నిరుడు మహా శ్రీమంతులు పదేపదే వార్తలకెక్కారు. ముఖ్యంగా ట్విట్టర్‌ను 4,400 కోట్ల డాలర్లకు కొని ఎలాన్ మస్క్ చేతులు కాల్చుకున్నారు. వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపి స్వీయ ప్రతిష్ఠను స్వయంగా మంటగలుపుకొన్నారు. గతేడాది నవంబరులో 34,000 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అతి సంపన్నుడిగా మస్క్ ఖ్యాతికెక్కారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ఒడుడొడుకుల వల్ల 20,000 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయారు.
ఏకబిగిన భారీగా సంపదను పోగొట్టుకొన్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్రకెక్కారు. మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా షేర్ల విలువ బాగా పడిపోవడం దీనికి కారణం. టెస్లా తన కార్లపై భారీ రాయితీ ఇవ్వడమే కాకుండా, షాంఘైలోని కర్మాగారంలో ఉత్పత్తిని సైతం తగ్గించింది. టెస్లాలో తన వాటాలను మస్క్ అమ్ముకోవడం వల్ల, ఇప్పుడు ఆ కంపెనీ ఆయన ఆస్తుల్లో ప్రధానమైనది కాకుండా పోయింది. మరోవైపు ట్విట్టర్ వినియోగదారులను, వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్నీ కోల్పోతోంది.
సన్నగిల్లిన నమ్మకం...
ట్విట్టర్, టెస్లాల విషయంలో మస్క్ ఎదురుదెబ్బలు తిన్నా- ఆయన సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ, దానికి అనుబంధమైన స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థ వార్తలకు ఎక్కుతున్నాయి. ఉక్రెయిన్‌లో విద్యుత్, టెలికాం, ఇంటర్నెట్ సర్వీసులను రష్యా బాంబులు, క్షిపణులు ధ్వంసం చేసినా మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహాలు అక్కడి ప్రజలను ఆదుకొన్నాయి. ఆ ఉపగ్రహాల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి మస్క్ ఉక్రెయిన్‌లో 23,000 టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు.
అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ ఎరగని రీతిలో పదేపదే వడ్డీ రేట్లను పెంచుకొంటూ పోవడం మార్కెట్లో సంక్షోభాన్ని సృష్టిస్తోందని మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా మాత్రమే కాదు- ఫేస్‌బుక్ (మెటా), అమెజాన్, ఆపిల్, నెట్‌ఫ్లిక్స్, ఆల్ఫబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలతో పాటు ఇతర ఐటీ సంస్థల స్టాక్ మార్కెట్ విలువ భారీగా పతనమైంది.
పెరుగుతున్న వడ్డీ రేట్లు..
అమెరికాలో 1990, 2000 దశకాల్లో వడ్డీ రేట్లు చాలా స్వల్పంగా ఉండేవి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అవి దాదాపు సున్నా శాతానికి చేరాయి. దాంతో టెక్ కంపెనీలు భారీగా రుణాలు తీసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాయి. ఉద్యోగులనూ పెద్ద సంఖ్యలో నియమించుకొన్నాయి. స్టాక్ మార్కెట్లో టెక్ కంపెనీల షేర్ల విలువ నింగినంటింది. ఇప్పుడు వడ్డీ రేట్లు అదేపనిగా పెరుగుతూ షేర్ల విలువ పడిపోవడంతో టెక్ సంస్థలు పెద్దయెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
క్రిప్టోల పేరిట దార్శనికుడిగా, టెక్ యుగ వైతాళికుడిగా ప్రశంసలు అందుకొన్న శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్ సారథ్యంలోని ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసింది. మస్క్, బ్యాంక్‌మన్‌లతోపాటు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పైనా మదుపరుల నమ్మకం సన్నగిల్లింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తగిన సృజనాత్మక ఉత్పత్తులను, సేవలను టెక్ కంపెనీలు తీసుకురాలేక పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డబ్బున్న వాడిదే ఏలుబడి..!
ఆధునిక ప్రపంచంలో డబ్బున్న వాడిదే అధికారం అన్న చందంగా మారింది. నేడు అత్యంత ధనవంతులే చాలా దేశాలను పరిపాలిస్తున్నారు. వాటిలో అగ్రరాజ్యం రష్యాతోపాటు అబ్‌ఖాజియా వంటి చిన్న దేశమూ ఉంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తికి కలిపి 73 కోట్ల పౌండ్ల (రూ.7,200 కోట్ల) సంపద ఉంది. వారిద్దరి సంపద బ్రిటిష్ రాజు ఛార్లెస్ ఆస్తులు 37 కోట్ల పౌండ్లకన్నా దాదాపు రెట్టింపు. సౌదీ అరేబియా ప్రధానిగా నిరుడు పదవి చేపట్టిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సంపద 2,500 కోట్ల డాలర్లు (రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు).
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌ను అధికారికంగా చలామణీలోకి తెచ్చిన ఎల్ సాల్వడార్ శ్రీమంత అధ్యక్షుడు నాయీబ్ బుకెలె- క్రిప్టో సంక్షోభంతో దెబ్బతిన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అక్రమంగా సంపద కూడబెట్టారనే ఆరోపణలపై అభిశంసన తీర్మానాన్ని కొద్దిలో తప్పించుకొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు 20,000 కోట్ల డాలర్ల ఆస్తులు ఉండవచ్చని అమెరికా సెనెట్ ముందు ఒక ఫైనాన్స్ నిపుణుడు అంచనా వేశాడు. ఉక్రెయిన్‌పై దండయాత్రతో పుతిన్ ప్రతిష్ఠ మసకబారింది.
రష్యా కుబేరుల అనుమానాస్పద మరణాలు..
అనుమానాస్పద మరణాలుగతేడాది ఇరవై మందికి పైగా రష్యన్ సంపన్నులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారిలో చమురు పరిశ్రమకు చెందినవారు, ఉక్రెయిన్ యుద్ధ వ్యతిరేకులు సైతం ఉన్నారు. ఇద్దరు రష్యన్ ధనికులు భారత్‌లోని ఒడిశా రాష్ట్రంలో ఒక హోటల్‌లో మరణించారు. ఆ ఇద్దరిలో ఒకరైన పావెల్ ఆంతొవ్- హోటల్ కిటికీ నుంచి కిందపడి మృతి చెందారు.
రష్యాలో అతిపెద్ద ప్రైవేటు చమురు కంపెనీ లుకాయిల్ ఛైర్మన్ రవిల్ మెగానొవ్ సైతం మాస్కోలో ఒక ఆస్పత్రి కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. కొందరు సంపన్నులైతే ఉరి వేసుకుని మరణించారు. వారంతా పుతిన్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగినవారే. 2014-17 మధ్య ఇలాగే 38 మంది రష్యన్ కుబేరులు అనుమానాస్పదంగా అసువులు బాశారు. మొత్తంమీద నిరుడు ధనవంతుల నిర్ణయాలు, నష్టాలు, మరణాలు అన్నీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాయి. ఎందరిపైనో అవి ప్రభావం చూపాయి. ముఖ్యంగా పెద్దసంఖ్యలో ఉద్యోగాలకు కోతపడటం మాత్రం ఎన్నో కుటుంబాలకు తీవ్ర కుదుపే!
జనం ముందుకు...
టెక్ కుబేరులు గతేడాది లక్షల సంఖ్యలో మదుపరులకు, ఉద్యోగులకు కష్టనష్టాలు మిగిల్చారు. వాటిని చూస్తే నేటి డిజిటల్ ప్రపంచం అతి సంపన్నుల మీద ఎంతగా ఆధారపడుతోందో అవగతమవుతుంది. ఒకప్పుడు సంపన్నులు జనం కళ్లలో పడటానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. చాలా గోప్యతను పాటించేవారు. ప్రస్తుతం ప్రజాబాహుళ్యంలో అపర కుబేరుల పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి.
సమాచార సాంకేతిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి టెక్ సంపన్నులు ప్రపంచ భవిష్యత్తును వినూత్నంగా తీర్చిదిద్దగల మహా మేధావులుగా, లక్ష్మీపుత్రులుగా జనం ముందుకొచ్చారు. అమెరికా జనాభాలో అత్యున్నత అంచెలోని 0.00001శాతం అపర కుబేరుల సంపద గత నాలుగు దశాబ్దాల్లో 10 రెట్లు పెరిగింది. ప్రపంచ జనాభాలో అతి సంపన్నుల వాటా ఒక శాతం లోపే ఉంటుంది. ధనికులకు బ్రాండెడ్ దుస్తులు, నగలు, మద్యం వంటివి విక్రయించే ఎల్‌వీఎంహెచ్ సంస్థ అధినేత బెర్నార్డ్ ఆర్నో నేడు భూగోళంపై మస్క్‌కు బదులు అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
ఇవీ చదవండి :
పెళ్లి తర్వాత పాన్ కార్డుపై ఇంటి పేరు మార్చాలా? అయితే ఇలా చేయండి
రూపాయల్లో వాణిజ్యానికి దక్షిణాసియా దేశాలతో చర్చలు: RBI గవర్నర్