పంట ఉత్పత్తుల విక్రయాలు, వాటిపై ముందస్తు ఒప్పందాలకు సంబంధించి రెండు ఆర్డినెన్సుల జారీకి, నిత్యావసర వస్తువుల చట్ట సవరణకు మోదీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తద్వారా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా ఎవరికైనా విక్రయించుకోగల స్వేచ్ఛ నవచరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వం అభయమిస్తోంది. ఒప్పందం మేరకు చెల్లింపుల్లో జాప్యం జరిగితే కోర్టు బయటే పరిష్కరించుకోవాలట! అటువంటప్పుడు బడా వ్యాపారులతో బక్కరైతు ఎలా నెగ్గుకురాగలడు? దేశంలో ఏ రకం పంటకు ఎంత గిరాకీ ఉందో ఆరా తీసి అనువైనచోట అమ్ముకోగల వెసులుబాటు రెండు మూడెకరాల రైతుకు ఎక్కడుంది? ఇప్పటికే ప్రవేశపెట్టిన 'ఈ-నామ్' విధానం ఇంకా కుదురుకోనప్పుడు, దేశవ్యాప్తంగా 82శాతం మేర ఉన్న సన్న చిన్నకారు రైతులు కోరినచోట అమ్ముకుని లబ్ధి పొందగలరన్నది పగటికలే. వివిధ పంటలకు మద్దతు ధరల పేరిట వార్షిక క్రూర పరిహాసాలు... అన్నదాతల జీవనభద్రతను ఎండమావి చేస్తున్నాయి. రైతులు పండించే పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సాగుదారుల కష్టానికి సరైన ప్రతిఫలం లభింపజేసే మార్గం అదొక్కటే. ఆ సంగతి విస్మరించి, విపణి బంధనాలనుంచి స్వేచ్ఛ ప్రసాదిస్తున్నామంటూ రైతుల పట్ల విధ్యుక్తధర్మ నిర్వహణను ప్రభుత్వం దులపరించేసుకోవడం- బాధ్యతారాహిత్యమే!
సమగ్ర సేద్య ప్రణాళిక?
ఆదాయం పెరిగి రైతు నిలదొక్కుకున్నప్పుడే దేశీయ సేద్య ఉత్పత్తి ఇనుమడిస్తుందని ఆరేళ్ల క్రితం ప్రధాని మోదీ సహేతుకంగా విశ్లేషించారు. అదియథాతథంగా ఆచరణ రూపం దాల్చి, రేపటి తరాలూ సుక్షేత్రాల్లో సిరుల పంటవైపు ఆకర్షితులు కావాలంటే- ఈ వ్యవసాయ ప్రధాన దేశంలో విస్తృత ప్రణాళిక ఉండితీరాలి. అమెరికా తరవాత ఇక్కడే అత్యధికంగా సేద్యయోగ్య భూములున్నా, శాస్త్రీయ పంటల ప్రణాళిక లేకుండా పోవడం- అన్నదాతల బతుకుల్ని ఛిద్రం చేస్తోంది. భారత్‌కన్నా తక్కువ వ్యవసాయానుకూల నేలలు కలిగిన చైనా 95 శాతందాకా ఆహార అవసరాల్ని సొంతంగానే తీర్చుకుంటుండగా- మనం పప్పులు, నూనెలు, ఉల్లిపాయల్ని సైతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ దుర్దశను అధిగమించేందుకు- దేశంలోని నూట పాతికకుపైగా వేర్వేరు వాతావరణ జోన్లలో భూసారం, నీటి లభ్యత, స్థానిక అనుకూలతలను మదింపు వేస్తూ విస్తారంగా 'మ్యాపింగ్' చేపట్టాలి. దేశీయ అవసరాలు, వెలుపలికి ఎగుమతి అవకాశాల్ని క్షుణ్నంగా గణించి, ఆ మేరకు విదేశాలతో ముందస్తు ఒప్పందాలూ కుదుర్చుకుని, ఎక్కడ ఏ పంటకు అనుకూలమో అక్కడ అది పండించేలా రైతాంగానికి ప్రోత్సాహకాలు అందించాలి. తుపానులు వరదలు కరవుకాటకాలు ఉష్ణ పవనాలు... ప్రతిదీ సాగుదారులకు యమగండమే. రుణలభ్యత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దశనుంచి విపణిలో విక్రయాలు ముగిసేదాకా అడుగడుగునా రైతాంగానికి సుడిగుండాల పెనుముప్పే ఆ ఒడుదొడుకుల బారినుంచి కర్షకుల్ని ప్రభుత్వమే కాచుకోవాలి. భారతీయ రైతులు ఎన్నడూ శ్రమకు వెనుదీయరు. తాము చేసిన కృషికి, పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న భరోసా వారికి లభించాలి. స్వామినాథన్ చెప్పినట్లు- అన్ని అంశాల్నీ పరిగణించి వాస్తవిక సేద్య వ్యయాన్ని లెక్కించి, ఆ మొత్తానికి యాభైశాతం అదనంగా జతచేస్తేనే గిట్టుబాటు చేకూరినట్లు. అది కొరవడి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న రైతులను దీటైన చర్యలతో నిలువరించకపోతే దేశం ఆహార సంక్షోభం పాలబడే ముప్పు పొంచి ఉంది. గిడ్డంగులు, మార్కెటింగ్, మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టి సమగ్ర సేద్య ప్రణాళిక అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధమైతేనే- రైతు కోలుకుంటాడు; జాతి స్థిమితపడుతుంది!
ఇదీ చూడండి: భారత్- చైనా సైనికాధికారుల భేటీలో కీలక అంశాలివే!