ప్రస్తుతం కొవిడ్ మూడో ఉద్ధృతిపై (Third wave in India) జోరుగా చర్చలు సాగుతున్నాయి. వైద్య నిపుణులు, పరిశోధకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికతో మహమ్మారి మరోసారి విజృంభించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. యూకేలో రెండు, మూడు ఉద్ధృతుల నడుమ ఎనిమిది వారాల వ్యవధి కనిపించింది. ఇటలీ, అమెరికాల్లో అది 17, 23 వారాలుగా నమోదైంది. భారత్‌లో రెండో ఉద్ధృతి వేళ దాదాపుగా అన్ని వయసుల వారూ బాధితులయ్యారు. మహమ్మారి(Coronavirus) మరోసారి విజృంభిస్తే దాని తీవ్రతలో హెచ్చుతగ్గులున్నా- ప్రజారోగ్య వ్యవస్థపై మళ్ళీ ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడో ఉద్ధృతిని(Third wave in India) సమర్థంగా ఎదుర్కోవడానికి పాలకులు కొన్ని కీలక చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఆ వయసు వారే ఎక్కువ..
అర్హులైన వారందరికీ టీకాలు(vaccination in India) అందితే వైరస్ ప్రభావ తీవ్రతతో పాటు మరణాల ముప్పూ తగ్గుతుంది. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే- వైరస్ బాధితుల్లో ఎక్కువ శాతం 30 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఉంటున్నారు. ఆ వయోవర్గాలకు టీకాలు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. టీకా ప్రక్రియలో సమస్యలతో పాటు వ్యాక్సిన్ ప్రయోజనాలపై ప్రజాబాహుళ్యంలో నెలకొన్న అనుమానాలు పరిస్థితిని జటిలం చేస్తున్నాయి. మరోవైపు, వయసుతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకాల పంపిణీని సత్వరమే పూర్తిచేయాలి. అందుకోసం సూక్ష్మస్థాయిలో ప్రణాళికలను రూపొందించి కచ్చితంగా అమలు చేయాలి. క్షేత్రస్థాయి సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపట్టి ఆ మేరకు బాధితులను గుర్తించాలి.
ఆ స్ఫూర్తిని కొనసాగించాలి..
రాబోయే రెండు నెలల్లో రోజుకు కోటి మందికి టీకాల పంపిణీ చేపట్టగలిగితే వైరస్ దుష్ప్రభావాన్ని గణనీయంగా అడ్డుకోవచ్చు. ఇటీవల దేశవ్యాప్తంగా ఒకేరోజులో 80 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజల్లో టీకాలపై అవగాహన కల్పిస్తూ ప్రచార వ్యూహాన్ని రూపొందించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అవాంతరాల వల్ల చాలామందికి టీకాలు అందడం లేదు. వాటిని తక్షణం పరిహరించాలి. ప్రజలందరికీ టీకా కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడాలి. గతంలో పోలియో, మీజిల్స్- రూబెల్లా వ్యాధుల నిర్మూలనకు అనుసరించిన వ్యూహాత్మక విధానాలను పాటిస్తూ... దేశపౌరులందరికీ కొవిడ్ టీకాలు అందించడమే ప్రభుత్వాల ప్రాధాన్యాంశం కావాలి.
నిర్వచనం రూపొందించుకోవాలి..
కొవిడ్ విజృంభణకు అడ్డుకట్ట పడాలంటే టీకాలతోపాటు వ్యాధి నిర్ధరణ పరీక్షలను విస్తృతంగా చేపట్టడమూ చాలా ముఖ్యం. నిర్ధరణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశమున్న ప్రాంతాలపై నిఘా పెట్టడానికి అవకాశం చిక్కుతుంది. ఆ తరవాత తగిన చర్యల ద్వారా మహమ్మారిని కట్టడి చేయవచ్చు. ప్రతి రాష్ట్రంలో నెలకు కనీసం 10 లక్షల వరకు పరీక్షలు నిర్వహిస్తే వైరస్ ప్రభావాన్ని గరిష్ఠస్థాయిలో నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులను కనిష్ఠ స్థాయికి తీసుకురావాలంటే- ముందుగా 'కనిష్ఠం' అనే పదానికి ఒక ప్రామాణిక నిర్వచనాన్ని రూపొందించుకోవాలి. వైరస్ ముప్పు పొంచిఉన్న ప్రాంతాలు, క్లస్టర్‌ల గుర్తింపు; సకాలంలో వైరస్ నిర్ధారణ; త్వరితగతిన చికిత్సా సదుపాయాల కల్పనలతో మూడో ఉద్ధృతి నుంచి బయటపడవచ్చు. వారం రోజుల వ్యవధితో పాజిటివిటీ రేటులో మార్పులను నిరంతరం పర్యవేక్షించడమూ అత్యావశ్యకమే. మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం అయిదు శాతం లోపు ఉంటేనే- వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉన్నట్లుగా పరిగణించాలి.
తొక్కిపెట్టడం ప్రమాదకరం..
కొవిడ్ వంటి భయంకర మహమ్మారులు విజృంభిస్తున్న తరుణంలో వాస్తవిక గణాంకాలు, సమాచారాన్ని తొక్కిపెట్టడం చాలా ప్రమాదకరం! తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందించే విధానాలతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి పక్కాగా సమాచారాన్ని సేకరించి విశ్లేషించాలి. ప్రభుత్వాలు తీసుకునే ఈ జాగ్రత్తలే మహమ్మారి కట్టడిలో క్రియాశీల భూమికను పోషిస్తాయి. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలి. పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజాభద్రతకు అవసరమైన సూచనలు, సలహాలను అందించే బాధ్యతలను వాటికి అప్పగించాలి. టీకా రక్షణ సమకూరని పిల్లల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మేరకు చిన్నారుల వైద్యానికి అవసరమైన వసతులు, ఐసీయూ కేంద్రాలను సాధ్యమైనంత మేర అందుబాటులోకి తేవాలి. ప్రజలు సైతం రెండో ఉద్ధృతి తగ్గిందని అలక్ష్యం చేయకుండా కొవిడ్ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటించాలి. వ్యాధి భయం పూర్తిగా సమసిపోయే వరకు అందరూ అప్రమత్తంగా ఉంటేనే- కొద్ది నెలల క్రితం దేశం చవిచూసిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉంటాయి.
- డాక్టర్ జి.వి.ఎల్.విజయ్‌కుమార్
ఇదీ చూడండి: భారత్‌లో పిల్లల టీకాకు అనుమతి
ఇదీ చూడండి: Vaccination: గర్భిణులకు టీకా.. దుష్ప్రభావాలు ఉన్నాయా?
ఇదీ చూడండి: 'టీకా జాతీయవాదంతో కరోనా 'కొత్త' ముప్పు'