ETV Bharat / opinion

అనర్థదాయకమైన జూదానికి చట్టబద్ధతా? - జూదానికి చట్టబద్ధతా

బెట్టింగ్ చట్టబద్ధం చేయాలన్న వాదనలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తాజాగా వత్తాసు పలకడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ప్రభృత దేశాల్లో బెట్టింగ్‌ చట్టబద్ధమని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తరహా అవలక్షణాల కట్టడికి అది పటుతర సాధనం కాగలదని ఆయన సెలవిస్తున్నారు. విధాన నిర్ణయం వెలువడకముందే అమాత్యుల అభీష్టమేమిటో బహిర్గతమై కలకలం రేగుతోంది.

experts are saying about dangerous problems of betting market
అనర్థదాయకమైన జూదానికి చట్టబద్ధతా?
author img

By

Published : Nov 22, 2020, 7:50 AM IST

మనిషిని జూదం ఎంతటి పతనావస్థకు దిగజార్చగలదో, ఎన్ని కడగండ్లపాలు చేయగలదో, అయినవారికీ ఏ స్థాయిలో వినాశం తెచ్చిపెట్టగలదో... మహాభారత గాథ సోదాహరణంగా తెలియజెబుతూనే ఉంది. అయినా ఇప్పటికీ ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తాలన్న దురాశను అధిగమించలేని మానవ బలహీనత దేశంలో పలుచోట్ల బెట్టింగ్‌ దందాకు గట్టి పెట్టుబడిగా వర్ధిల్లుతోంది. అలా పందాలు కాయడాన్ని చట్టబద్ధం చేయాలన్న వాదనలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తాజాగా వత్తాసు పలకడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ప్రస్తుత హోదా కంటే ముందు బీసీసీఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగానూ చక్రం తిప్పిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది.

గళం మారిపోయింది..

ఏడేళ్లక్రితం ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) మ్యాచ్‌ ఫిక్సింగ్‌ బాగోతం అసంఖ్యాక క్రికెట్‌ అభిమానులతోపాటు ఆయననూ నొప్పించింది. నాలుగేళ్లనాడు భాజపా ఎంపీ హోదాలో- క్రికెట్‌ పాలిట వేరుపురుగులా దాపురించిన ఫిక్సింగ్‌ జాడ్యాన్ని అరికట్టేందుకంటూ ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమే అందుకు రుజువు. అప్పట్లో అనురాగ్‌ ఠాకుర్‌ ఆ బిల్లు తేవడానికి సహేతుక కారణాలే ఉన్నాయి. ఫిక్సింగ్‌ నిందితులు మోసానికి వంచనకు పాల్పడ్డారనో వారిలో నిజాయతీ లోపించిందనో ఐపీసీ (భారతీయ శిక్షా స్మృతి) కిందనో, అవినీతి నిరోధక చట్టం ప్రకారమో ఆరోపణలు నమోదయ్యేవి. ఆయా చట్ట నిబంధనలు క్రీడలకు వర్తించని కారణంగా, నిందారోపణలకు గురైనవారు తేలిగ్గా బయటపడటం పరిపాటిగా మారింది. అలా సందివ్వకుండా, అనైతిక చర్యలకు ఒడిగట్టిన వాళ్లపై జీవితకాల నిషేధాన్ని, పదేళ్ల జైలుశిక్ష విధింపును తన ప్రైవేటు బిల్లులో ఠాకుర్‌ ప్రతిపాదించడం ఆనాటి ముచ్చట. ఇప్పుడాయన గళం మారిపోయింది. దేశంలో బెట్టింగ్‌ను చట్టబద్ధం గావించాలన్న విడ్డూరవాదనలు వినిపించే వర్గాలకిప్పుడు అమాత్యవర్యులు 'అధికార ప్రతినిధి'లా గోచరిస్తున్నారు!

అక్కడ అవినీతి రూపుమాసిపోలేదు..

స్వీయ సరికొత్త బాణీకి సమర్థనగా- ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ప్రభృత దేశాల్లో బెట్టింగ్‌ చట్టబద్ధమని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తరహా అవలక్షణాల కట్టడికి అది పటుతర సాధనం కాగలదని అనురాగ్‌ ఠాకుర్‌ సెలవిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ను చట్టబద్ధీకరించిన దేశాల్లో అవినీతి రూపుమాసి పోనేలేదన్న విశ్లేషణలు సచివుల చెవిన పడ్డాయో లేదో మరి! బెట్టింగ్‌ కట్టడికి దేశంలో కట్టుదిట్టమైన చట్టం కొరవడిందని లోగడ సర్వోన్నత న్యాయస్థానమే తప్పుపట్టింది. ఆపై జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సులతో వివాదాల తేనెతుట్టెను కదిపినట్లయింది.

విధాన నిర్ణయం వెలువడకముందే..

చాటుమాటుగా వేలకోట్ల రూపాయల మేర జరుగుతున్న బెట్టింగ్‌ను చట్టబద్ధం చేసేయాలన్న సూచన అమలు సాధ్యాసాధ్యాలపై న్యాయ సంఘం (లా కమిషన్‌) పరిశీలనను సుప్రీంకోర్టు కోరింది. చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ సాగకుండా నిషేధం విధించాలని, లేదంటే లైసెన్సులు పొందినవారి పర్యవేక్షణలోనే అనుమతించాలన్న కమిషన్‌ నివేదికను ఇప్పుడు కేంద్ర క్రీడలూ యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, క్రీడా విభాగం లోతుగా అధ్యయనం చేస్తున్నాయంటున్నారు. విధాన నిర్ణయం వెలువడకముందే అమాత్యుల అభీష్టమేమిటో బహిర్గతమై కలకలం రేగుతోంది. చూడబోతే- ఆటగాళ్లను, అధికారుల్ని మినహాయించి సామాన్య ప్రజానీకానికి వెబ్‌సైట్ల ద్వారా పందాలు కాసే అవకాశం కల్పిస్తే క్రికెట్లో అనైతికత మటుమాయమవుతుందన్న మునుపటి కమిటీల స్పందనే మంత్రి సత్తములకు ముద్దొచ్చినట్లు ప్రస్ఫుటమవుతోంది!

