కొవిషీల్డ్ టీకాతో ఇబ్బంది లేకున్నా, వ్యాక్సిన్ వేసినట్లుగా నిర్ధారించే ధ్రువపత్రంతోనే(Fake Vaccine Cards) సమస్య అని భారత ప్రభుత్వానికి బ్రిటన్ సర్కారు(Britain Covishield) స్పష్టం చేయడంతో- రెండు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. బ్రిటన్ చర్యకు తమవైపు నుంచి ప్రతిచర్యలు ఉంటాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ రగడకు ముందు భారతదేశంలో నకిలీ టీకాలు, నకిలీ ఆర్‌టీపీసీఆర్ పరీక్షల(Fake RTPCR report with QR code) గురించి పలు వార్తలు వచ్చిన మాట నిజం. ఇటీవల ఒడిశాలో పూరి జగన్నాథ రథోత్సవాల్లో కొందరు భక్తులకు నకిలీ పీసీఆర్ పరీక్షల ధ్రువపత్రాలను అందించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పూరి నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి పేరును ఉపయోగించుకుని ఈ నకిలీ పత్రాలను జారీచేసిన 12 మంది కటకటాల పాలయ్యారు.
ఇతర రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు ఏకాంతవాసాన్ని తప్పించుకోవడానికి లేదా ప్రయాణాలు చేయడానికి తమకు తామే నకిలీ ధ్రువపత్రాలను తయారు చేశారు. ఇలాంటి బోగస్ పత్రాలతో రాష్ట్రం దాటాలని చూసిన ఏడుగురు వ్యక్తులను రెండు వేర్వేరు తనిఖీ కేంద్రాల వద్ద కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని పర్వత విడిది కేంద్రాలైన ముస్సోరి, నైనితాల్‌లలో నకిలీ ధ్రువపత్రాలతో సంచరిస్తున్న 100 మంది పర్యాటకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి దొంగ పత్రాలపై ప్రముఖ ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల అధికారిక గుర్తింపు ముద్రలు ఉంటున్నాయి. గత ఏప్రిల్‌లో కుంభమేళాకు(kumbh mela covid) హాజరయ్యే భక్తులకు కొవిడ్ పరీక్షలు చేయడానికి 11 ప్రైవేటు సంస్థలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఈ కంపెనీలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్లో లక్ష దాకా నకిలీవేనని దర్యాప్తులో తేలింది. కుంభమేళా కరోనా కేసుల విస్తృత వ్యాప్తికి దారితీసిన సంగతి తెలిసిందే.
మోసాల నివారణ
భారతీయ పర్యాటకులు స్వదేశంలో తిరగడానికే కాకుండా, విదేశాలకు ప్రయాణించడానికీ నకిలీ కొవిడ్ పరీక్ష పత్రాలను ఉపయోగించడం ఇతర దేశాల ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేసింది. ధ్రువపత్రాలపై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని కొన్ని విదేశీ విమానయాన సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ కోడ్ సహాయంతో పరీక్షల ఫలితాలను ఎలెక్ట్రానిక్ పద్ధతిలో నిర్ధారించుకోవచ్చని అవి తలపోశాయి. అయితే నేరగాళ్ల ముఠాలు 'పీడీఎఫ్ ఎడిటర్లు', 'క్యూఆర్ కోడ్ జనరేటర్' వంటి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను ఉపయోగించి విమానయాన సంస్థలను బురిడీ కొట్టించడం మొదలుపెట్టాయి. దీంతో విదేశీ విమానయాన సంస్థలు కొవిడ్ టీకా ధ్రువపత్రాల తరహాలో పరీక్షల పత్రాలనూ ప్రామాణీకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాయి. మోసాలను నివారించడానికి త్వరలో కొవిడ్ పరీక్ష ఫలితాలను 'కొవిన్'తో(Cowin Certificate) అనుసంధానిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
నకిలీ కొవిడ్ పరీక్షలే తలనొప్పిగా మారాయనుకుంటే, అదే తరహాలో టీకాలూ విస్తృతంగా వ్యాపిస్తూ అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఏది సరైనదో గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని బండగుర్తులను ప్రకటించాల్సి వచ్చింది. ముంబయి, కోల్‌కతాలలో ఏకంగా బోగస్ క్లినిక్కులు తెరచి నకిలీ టీకాలు వేస్తున్నట్లు బయటపడింది. ఒక్క ముంబయిలోనే ఓ నేరగాళ్ల ముఠా తొమ్మిది క్లినిక్కులు తెరిచింది. ఈ కేసులో ఒక ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లతో సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరు టీకాల పేరుతో సెలైన్ ద్రావణం ఎక్కించారు. ముంబయిలో మొత్తం 2,053 మందికి నకిలీ టీకాలు వేశారు. కోల్‌కతాలో ధేవాంజన్ దేవ్ అనే వ్యక్తి ప్రభుత్వోద్యోగిగా నటిస్తూ జనానికి నకిలీ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వేశారు. బోగస్ టీకాలు వేసుకున్న మొత్తం 2,000 మందిలో భాజపాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కూడా ఉండటం విశేషం.
అప్రమత్తతతో రక్షణ
ఒక వ్యక్తి టీకా వేసుకున్న వెంటనే కొవిన్ యాప్ నుంచి ధ్రువీకరణ సందేశం వస్తుందని, అది రాకపోతే టీకా పడనట్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. నకిలీ టీకాల వ్యవహారం వెలుగులోకి రాగానే పశ్చిమ్ బంగ ప్రభుత్వం సర్కారీ ఆస్పత్రులు, ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో తప్ప మరెక్కడా టీకాలు వేయకూడదని ఆదేశించింది. అదే సమయంలో 138 కోట్ల జనాభాగల భారతదేశ అవసరాలకు ఇప్పుడున్న పరీక్ష, టీకా కేంద్రాలు ఏమాత్రం సరిపోవు. ప్రాధాన్య వర్గంలోని 30 కోట్ల మందికి టీకాలు వేయడానికే 1.40 లక్షల పరీక్ష కేంద్రాలు, లక్షమంది వైద్య, రెండు లక్షలమంది సహాయ సిబ్బంది అవసరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీ గిరాకీ ఉండటం వల్లే నకిలీలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేస్తామంటూ జనాన్ని ప్రలోభపెట్టే యాప్‌లు భారత్, చిలీ దేశాల్లోనే ఎక్కువని సాఫ్ట్‌వేర్ సంస్థ 'మెకాఫీ' వెల్లడించడం గమనార్హం. ఇలా నేరగాళ్లు జనం అవసరాలతో ఆడుకుంటూ టీకాలు, పరీక్షలపై అనుమానాలు పెంచకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటూ, కేటుగాళ్ల బారినపడకుండా జాగ్రత్తపడాలి.
- వరప్రసాద్
ఇదీ చదవండి: