తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం జలాశయంలో భారీ ఎత్తున పూడిక పేరుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏటా రెండు నుంచి మూడు టీఎంసీలదాకా తగ్గుతోంది. శ్రీశైలం అసలు నీటి నిల్వ సామర్థ్యం 308.60 టీఎంసీలు; ప్రస్తుతం అది 215.80 టీఎంసీలకు పడిపోయింది. అంటే, దాదాపు 92టీఎంసీల నిల్వ తగ్గింది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకే పూడిక సమస్య అధికంగా ఉన్నట్లు గతేడాది కేంద్రం స్పష్టంచేసింది. పూడిక వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోని జలాశయాలు 50శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లు అంచనా. పూడిక వల్ల నాగార్జునసాగర్ జలాశయం 40.73శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లు 2009లోనే గుర్తించారు. తెలంగాణలోని నిజాంసాగర్ జలాశయం 60.47శాతం నీటి నిల్వను కోల్పోయినట్లు 1992 సర్వేలో వెల్లడైంది.
అవరోధంగా పూడిక సమస్య..
కేంద్ర జల్‌శక్తి శాఖ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశంలోని జలాశయాలన్నీ కలిపి ప్రస్తుతం 25 వేల కోట్ల ఘనపు మీటర్లకు పైగా నీటిని నిల్వ చేయగలవు. దీన్ని భవిష్యత్తులో 38 వేల కోట్ల ఘనపు మీటర్లకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నానాటికీ అధికమవుతున్న పూడిక సమస్య ఆ లక్ష్యానికి అవరోధంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలో 36 జలాశయాల్లో పూడిక సమస్య అధికంగా ఉంది. ఫలితంగా వాటి వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే 39శాతం కోసుకుపోయినట్లు జల్‌శక్తి నివేదిక స్పష్టంచేసింది. పూడిక వల్ల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో నీటి సరఫరా అందదు. జలాశయ సొరంగాలు, గోడలు వంటివన్నీ దెబ్బతింటాయి. పూడికకు దగ్గరలోని పవర్ టర్బైన్లు సైతం పాడవుతాయి. సిమ్లాలో 412 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే రామ్‌పూర్ ప్రాజెక్టులో పూడిక ఎక్కువవడంతో విద్యుదుత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. పూడిక తొలగించాకే మళ్ళీ ఉత్పత్తి మొదలైంది. దేశంలోని అతి పెద్ద జలాశయాల్లో ఒకటైన పంజాబ్‌లోని భాక్రా ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 927 కోట్ల ఘనపు మీటర్లు. పూడిక వల్ల 213 కోట్ల ఘనపు మీటర్ల మేర అందులో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. తుంగభద్ర జలాశయంలో సైతం పూడిక సమస్య తీవ్రంగా ఉంది. కర్ణాటకలోని నారాయణపూర్, మలప్రభ జలాశయాలు సైతం పూడిక వల్ల గరిష్ఠ నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి.
శ్రీశైలం జలాశయంలో..
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో అడవులను నరికివేయడం వల్ల భూమి కోతకు గురై వరదల సమయంలో మట్టి కొట్టుకువచ్చి జలాశయాల్లో మేట వేస్తోంది. 2009 వరదల సమయంలో ఈ పూడిక మరింత అధికంగా శ్రీశైలం జలాశయంలో చేరింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆరేళ్లకు ఒకసారి జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూడికను అంచనా వేయడానికి ముంబయికి చెందిన 12 మంది నిపుణులు హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన పడవల్లో ఎకో సౌండ్ పరికరాల ద్వారా శబ్దాన్ని జలాశయంలోకి పంపి ఎంత లోతులో పూడిక పేరుకుపోయిందో లెక్కిస్తారు. పూడికను తొలగించేందుకు డ్రెడ్జింగ్ విధానంలో జలాశయంలో చేరిన ఒండ్రు మట్టిని కలియబెట్టి భారీ పంపులతో దాన్ని బయటకు పంపించాలి. చుట్టూ ఎత్తయిన కొండలు, నల్లమల అటవీ ప్రాంతం ఉన్నందువల్ల శ్రీశైలం జలాశయంలో ఈ పద్ధతిలో పూడిక తీయడం సాధ్యపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒండ్రుమట్టి సారవంతమైంది కనుక బయటకు తీశాక వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో వినియోగించుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
ఏదైనా జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లో నీటిలో మట్టిని 10శాతం తగ్గించగలిగితే జలాశయ జీవితకాలం 15-20 ఏళ్లు పెంచవచ్చు అన్నది నిపుణుల అంచనా. అడవులను పెంచడం వల్ల నీటి ప్రవాహంలో చేరే మట్టిని తగ్గించవచ్చని భాక్రా బేస్ మేనేజ్‌మెంట్ బోర్డు అధ్యక్షులు డీకే శర్మ గతంలోనే పేర్కొన్నారు. జపాన్‌లో జలాశయాలకు అనుబంధంగా 15మీటర్ల ఎత్తులో భారీ సంఖ్యలో పూడికను నిల్వచేసే జలాశయాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టిని అడ్డుకుంటాయి. ఫలితంగా పూడిక సమస్య తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల జలవివాదాల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం నదీ జలాల లెక్కలు, ప్రాజెక్టుల పరిస్థితి అంచనా వేసే పనిలో తలమునకలైంది. పనిలోపనిగా పూడికపైనా దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని జలవనరుల రంగ నిపుణులు సూచిస్తున్నారు.
- యడ్లపాటి సురేంద్ర