Loan Apps Frauds: ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే రుణ యాప్‌ల దారుణాలు మళ్లీ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. భారీ వడ్డీలతో బాదుతూ, సకాలంలో చెల్లించలేదనే పేరిట తీవ్రస్థాయి వేధింపులకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 1,110కు పైగా రుణ యాప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 600 యాప్‌లు ఎలాంటి లైసెన్సు లేకుండానే అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు గత ఏడాది నవంబర్‌లో తేల్చిచెప్పడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ తరహా యాప్‌లను చైనా, సింగపూర్, ఇండొనేసియాలకు చెందిన విదేశీయులు నడిపిస్తున్నారు. భారీసంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠ నియంత్రణ చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వడ్డీల ఊబిలో: గూగుల్ ప్లేస్టోర్‌లో ఆన్‌లైన్ రుణ యాప్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. చిరుద్యోగులు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువత అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు భారీ వడ్డీకి సైతం వెరవకుండా రుణ యాప్‌ల నుంచి అప్పు తీసుకుంటున్నారు. పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలిస్తుండటంతో ఎక్కువమంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. సకాలంలో రుణాలు తీర్చలేనివారిని నిర్వాహకులు మానసికంగా హింసిస్తున్నారు. రుణం తీసుకునేటప్పుడే ఫోన్‌లోని కాంటాక్టు జాబితా, ఫొటోలను ఉపయోగించుకోవడానికి యాప్ అనుమతి అడుగుతుంది. అనుమతిస్తేనే రుణం తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా చాలా యాప్‌లు వారం, పది రోజుల్లో తిరిగి తీర్చాలనే షరతుతో రుణం ఇస్తాయి. సకాలంలో తీర్చకపోతే ఫోన్‌లోని నంబర్లన్నింటికీ అప్పు ఎగ్గొట్టారనే సందేశాలు పంపుతారు. అప్పటికీ బాకీ వసూలు కాకపోతే ఫొటో కింద శ్రద్ధాంజలి అని రాసి అన్ని నంబర్లకూ పంపిస్తారు. ఆ తరవాత అసభ్య పదజాలంతో దూషిస్తూ సందేశాలు వెళతాయి. ఇలా రుణం తీర్చేవరకు వేధింపులు కొనసాగుతాయి. ఇందుకోసం పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుని కాల్‌సెంటర్లు నడుపుతున్నారు. యాప్‌ల ద్వారా తీసుకునే రుణాలకు భారీ వడ్డీ విధిస్తున్నారు. చాలా యాప్‌లు రూ.10 వేలు రుణం తీసుకుంటే రెండువేల రూపాయల నుంచి రూ.2,800 వరకు వడ్డీ ముందే తీసేసుకుంటున్నాయి. చెల్లింపు గడువు వారం నుంచి నెలదాకా ఉంటుంది. గడువు తీరినా అప్పు తీర్చలేనివారికి మరో యాప్ ద్వారా వారే రుణం ఇస్తారు. దానికి అంతకంటే మరింత ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఇదో గొలుసుకట్టులా మారి చివరకు చేసిన అప్పు కంటే కొన్నిరెట్లు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తోంది. తాను రూ.10 వేల రుణం తీసుకుంటే యాప్ నుంచి యాప్‌నకు మారుతూ వెళ్ళేసరికి రూ.73వేలు వడ్డీ కట్టానని, ఇంకా అసలు కట్టాలని వేధిస్తున్నారంటూ ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం దోపిడీ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. గడువులోగా ఈ అప్పులు తీర్చలేక, నిర్వాహకుల వేధింపులు తాళలేక తెలంగాణలో 10 మందికి పైగా బలవన్మరణానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గతేడాది పోలీసులు యాప్ నిర్వాహకులపై కేసులు పెట్టి, కాల్‌సెంటర్లు మూయించారు. దీంతో అసలు యజమానులు వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇటీవల మళ్ళీ పాతబుద్ధి చూపించడం ప్రారంభించారు. అయిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసింది ఇతనేనంటూ హైదరాబాద్‌కు చెందిన రుణ బాధితుడి బంధుమిత్రులందరికీ సందేశాలు పంపి వేధించారు. అప్పు తీసుకున్న నాలుగు రోజులకే ఓ మహిళా రుణగ్రహీత ఫొటోను నగ్నచిత్రాలతో మార్ఫింగ్ చేసి బంధుమిత్రులకు పంపడం రుణయాప్ నిర్వాహకుల దురాగతాలకు పరాకాష్ఠ. ఇవన్నీ గత నెలరోజుల వ్యవధిలో జరిగినవే. దీంతో పరిస్థితి మళ్ళీ అదుపు తప్పుతోందని అర్థమవుతోంది.
Fake Loan App News: రుణ యాప్‌ల ఆగడాలు పెచ్చుమీరుతుండటంతో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యాప్‌లు నిర్వహించడం, వాటి ద్వారా అప్పులివ్వడానికి ఓ నిబంధనావళిని ఆర్‌బీఐ రూపొందించింది. ఆ నిబంధనలు పాటించని యాప్‌లను ఉన్నతాధికారుల ఆదేశాలతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నారు. ఇప్పటిదాకా 200కు పైగా యాప్‌లను అలా తొలగించారు. హైదరాబాద్ పోలీసులు తాజాగా మరో 40 ఆన్‌లైన్ రుణ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించేలా చర్యలకు సన్నద్ధమవుతున్నారు.మరో 220 యాప్‌ల వ్యవహారంపైనా అనుమానాలుండటంతో, తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. యాప్‌లు తొలగిస్తున్నా ఆయా కంపెనీలు అప్పులిస్తామంటూ యువతకు, అల్పాదాయవర్గాల వారికి సందేశాలు పంపించి, రుణ ఊబిలోకి దింపుతుండటం దారుణం. లోన్ యాప్‌ల బారినపడవద్దని, తీసుకున్న మొత్తానికి కనీసం అయిదారు రెట్లు గుంజడమే వారి లక్ష్యమని హైదరాబాద్ సైబర్ నేరవిభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశంలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చడానికి సంప్రదాయ బ్యాంకులు ఆసక్తి చూపించకపోవడంతో ఎక్కువమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆర్‌బీఐ రూపొందించిన నివేదిక ప్రకారం- ప్రతి డిజిటల్ రుణ యాప్ ఆర్‌బీఐ లైసెన్సు పొంది ఉండాలి. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడానికి కనీసం మూడు నెలల సమయం ఉండాలి, వడ్డీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల మేరకే ఉండాలి. ఇవన్నీ జరగాలంటే వీటి నియంత్రణకు ఓ చట్టం తీసుకురావాలి. రుణయాప్ ముందుగా ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ నియమించిన నోడల్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనలన్నీ పాటిస్తామని ఆ కంపెనీ అంగీకరించి, లైసెన్సు రుసుము కట్టిన తరవాతే దాన్ని ప్లే స్టోర్‌లో ఉంచేందుకు నోడల్ ఏజెన్సీ అనుమతివ్వాలి. అప్పుడు నిబంధనలు ఉల్లంఘించే యాప్‌లను నియంత్రించడానికి, డిజిటల్ వేదికల నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లకూ ఇలాంటి నిబంధనావళి వర్తింపజేసి, అతిక్రమిస్తున్నట్లు తేలినవాటిని తొలగించాలి. నిబంధనలు మీరి రుణగ్రహీతలను వేధిస్తే లైసెన్స్ రద్దు చేయడంతోపాటు యాప్ నిర్వాహకులను చట్టప్రకారం శిక్షించాలి.
China Loan Apps: అనుమతులు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న యాప్‌లలో అధికశాతానికి చైనా మూలాలే ఉన్నాయి. బెంగళూరులో స్కై లింక్ టెక్నాలజీ పేరుతో కాల్‌సెంటర్ నడుపుతున్న ఓ ముఠా 40కి పైగా రుణయాప్‌లను సృష్టించి, జనాన్ని ఆన్‌లైన్ రుణాల ఊబిలోకి దింపుతోంది. బాధితుల ఫిర్యాదులతో హైదరాబాద్ సైబర్ నేరాల విభాగం పోలీసులు ఇద్దరు పాత్రధారులను అరెస్టు చేయగా, కీలక సూత్రధారి చైనా జాతీయుడు షెన్ చెన్‌పింగ్‌గా తేలింది. అప్పటికే అతడు పరారు కావడంతో రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసి గాలిస్తున్నారు. మరో చైనీయుడికి చెందిన కంపెనీ హైదరాబాద్‌లోనే ఏకంగా రూ.21వేల కోట్ల ఆన్‌లైన్ రుణ దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌తోపాటు పుణె, ముంబయి తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్‌లైన్ రుణ యాప్‌ల వ్యాపారం భారీగా సాగుతోంది.
- శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి
ఇదీ చదవండి: 15ఏళ్లుగా మూసి ఉన్న దుకాణంలో శరీర అవయవాలు