కరోనా మహమ్మారి ఆరోగ్య రంగాన్నే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సెస్ రూపంలో అదనపు పన్నులు విధించడానికి అనుమతించాలని మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో సిక్కిం సర్కారు ప్రతిపాదించింది. దీనికి గోవా, అరుణాచల్‌ప్రదేశ్ పాలకులు వంతపాడారు. ఈ ప్రతిపాదనపై చర్చించడానికి మంత్రుల బృందం ఏర్పాటుకు జీఎస్టీ మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొవిడ్ సెస్‌పై 2021-22 కేంద్ర బడ్జెట్ సమయంలో జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ, దానివల్ల నష్టమే ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఆ ఆలోచనను విరమించుకుంది. కరోనా రెండో దశ వ్యాప్తితో కోట్ల జీవితాలు కుదేలవడంతో అదనపు పన్నుల ఊసే తలెత్తి ఉండకూడదు. కానీ, ప్రజావ్యతిరేక ఆలోచనలు మళ్లీ మొగ్గతొడిగాయి! సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే తప్పులు చేస్తున్నాయనడానికి ఇదో నిదర్శనం. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు చర్యలు తీసుకోకుండా, సమస్యల పరిష్కారానికి కేంద్రం సైతం సులభమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఇటువంటి పద్ధతులు దీర్ఘకాలంలో దేశానికి చేటుచేస్తాయి.
పన్నుల మోత
తప్పుడు నిర్ణయాల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో అస్తవ్యస్తమైంది. మూలిగే నక్కపై తాటిపండులా కరోనా సంక్షోభం అదనంగా వచ్చిపడింది. దీని పేరు చెప్పుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, పరోక్ష పన్నులను భారీగా పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు కొవిడ్ సెస్‌ను అమలు చేస్తే- నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యయ విధానాల కోసం పరోక్ష పన్నులపై ఆధారపడటం వంటి పొరపాట్లలోకి ఇదీ చేరుతుంది. ఆదాయం, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరూ సమానంగా కట్టాల్సిన పరోక్ష పన్నులు పేదలపై అధిక భారాన్ని మోపుతున్నాయి.
స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో ప్రత్యక్ష పన్నుల వాటా 15ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి 4.79 శాతానికి చేరింది. పరోక్ష పన్నుల వాటా నాలుగేళ్ల గరిష్ఠమైన 5.48 శాతాన్ని అందుకుంది. 2021 ఆర్థిక ఏడాదిలో స్థూల పన్ను ఆదాయం 0.73 శాతం పెరిగింది. ఎక్సైజ్ సుంకం సేకరణ రూ.3.89 లక్షల కోట్ల (మునుపటి కంటే 63శాతం ఎక్కువ)కు చేరగా, కస్టమ్స్ సుంకం వసూళ్లు రూ.1.35 లక్షల కోట్లకు(23శాతం ఎక్కువ) పెరిగాయి. అధిక పరోక్ష పన్నుల మూలంగానే ఈ సుంకాల వసూళ్లు ఇంతలంతలవుతున్నాయి. సర్‌ఛార్జీలనేవి 1941 నుంచే తెలిసినా.. 'సెస్'ల బాదుడు మాత్రం 2005 తరవాతే అధికమైంది. సెస్ రూపంలో వచ్చిన సొమ్మును ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తారు. అవి భారత ఏకీకృత నిధి (సీఎఫ్‌ఐ)లోకి వెళ్లవు. అందువల్ల అవి రాష్ట్రాలకు చేరవు. ఆర్థిక సంఘం నిర్దేశించినట్లుగా కేవలం ఏకీకృత నిధిలోని రెవిన్యూ వసూళ్లనే కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటుంది. సర్‌ఛార్జీలను అత్యవసర సమయాల్లో కాకుండా ప్రభుత్వాలు ఇష్టారీతిలో అమలు చేస్తూ వస్తున్నాయి. జీఎస్టీ వచ్చాక ఈ పద్ధతి మరింత ఘోరంగా మారింది.
జీఎస్టీతో పరోక్ష పన్ను వ్యవస్థ సులభతరం అవుతుందని, పన్ను స్లాబులు తగ్గిపోతాయని, పారదర్శకత ఎక్కువగా ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఇవేమీ నెరవేరలేదు సరికదా, పరోక్ష పన్నులు భారీగా పెరిగాయి. 2011-12లో స్థూల పన్ను ఆదాయాల్లో 10.4శాతంగా ఉన్న వీటి వాటా 2021 మార్చి నాటికి 19.90 శాతానికి ఎగబాకింది. 2012-20 మధ్య కాలంలో కేంద్రానికి సెస్, సర్‌ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం రెండింతలైంది. జీఎస్టీ పరిహార సెస్‌తో పాటు ఇతర సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో 2021-22లో కేంద్రం 4.74 లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తుందని అంచనా. ఇందులో ప్రత్యక్ష పన్నులపై విధించే సెస్, సర్‌ఛార్జీల మొత్తం కేవలం 1.47 లక్షల కోట్ల రూపాయలే. మిగిలినవన్నీ పరోక్ష పన్నులపై వచ్చేవే. ఇవే కాకుండా సుంకాలు, అదనపు సుంకాలు, ప్రత్యేక అదనపు సుంకాలంటూ ప్రభుత్వం మరో రూ.1.27 లక్షల కోట్లనూ వసూలు చేయబోతోంది!
పరిస్థితిని అదుపు చేయాలంటే..
కరోనా కారణంగా ఆదాయాలకు గండిపడి రాష్ట్రాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నది వాస్తవం. అలా అని సెస్‌ల రూపంలో ప్రభుత్వాలు పన్నులు పెంచకూడదు. ఇప్పటికే ఉన్న సెస్‌లతో వస్తున్న ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాలతో పంచుకోవాలి. చెల్లింపు సామర్థ్యం ఉన్న భారీ పరిశ్రమలపై పన్నులు విధించాలి. దేశంలోని 8.85 లక్షల కంపెనీల్లో 3,239 సంస్థలు పన్నులు చెల్లించక మునుపే 50 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జిస్తున్నాయని కేంద్ర బడ్జెట్ ప్రతులు చెబుతున్నాయి. వీటిలో 1,379 కంపెనీలు రూ.50-100 కోట్లు, 1,437 సంస్థలు రూ.100-500 కోట్లు, 423 పెద్ద కంపెనీలు రూ.500 కోట్లకుపైగా వార్షిక ఆదాయాన్ని గడిస్తున్నాయి. సాలీనా 500 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించే సంస్థలు 25.91 శాతం పన్నులను కడుతుంటే, వంద కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని పొందే కంపెనీలు 27.63 శాతం, 100-500 కోట్ల రూపాయల మధ్య ఆర్జించేవి 28.33 శాతం పన్నులను చెల్లిస్తున్నాయి. పన్నులు చెల్లించే మొత్తం కంపెనీల్లో ఈ మూడు విభాగాల సంస్థల వాటాయే 70 శాతానికి పైగా ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆదాయాలపై పన్నులు, పరోక్ష పన్నులను పెంచకుండా, ఈ సంస్థలపై ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలకూ మేలు జరుగుతుంది.
ఆర్థిక వ్యవస్థకు చేటు
నిరుడు కరోనా సంక్షోభం నెలకొన్నా పెట్రోలు ఉత్పత్తులపై ఉన్న సుంకాలు, సెస్‌ను పెంచడంతోనే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. పన్నుల మోతతో ధరలు పెరిగి పెట్రోలు, డీజిల్ వినియోగం 18 శాతం తగ్గిపోయినా కేంద్రం 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది. కానీ, ఈ పద్ధతి ఫలితంగా 2020 ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ నికర పన్ను ఆదాయం ఎనిమిది శాతానికి పడిపోయింది. అదే సమయంలో రాష్ట్రాలకు పంపించాల్సిన నిధులూ 21 శాతం తగ్గిపోయాయి. అంటే సెస్ ద్వారా ఎంత ఎక్కువ మొత్తాన్ని సేకరిస్తే.. రాష్ట్రాలకు అంత తక్కువ నిధులు అందుతాయని అర్థం. పరోక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలన్న కేంద్రం ఆలోచన, భారతీయుల వినియోగ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ గండిపడుతోంది. సెస్‌లు అధికమైతే అంతర్జాతీయ విపణిలో భారత వస్తువులు పోటీ పడలేవు. మరోవైపు.. ఏ పేరు చెప్పి సెస్‌లను అమలు చేస్తున్నారో ఆయా రంగాలకు ఆ నిధులను వినియోగించట్లేదు. 2018-19లో 35 రకాల సెస్‌లు, ఇతర ఛార్జీల రూపంలో 2.74 లక్షల కోట్ల రూపాయలు వసూలైతే, వాటిలో 1.64 లక్షల కోట్ల రూపాయలనే నిర్దేశిత అవసరాల కోసం వినియోగించినట్లు కాగ్ తేల్చింది.
--డాక్టర్ ఎస్. అనంత్(ఆర్థిక, సామజిక రంగ నిపుణులు).
ఇదీ చదవండి:'వారికి ముందుగానే రెండో డోసు'