కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను రెండు విధాలుగా దెబ్బతీసింది. ఒకవైపు లాక్‌డౌన్ల వల్ల ఆదాయం తగ్గిపోయి అభివృద్ధి పడకేస్తే- మరోవైపు ఆరోగ్యం, రేషన్ సరకుల పంపిణీ వంటి సామాజిక సంక్షేమ చర్యలపై ఖర్చులు పెరిగిపోయాయి. ఈ రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులను సమతూకపరచడం ఎవరికైనా కష్టమే. ఆదాయంకన్నా ఖర్చులు పెరిగిపోతే ద్రవ్యలోటు హెచ్చి భారతదేశానికి అంతర్జాతీయ సంస్థలు రేటింగ్ తగ్గించేస్తాయి. దానివల్ల మన దేశానికి పెట్టుబడుల ప్రవాహం దెబ్బతింటుంది. అయినా ఈ ఏటి కేంద్ర బడ్జెట్ మధ్యేవాద పంథాలో సాగింది. చాలా దేశాలతో పోలిస్తే భారతదేశం ఆరోగ్య రంగానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తోందన్న విమర్శలు చిరకాలంగా ఉన్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దుకోవలసిన అవసరాన్ని కొవిడ్ మహమ్మారి ముందుకు తెచ్చింది. ప్రజారోగ్యంపై గతంలోకన్నా చాలా ఎక్కువగా నిధులు వెచ్చించక తప్పని స్థితిని కల్పించింది. అరకొర వసతులతో సతమతమవుతున్న భారత ప్రజారోగ్య వ్యవస్థకు గోరుచుట్టుపై రోకటిపోటులా కొవిడ్ వచ్చిపడింది.
ఆర్థిక మంత్రి సీతారామన్ 2021-22 బడ్జెట్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య రంగంలో పరిశోధన, ఆయుష్ విభాగాలకు కలిపి రూ.76,901 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది బడ్జెట్ అంచనా కన్నా 11 శాతం ఎక్కువ. గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత పెంపు ఇది. కానీ, మొత్తం ప్రభుత్వ వ్యయంలో ఆరోగ్య రంగ వాటా నిరుటిలాగే 2.21 శాతంగా ఉంది. దీన్ని ఎదుగూబొదుగూలేని స్థితిగా చెప్పాలి. ఇంకో విధంగా చూస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఆరోగ్య వాటా తగ్గించకపోవడం చెప్పుకోదగిన అంశమనిపిస్తుంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో మౌలిక వసతుల మెరుగుదలకు రూ.71,268 కోట్లు కేటాయించారు. ఇది నిరుటి బడ్జెట్ కన్నా తొమ్మిది శాతం ఎక్కువ. ఆయుష్ విభాగానికి రూ.2,970 కోట్లు, ఆరోగ్య రంగ పరిశోధనలకు రూ.2,663 కోట్లు కేటాయించారు. అయితే, బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ వాటా 2.21 శాతాన్ని మించకపోవడం వల్ల ప్రజలకు పెద్ద వెసులుబాటు కలగదు. వారి ఆస్పత్రి బిల్లులు ఏమీ తగ్గవు. ఇప్పటికే వారు ఆరోగ్యంపై సొంతంగా తమ జేబుల్లోనుంచి 63 శాతం వరకు ఖర్చుపెడుతున్నారు. చాలా కుటుంబాలు ఆస్పత్రి ఖర్చులు తట్టుకోలేక ఆస్తులు అమ్ముకొని దివాలా తీస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలూ పేదరికంలోకి జారిపోతున్నాయి.
పరిశోధనలకు నిధులు
ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన ప్రశంసనీయ పథకమనడంలో సందేహం లేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద అభివృద్ధి సాధనకు ఆరు మూలస్తంభాల్లో స్వాస్థ్య భారత్ ముఖ్యమైన మూల స్తంభం. ఈ పథకానికి బడ్జెట్లో రూ.64,180 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని ఆరేళ్లలో వెచ్చిస్తారు. గ్రామీణ, పట్టణ ఆరోగ్యం, స్వస్థత కేంద్రాలు, ప్రజారోగ్య పరిశోధనశాలలు, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆరోగ్య కేంద్రాల స్థాపన, రోగ నిరోధానికి ఉద్దేశించిన జాతీయ కేంద్రాల పటిష్ఠీకరణలకు ఈ నిధులు ఖర్చుచేస్తారు.
ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సంరక్షణ, రోగ వ్యాప్తిని వెంటనే పసిగట్టి రంగంలోకి దిగే యంత్రాంగాలు లేకపోతే జరిగే నష్టం అంతాఇంతా కాదని కొవిడ్ మహమ్మారి హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నియంత్రించాలంటే సువ్యవస్థిత యంత్రాంగం తప్పనిసరి అని చాటిచెప్పిన పరిణామమిది. ఈ కీలక విధుల నిర్వహణకు బడ్జెట్లో కేటాయించిన మొత్తాలు ఏమాత్రం చాలవు. ఈ కొద్ది మొత్తాలను సైతం వేర్వేరు పథకాలకు కేటాయించడంతో, ఏ పథకానికీ పూర్తి న్యాయం చేకూరకపోవచ్చు.
కొవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రత్యేకంగా రూ.35,000 కోట్లు కేటాయించడం హేతుబద్ధమే. అత్యధిక జనాభాకు టీకాలు వేయడానికి ఈ నిధులు తోడ్పడతాయి. మన ప్రజలకు ఎంత త్వరగా టీకాలు వేస్తే, అంత త్వరగా ఆర్థిక వ్యవస్థ కోలుకొంటుంది. అభివృద్ధి రథం తిరిగి పట్టాలెక్కుతుంది.పోషకాహారం, శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం లేనిదే ప్రజారోగ్యాలు మెరుగుపడవు. ఈ కార్యక్రమాలకు సైతం బడ్జెట్లో గణనీయ కేటాయింపులు చేశారు. నిరుటి బడ్జెట్లో తాగునీరు, పారిశుద్ధ్యానికి రూ.21,518 కోట్లు కేటాయిస్తే, ఈ ఏటి బడ్జెట్లో దాన్ని భారీగా పెంచి రూ.60,030 కోట్లు కేటాయించారు. ఇది మూడు రెట్ల పెరుగుదల. పోషకాహారానికి మాత్రం నిరుటి బడ్జెట్ కన్నా తక్కువ నిధులు కేటాయించడం నిరుత్సాహం కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం చాలవు.
సంపన్న రాష్ట్రాల్లోనూ బాలలు తమ వయసుకు తగిన ఎత్తు పెరగడం లేదని, బరువూ పెరగడం లేదని ఈ సర్వే తేల్చింది. దీనికి కారణాలేమిటో అంతుపట్టడం లేదు. యువతరం ఇలా గిడసబారిపోవడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. తిండి కలిగితేనే కండ కలదన్నది గురజాడ సూక్తి. తాజా బడ్జెట్ 112 జిల్లాల్లో 'మిషన్ పోషణ్' రెండో దశ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించడం స్వాగతించాల్సిన అంశమే కానీ, ఆచరణలో అదెంత వరకు ఫలితాలనిస్తుందో చూడాలి.
పాలపొంగు కారాదు
బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక సంఘ గ్రాంట్లు, తాగునీరు, పారిశుద్ధ్యాలకు ప్రత్యేక కేటాయింపులు కలిపి చూస్తే నిరుటికన్నా 43శాతం ఎక్కువ కేటాయింపులుగా లెక్కతేలతాయి. ఆరోగ్యమంటే కేవలం ఆస్పత్రులే కావు. ఆరోగ్య సంరక్షణకు బహువిధాలుగా సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య బీమా, పోషకాహారం, టీకాలు, పారిశుద్ధ్యం, తాగు నీరు- ఇవన్నీ సవ్యంగా ఉంటేనే ప్రజారోగ్యం పదిలంగా ఉంటుంది. 2018లో ప్రధానమంత్రి జనారోగ్య పథకాన్ని ప్రకటించినప్పుడు రాజకీయ వర్గాల్లో ఆరోగ్యం ప్రధాన చర్చనీయాంశమైంది. ఇప్పుడు తిరిగి కొవిడ్‌వల్ల అదే పరిస్థితి పునరావృతమైంది. టీకాలవల్ల కొవిడ్ అదుపులోకి వచ్చిన తరవాత ప్రజారోగ్యంపై ఇప్పుడున్న ఆందోళన తగ్గుముఖం పడితే లాభం లేదు.
భవిష్యత్తులోనూ మహమ్మారులు విరుచుకుపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరించడాన్ని గమనంలోకి తీసుకోవాలి. ప్రజారోగ్య సంరక్షణపట్ల ఇప్పుడు కనబరుస్తున్న ఉత్సాహం ఇకమీదటా కొనసాగాలి. ప్రభుత్వం హెచ్చు నిధులు కేటాయిస్తూనే ఉండాలి. భారత్‌తో పోలిస్తే వెనకబడిన దేశాలు సైతం ప్రజారోగ్యానికి ఎంతో ఎక్కువ మొత్తాలు ఖర్చు చేస్తున్నాయని మరవకూడదు. ఆర్థిక సర్వే సూచించిన ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 నుంచి మూడు శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలి. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉన్న వియత్నాం- కొవిడ్ గురించి ముందే తెలుసుకొని సత్వరం దిద్దుబాటు చర్యలకు దిగడం ద్వారా మహమ్మారిని అరికట్టగలిగింది. దీని నుంచి భారత్ తగు పాఠాలు నేర్చుకోవాలి.
- డాక్టర్ సరిత్ కుమార్ రౌత్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (భువనేశ్వర్)లో అనుబంధ ఆచార్యులు).
ఇదీ చదవండి:'పరువునష్టం కేసు నుంచి విముక్తి కల్పించండి'