జూదం వల్ల నష్టపోయినవారెందరో..

ఆన్‌లైన్‌ జూదక్రీడలకు ప్రచారం చేయడమేమిటని తప్పుపడుతూ ప్రసిద్ధ క్రికెటర్లు, ప్రముఖ నటీనటులకు మద్రాస్‌ న్యాయస్థానం మదురై ధర్మాసనం ఈ నెల మొదట్లో నోటీసులు జారీ చేసింది. జూదంలో పెద్దయెత్తున డబ్బు పోగొట్టుకున్న ఎందరో ఆత్మహత్యకు తెగబడటం పట్ల ధర్మాసనం ఆర్తితో స్పందిస్తూ నియంత్రణ చర్యలకు పిలుపిచ్చింది. 1930 నాటి గేమింగ్‌ చట్టాన్ని, 1888 నాటి సిటీ పోలీస్‌ యాక్ట్‌ను, 1859 నాటి జిల్లా పోలీస్‌ శాసన నిబంధనల్ని సవరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను రెండురోజుల క్రితమే నిషేధించింది. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా, ఆరు నెలల ఖైదు తప్పవని పళనిస్వామి సర్కారు ప్రకటించింది.

అప్పులు, బలవన్మరణాలు..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ జూదం అపార విషాదం గుమ్మరించింది. బెట్టింగ్‌ వ్యసనానికి బానిసలై గాడితప్పిన విద్యార్థులు గొలుసుల చోరీ ముఠాలుగా మారిన ఉదంతాలు, రకరకాల నేరాలకు పాల్పడ్డ ఘటనలు, అప్పుల ఊబిలో కూరుకుపోయి అజాపజా లేకుండా పోయిన కేసులు, బలవన్మరణాలకు ఒడిగట్టిన విషాదాలు వెలుగు చూశాయి. ఆ మధ్య క్రికెట్‌ బెట్టింగ్‌ మకిలంటిన గుంటూరు పోలీసులపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఏపీ, తెలంగాణల్లో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధాంక్షలు విధించారు. గుర్రప్పందాలు సైతం ఆన్‌లైన్‌ బాట పట్టిన తరుణంలో కర్ణాటక వంటివీ జూద సంస్కృతిపై కొరడా ఝళిపిస్తున్నాయి.

కక్కుర్తి లెక్కలు..

దేశంలో ప్రస్తుతం గోవా, డామన్‌, సిక్కిమ్‌లే బెట్టింగ్‌ను అధికారికంగా అనుమతిస్తున్నాయి. రాజ్యాంగం ఏడో షెడ్యూలు ప్రకారం- బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌... రాష్ట్రాల జాబితాలోని అంశాలు. దేశీయంగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు విస్తరించిన బెట్టింగ్‌ మార్కెట్‌కు చట్టబద్ధత కల్పిస్తే కనీసం పదిశాతం పన్ను వంతున భారీ ఆదాయం లభిస్తుందన్న కక్కుర్తి లెక్కలు కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆ మార్కెట్‌ ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైబడిందని, ఏటా ఏడు శాతందాకా ‘వృద్ధి’ నమోదవుతుందన్న కథనాల మాటున రాష్ట్రాలపై ప్రలోభాల వలలు విసిరేయత్నం స్పష్టమవుతూనే ఉంది.

పౌరసంక్షేమమే పరమావధి కావాలి..

జూద వ్యసనం నీతినిజాయతీలను, సంపదను నాశనం చేస్తుందన్నది మనుస్మృతి ఉద్బోధ. ఆ స్ఫూర్తికి గొడుగు పడుతూ గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌లను నిషేధించి తీరాలని లక్ష్మీనారాయణ్‌ సాహు, ఆచార్య షిబ్బన్‌లాల్‌ సక్సేనా, సర్దార్‌ హుకమ్‌సింగ్‌ రాజ్యాంగ నిర్ణయసభలో పట్టుపట్టడం విస్మరించరాని చరిత్ర. 'పనికిమాలిన నిషేధాన్ని' తుంగలో తొక్కితే ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయల రాబడి కళ్లజూడవచ్చని గతంలో 'ఫిక్కి' (భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య) వంటివీ ఉచిత సలహాలు దయచేసిన మాట వాస్తవం. కుప్పలు తెప్పలుగా ఆదాయం వచ్చిపడి కోశాగారాలు పుష్కల ధనరాసులతో తులతూగుతాయని వ్యభిచారాన్ని, అవినీతిని సైతం చట్టబద్ధం చేసెయ్యమనే కురచబుద్ధుల ప్రబుద్ధులూ దాపురిస్తారు! ఏ ప్రజాప్రభుత్వానికైనా పౌరసంక్షేమమే పరమావధి కావాలి. కాసుల పంట పండుతుందనో మరొకందుకో అనర్థదాయకమైన జూదాన్ని చట్టబద్ధం చేయాలన్న ఆలోచనే గర్హనీయం. గతంలో ఏపీ హైకోర్టు నిగ్గదీసినట్లు- మాఫియాను నిలువరించడానికంటూ అది చేసే పనుల్ని ప్రభుత్వాలు చేయకూడదు కదా?

- బాలు

ఇదీ చూడండి:కార్మికులకు ఆరోగ్యమస్తు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.