'చెరువు పూడు - ఊరు పాడు' సామెత ఊరికే పుట్టలేదు. నగరాల్లో సైతం తటాకాలు కొల్లబోతే అసంఖ్యాక జీవితాలు గుల్లబారక తప్పదు. ఇటీవల భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదల వెనక కారణాలను ఆరాతీస్తే- తవ్వేకొద్దీ దిగ్భ్రాంతకరమైన యథార్థాలు బహిర్గతమవుతున్నాయి. భయానక వర్ష బీభత్సాన్ని వెన్నంటి దాపురించిన భీకర వరదల ఉద్ధృతికి ప్రజానీకం గుండె చెరువైంది. అనేక కాలనీలు నీట మునిగి లంక గ్రామాల్ని తలపించాయి. ఎక్కడికక్కడ జనావాసాల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన వరదల ధాటికి పెద్దయెత్తున మౌలిక వసతులూ దెబ్బతిన్నాయి. ఇంతటి దురవస్థకు- చెరువులు, దొరువులు, కుంటలకు ఉరితాళ్లు బిగించే దుర్మార్గాలు యథేచ్ఛగా పెచ్చరిల్లడమే పుణ్యం కట్టుకుందన్న సత్యమిప్పుడు తేటపడుతోంది. పెను సంక్షోభ మూలాలపై అధికారిక వివరణే అందుకు తాజా రుజువు. మీరే పరికించండి...
దేశవ్యాప్తంగా జల వనరుల దుస్థితిపై దాఖలైన వ్యాజ్య విచారణలో భాగంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు రాష్ట్రాలవారీగా స్థితిగతుల సమాచారం క్రోడీకరించి సమర్పించాల్సిన బాధ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)కి దఖలు పడింది. అది కోరిన మేరకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం- శుద్ధి చేయని మురుగునీరు, పురపాలక వ్యర్థాలు, రకరకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు, టన్నులకొద్దీ నిర్మాణ వ్యర్థాలు... అధమపక్షం 416 చెరువుల్ని అక్షరాలా చంపేస్తున్నాయి. రాజధాని నగరాన్నే ప్రత్యేకంగా ఎంచనక్కరలేదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 245 కోట్ల లీటర్ల మురుగునీరు వెలువడుతుండగా, అందులో ప్రత్యేక ప్లాంట్ల ద్వారా శుద్ధి ప్రక్రియకు నోచుకుంటున్నది 85కోట్ల లీటర్లే. అంటే, మూడింట రెండొంతుల దాకా నిక్షేపంగా పొంగిపొర్లుతూ వివిధ నీటి వనరుల్ని కలుషితం చేస్తోంది! దేశం నలుమూలలా జలసౌభాగ్యం ఏ స్థాయిలో హరించుకుపోతున్నదో తెలియజెప్పే 'మచ్చతునక' ఇది. ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలనుంచి వివరాలు అందాయంటున్న సీపీసీబీ- అధికారికంగా గుర్తించిన రమారమి నాలుగు లక్షల 13వేల సరస్సులు, చెరువులు, కుంటల్లో లక్షా 32 వేలకుపైగా తక్షణ మరమ్మతులు అవసరమంటోంది. అందులో ఎప్పటిలోగా ఎన్నింటి పనులు ఒక కొలిక్కి వస్తాయో, అప్పటికి మరెన్ని మరమ్మతులకు సిద్ధమవుతాయో చెప్పగలవారెవరు?
