ప్రణాళిక, నియంత్రణ, నిర్వహణ లేకుండా- ప్రపంచంలో ప్రజలందరి అవసరాలను తీర్చడానికి కావలసిన పరిమాణంలో ఇసుకను సేకరించడం, అందించడం చాలా క్లిష్టతరమైన సమస్య అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ నివేదిక (2019) పేర్కొంది. అందుకే ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇసుక వెలికితీతను తగ్గించడానికి కఠినమైన రీసైక్లింగ్ మౌలిక సదుపాయలను అమలు చేయాలి. అమెరికాలో మాదిరి రీసైకిల్ కాంక్రీటును రహదారులకు కంకరగా ఉపయోగించడంవల్ల ఇసుక వాడకం తగ్గుతుంది.
ఇసుకలో ఉన్న గాజును రీసైక్లింగ్ చేయవచ్ఛు కాంక్రీటులో ఇసుకకు బదులుగా ప్లాస్టిక్‌ను ఉపయోగించవచ్చని 2018లో బాత్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్), గోవా ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. కాంక్రీటులో ఉపయోగించే ఇసుకలో పదిశాతం మేర ప్లాస్టిక్ వాడితే పెద్దయెత్తున ఇసుకను ఆదా చేయవచ్చునని ఈ సంయుక్త అధ్యయనం వెల్లడించింది.
తద్వారా నదులు, సముద్ర తీర ప్రాంతాలు తమ సహజ, భౌగోళిక స్వరూపాలను కాపాడుకోవటానికి ఆస్కారమేర్పడుతుంది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో సహకారంతో పని చేసినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలం.
-ఆచార్య నందిపాటి సుబ్బారావు, భూగర్భ రంగ నిపుణులు.
ఇదీ చదవండి:ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు