ETV Bharat / opinion

పాత మందులకు కొత్త పదును- కొవిడ్‌కు మెరుగైన చికిత్స!

కరోనాకు కొత్త మందులు కనుగొనే లోపు ఎబోలా, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా వంటి రోగాలకు వాడుతున్న పాత మందులను తగు మార్పుచేర్పులతో ఉపయోగిస్తున్నారు. గతంలో క్యాన్సర్‌ చికిత్సకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) రూపొందించిన 2డీజీ పొడి ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ రోగులపై సమర్థంగా పనిచేస్తోంది. ఈ విధంగా మరో మూడింటిపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

corona
కరోనా
author img

By

Published : Jul 4, 2021, 9:25 AM IST

కొవిడ్‌ వల్ల జీవనాధారం కోల్పోయిన పేదలను ఆకలి రక్కసి భయపెడుతుంటే, మధ్యతరగతి వారికి ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న భారీ బిల్లులతో గుండెలు బేజారెత్తుతున్నాయి. మందూమాకూ లేని మాయదారి రోగమైన కొవిడ్‌కు ఇప్పటికి వ్యాక్సిన్లే బ్రహ్మాస్త్రాలు. వీటితో పాటు కరోనాను నిర్మూలించగల యాంటీవైరల్‌ మాత్రలు విరివిగా అందుబాటులోకి వస్తే ప్రజల్లో భయభ్రాంతులు తగ్గుతాయి. వైద్యులు, నర్సులు, ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గి, చికిత్స ఖర్చులూ దిగివస్తాయి. కొత్త మందులు కనుగొనే లోపు ఎబోలా, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా వంటి రోగాలకు వాడుతున్న పాత మందులను తగు మార్పుచేర్పులతో ఉపయోగిస్తున్నారు. గతంలో క్యాన్సర్‌ చికిత్సకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) రూపొందించిన 2డీజీ పొడి ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ రోగులపై సమర్థంగా పనిచేస్తోంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్​డీఓ అందిస్తున్న ఈ మందు రోగికి ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గించి త్వరగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి తోడ్పడుతుంది.

ఆ మూడింటిపై ప్రయోగాలు

ఎబోలా వైరస్‌ను అరికట్టడం కోసం రూపొందించిన రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను ఇప్పుడు కొవిడ్‌పైన ప్రయోగిస్తున్నారు. రెమిడెసివిర్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతున్నా- భారత్‌లో స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కొవిడ్‌ రోగులకు దీన్ని ఇస్తూ సంతృప్తికర ఫలితాలు సాధిస్తున్నారు. కొవిడ్‌ వచ్చిన 10 రోజుల్లోనే ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వాలన్నది కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సిఫార్సు. తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ రోగులపై కోర్టికోస్టెరాయిడ్‌ డెక్సామిథేసోన్‌ బాగా పనిచేస్తోంది. వెంటిలేటర్ల మీద ఉన్న రోగుల్లో మరణాలను 30 శాతం, ఆక్సిజన్‌ అవసరమైన రోగుల్లో మరణాలను 20 శాతం మేరకు తగ్గిస్తున్న మందు ఇది. స్వల్ప లక్షణాలున్న రోగులకు దీన్ని ఇవ్వడం హానికరం. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (కీళ్లవాపు)నకు వాడుతున్న టోసిలిజుమాబ్‌, సారిలుమాబ్‌ మందులు విషమ స్థితికి చేరిన కొవిడ్‌ రోగుల్లో మరణాలను 24 శాతందాకా తగ్గించగలుగుతాయని అమెరికన్‌ పరిశోధకులు తేల్చారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిపార్సు చేసిన మందుల్లోనూ టోసిలిజుమాబ్‌ ఉంది.