ప్రాణాలు జలార్పణం
చెరువులు చిన్నబోతే జనం బతుకులు ఛిన్నాభిన్నమవుతాయనడానికి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు పోగుపడ్డాయి. అయిదేళ్లక్రితం చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు వాటిల్లిన ఆర్థిక నష్టం రూ.20వేల కోట్లుగా అప్పట్లో అంచనా వేశారు. ఆనాడు వందల మంది నిర్భాగ్యుల ప్రాణాలు జలార్పణమయ్యాయి. చెరువులూ కుంటల్ని ఇష్టారాజ్యంగా దురాక్రమించడమే అంతటి ఘోరవిపత్తు తెచ్చి పెట్టిందని నిపుణులు మొత్తుకున్నారు. ముంబయి, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, సూరత్ వంటి నగరాలూ పదేపదే వరదల ముప్పు ఎదుర్కోవడానికీ- కాంక్రీట్ జనారణ్య విస్తరణకై జలవనరుల్ని క్రూరంగా మట్టుపెడుతుండటమే ప్రధాన కారణం. ఎన్ని చేదు అనుభవాలు పునరావృతమవుతున్నా కబ్జాసురుల జోరుకు పగ్గాలు పడటంలేదు. తమిళనాట చెంగల్పట్టు ప్రాంతంలో తాగునీటి జలాశయాల్లోకి మురుగునీటి ప్రవాహాలు కొనసాగుతూనే ఉన్నాయని మొన్నీమధ్య స్థానికంగా గగ్గోలు పుట్టింది. దేశంలో ఏ ప్రాంతం ఆ ఒరవడికి భిన్నమైంది? ఎంచి చూడబోతే మంచమంతా కంతలేనన్న నానుడి చందంగా- పవిత్ర భారతావనిలో నేడు ఎన్నెన్నో చెంగల్పట్టులు!
నగర విస్తరణకు చెరువులు హతం!
ఒకవైపు నగరం విస్తరిస్తుంటే, మరోపక్క చెరువులూ దొరువులూ హతమారిపోతున్న తీరుకు అహ్మదాబాద్ అనుభవం అద్దం పడుతుంది. 1999 నాటికి అక్కడి పురపాలక సంఘ పరిధి సుమారు 190 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 603 తటాకాలు ఉండేవి. 2001 నాటికే ఆ సంఖ్య అమాంతం 137కి పడిపోయింది. 2006లో నగర పరిధి 464 చదరపు కిలోమీటర్లకు విస్తరించినా, సరస్సులు 122కే పరిమితమయ్యాయి. అందులోనే 65 దాకా నిర్మాణ, పురపాలక వ్యర్థాలూ ఆక్రమణలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉనికి కోల్పోయే దశలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో పలుచోట్ల అహ్మదాబాద్ తరహా ఉదంతాలకు కొదవ లేకపోవడం, జలవనరులకు మరణ శాసనం లిఖిస్తోంది!
సీపీసీబీ నిష్ప్రయోజకత్వం!
దేశవ్యాప్తంగా నదులు రోజూ 3700 కోట్ల లీటర్ల కలుషిత వ్యర్థాల తాకిడికి గురవుతున్నట్లు ఆమధ్య కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కకట్టింది. సీపీసీబీతోపాటు రాష్ట్రస్థాయి కాలుష్య నియంత్రణ మండళ్ల అసమర్థ నిర్వాకాల తీవ్రత వెల్లడి కావాలంటే- చెరువులు, దొరువులు, కుంటల దారుణ దుస్థితినీ సమగ్రంగా మదింపు వేయాలి. సీపీసీబీ చచ్చినా ఆ ఊసెత్తదు. రాష్ట్రాలవారీగా వివిధ జలవనరుల సంరక్షణ, పునరుద్ధరణల నిమిత్తం స్థానికంగా చేపట్టదగ్గ చర్యలపై సందేశాలు, ఉత్తర్వులు జారీ చేయడంలో తలమునకలైన సీపీసీబీ ప్రయోజకత్వం ఏపాటిదో బోధపడుతూనే ఉంది. రాష్ట్రస్థాయి పీసీబీలు అవినీతి మడుగులో పోటాపోటీగా మునక లేస్తున్నాయి. వర్షాల మాటున గుట్టుచప్పుడు కాకుండా రసాయన వ్యర్థాల్ని వదిలేసే ప్రబుద్ధులకు పర్యవేక్షణాధికార సిబ్బంది తమ జేబులో బొమ్మలని అంతులేని భరోసా. గట్ల మరమ్మతు పనుల పేరిట కాస్త మొరం పోసి అక్కడక్కడా కొన్ని మొక్కలు తొలగించి బిల్లులు మంజూరు చేయించుకునే గుత్తేదారులకు తమను నిగ్గదీసే వారెవరని విపరీతమైన దిలాసా. ఈ అవినీతి పూడికను సక్రమంగా తీయాల్సిన ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషించినన్నాళ్లు, కాలుష్య మండళ్లు తామున్నది ఎందుకో గుర్తెరిగే పరిస్థితి రానన్నాళ్లు... చెరువులూ దొరువులూ కుంటల సముద్ధరణ- నీటి మీద రాత!
- బాలు