ఎనిమిదేళ్లకు పైబడిన ట్రక్కులు ట్యాక్సీల వంటి వాణిజ్య వాహనాలు, పదిహేనేళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల సొంతదారులు ఇకమీదట ప్రత్యేక హరిత సుంకం చెల్లించాల్సిందేనన్నది, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ తాజా ప్రతిపాదన సారాంశం. వాహన కాలుష్యాన్ని నియంత్రించే కృషిలో భాగంగా పాతబడిన వాహనాల్ని వదిలించుకుని కొత్తవి కొనుగోలు చేసేలా పౌరుల్ని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం.
రాష్ట్రాలతో సంప్రతింపుల ప్రక్రియ ముగిశాక నియమానుసారం నోటిఫై చేయడం తరువాయి- వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటినుంచి హరిత సుంకం వసూళ్లు ఆరంభమవుతాయంటున్నారు. 'గడువు తీరిన' వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ కోరేటప్పుడు రహదారి సుంకంలో 10-25శాతం దాకా అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, తీవ్ర కలుషిత నగరాల్లో ఆ మొత్తం 50శాతం వరకు పెరుగుతుందని కొత్త ప్రతిపాదన చాటుతోంది. విద్యుత్తు, సీఎన్‌జీ, ఇథనాల్, ఎల్‌పీజీలపై నడిచే వాహనాలకు, పొలం పనుల్లో ఉపయోగించే ట్రాక్టర్లు టిల్లర్లు, సిటీ బస్సుల వంటి ప్రజా రవాణా సాధనాలు తదితరాలను ఈ పన్నుపోటు నుంచి మినహాయించారు. సర్కారీ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు వినియోగిస్తున్నవాటిలో పదిహేనేళ్లకు మించిన వాహనాల్ని తుక్కుగా మార్చే విధానానికీ ప్రభుత్వ మొహరు పడింది.
గతానుభవాలను బట్టి మున్ముందు వ్యక్తిగత వాహనాలకూ దాన్ని వర్తింపజేసే సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. వాహన కాలుష్యాన్ని కట్టడి చేసి తీరాల్సిందే. అందుకు కట్టుబాటు చాటుతూ పట్టాలకు ఎక్కించదలచిన ఏ కార్యాచరణ అయినా- కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయేలా పరిణమించకూడదు. దేశార్థికం చతికిలపడి, భిన్న రంగాలు కుంగిపోయి ఉన్న దశలో- పాత వాహనాల్ని విసర్జించి కొత్తవి కొనుగోలు చేయగల అవకాశం ఎక్కడుంది? ప్రస్తుత స్థితిలో ప్రతిపాదిత తుక్కు విధానం పూర్తిగా అర్థరహితమైనది!
పదేళ్లకు పైగా వినియోగిస్తున్న కారును తుక్కుగా మార్చి కొత్తది కొనుక్కోదలచినవారికి యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, మలేసియా ప్రభృత దేశాల తరహాలో దేశీయంగానూ నగదు ప్రోత్సాహకాలు ముట్టజెప్పే ప్రతిపాదనలు లోగడ వెలుగు చూసినా- అడుగు ముందుకు పడలేదు. కొన్నేళ్లు కాగానే, కొత్త మోజు తీరగానే వాహనాల్ని మూలన పారేసి నూతన శ్రేణివైపు మొగ్గడం విదేశాల్లో పరిపాటి. అందుకు విరుద్ధంగా ఇక్కడ కారైనా భారీ వాహనమైనా అత్యధిక కుటుంబాలకు జీవితకాల పెట్టుబడి. అందులోనూ కొవిడ్ మహా సంక్షోభం నుంచి ఇంకా తేరుకోక మునుపే వాహనాల గడువు తీరిందంటూ సుంకంతో బాదబోతే- తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు.
వాహనం అరుగుదల అనేది ఎంత దూరం తిరిగారన్నదానిపై ఆధారపడి ఉంటుంది; ఎన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారన్నది ప్రామాణికాంశం కానే కాదు. అసంబద్ధ నిబంధనలతో పెద్దయెత్తున ట్యాక్సీలు, వ్యాన్లు, ఆటోలు మూలన పడితే జీవనాధారం కోల్పోయి అభాగ్యులెందరో నడి వీధిపాలవుతారు. కాలం చెల్లిన పద్దుకింద దిల్లీ, ముంబయి, కోల్‌కతా తదితర నగరాల్లో పాలన యంత్రాంగాలు వాహనాల నిషేధాన్ని గతంలో ప్రతిపాదించినప్పుడు భారీగా ప్రజాగ్రహం వ్యక్తమైంది. కోట్ల మంది ఉపాధికి ఊపిరి పోస్తున్న వాహనాలకు గడువు తీరగానే మరణశాసనం లిఖించాలని వ్యూహరచన చేసే బదులు, కాలుష్య నియంత్రణకు దోహదపడేలా వాటి ఆయుర్దాయాన్ని పెంపొందించే పరిశోధనల్ని సమధికంగా ప్రోత్సహించాలి. ఆ స్పృహే లేని విధాన చొరవ- పెను మాంద్యం, కొవిడ్‌ల రూపేణా జంట దాడికి కుదేలైన కోట్లాది జనజీవితాలపై పిడుగుపాటే అవుతుంది!
- ఇదీ చూడండి: దిల్లీ ఉద్యమానికి 'దీప్' పొగ!