ఇన్‌ఫ్లుయెంజా చికిత్స కోసం రూపొందించిన మాల్నుపిరావిర్‌ను మార్పుచేర్పులతో కొవిడ్‌ వైరస్‌పై ప్రయోగించడానికి భారత్‌, అమెరికాలు సమాయత్తమవుతున్నాయి. మాల్నుపిరావిర్‌ కేవలం 24 గంటల్లోనే కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొంటుంది. కొన్ని ఇతర వ్యాధుల చికిత్సకు వాడుతున్న నైక్లోసమైడ్‌, కోల్చిసైన్‌, క్లోర్‌ ప్రోమజైన్‌ మందులను కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించే విషయమై భారత రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ (ఐఐసీటీ) ప్రయోగాలు జరుపుతోంది. వీటిలో బద్దె పురుగు (టేప్‌వార్మ్‌) చికిత్సకు వాడే నైక్లోసమైడ్‌కు కరోనా వైరస్‌ సంహార శక్తితో పాటు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచే సత్తా ఉందని భారతీయ, అమెరికన్‌ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ మందుపై రిలయన్స్‌ సంస్థ కూడా ప్రయోగాలు జరుపుతోంది. కరోనా వైరస్‌ శరీరంలో ప్రవేశించాక రోగ నిరోధక యంత్రాంగాన్ని అతిగా ప్రేరేపించడం వల్ల వాపు, మంటలు (ఇన్‌ఫ్లమేషన్‌), సైటోకైన్‌ తుపాను ఏర్పడతాయి. దీనివల్ల ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం ఇన్‌ఫ్లమేషన్‌, గౌట్‌ల చికిత్సకు వాడుతున్న కోల్చిసైన్‌కు కొవిడ్‌ వాపునూ తగ్గించే శక్తి ఉందా అని శాస్త్రజ్ఞులు శోధిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో మానసిక చికిత్సాలయాల్లోని రోగులకన్నా అక్కడి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారని కనిపెట్టారు. మానసిక రోగులకిస్తున్న క్లోర్‌ ప్రోమజైన్‌కు వైరస్‌ వృద్ధిని అరికట్టే సత్తా ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. నైక్లోసమైడ్‌, కోల్చిసైన్‌, క్లోర్‌ ప్రోమజైన్‌ మందులపై సీఎస్‌ఐఆర్‌, ఐఐసీటీల ప్రయోగాలు సఫలమైతే- అవి కొవిడ్‌ చికిత్సలో కొత్త అధ్యాయానికి తెరతీస్తాయి. రక్తాన్ని పలచబరచే కొన్ని రకాల బ్లడ్‌ థిన్నర్‌ మందులు కొవిడ్‌ చికిత్సకు ఉపయోగపడతాయా అనీ శోధిస్తున్నారు. కరోనా రోగి ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే వీటిని ఇస్తే మరణాన్ని నివారించవచ్చునని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. మధుమేహులకు ఇచ్చే సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫార్మిన్‌లు కూడా కొవిడ్‌ మరణాలను తగ్గించి, రోగి త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతున్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. హృద్రోగానికి వాడే నైట్రిక్‌ ఆక్సైడ్‌ బిళ్లలు రక్తనాళాలను వెడల్పు చేసి ఆయాసం తగ్గించడంతో పాటు వైరస్‌ల వృద్ధికి పగ్గాలు వేస్తాయనీ పరిశోధనలు సూచిస్తున్నాయి. మధుమేహం, హృద్రోగం లేని కొవిడ్‌ రోగులకు వీటిని ఎలా వాడవచ్చో తేల్చడానికి కృషిచేస్తున్నారు. చివరకు ఈ పాత మందులన్నీ తిరుగులేని విధంగా కొవిడ్‌ చికిత్సకు ఉపకరిస్తాయని నిర్ధారణ కాకపోవచ్చు. కొన్ని మాత్రమే పరీక్షకు నిలవవచ్చు. ఏ సంగతీ నిస్సందేహంగా తేలనంతవరకు వీటితో సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాంతకమవుతుంది.

ఒక్క మాత్రతో అడ్డుకట్ట

అమెరికాలో ఎమొరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టిన ఈఐడీడీ 2801 పలు రకాల కరోనా వైరస్‌ల వృద్ధిని అరికడుతున్నట్లు తేలింది. టెంపాల్‌ అనే మాత్ర కరోనా వృద్ధిని అడ్డుకొంటున్నట్లు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ పరిశోధకులు కనిపెట్టారు. ఒకే ఒక్క మాత్రతో కరోనా వైరస్‌ను నిర్మూలించాలని ఫైజర్‌ కంపెనీ నడుంకట్టింది. ఈ సంస్థ రూపొందిస్తున్న ప్రోటీస్‌ ఇన్‌హిబిటర్‌ మాత్ర వైరస్‌లోని ఒక ఎంజైమ్‌కు అతుక్కుని దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఫైజర్‌ మాత్ర ఈ ఏడాది చివరకు అందుబాటులోకి రావచ్చు. మెర్క్‌, రోషే కంపెనీలు కూడా మాత్రల కోసం నిర్విరామంగా శోధిస్తున్నాయి. కరోనా వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశించే మార్గాన్ని అడ్డుకోగల రెండు పెప్టైడ్‌ ఆధారిత మందులపై ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు ప్రయోగాలు జరుపుతున్నారు. శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతీయకుండా, ఆ కణాల్లో చొరబడిన వైరస్‌లను మాత్రమే మట్టుపెట్టగలిగే యాంటీ వైరల్‌ మందులను కనిపెట్టడం తేలిక కాదు. అయినా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని శాస్త్రజ్ఞులు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు.

రెండు యాంటీబాడీలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొవిడ్‌ బారిన పడినప్పుడు వాడిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ మిశ్రమం అమెరికా, ఐరోపాలలో విస్తృత ప్రాచుర్యం పొంది, భారతదేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. రోషే కంపెనీ తయారు చేసిన ఈ మిశ్రమంలో క్యాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ అనే రెండు యాంటీబాడీలు ఉంటాయి. ఈ మిశ్రమం వల్ల ఆస్పత్రిలో చేరికలు, మరణాలు 70 శాతం తగ్గిపోతాయని భావిస్తున్నారు. అమెరికాలో బామ్లానివిమాబ్‌, ఎటెసివిమాబ్‌ అనే యాంటీబాడీ మిశ్రమాన్ని కూడా కొవిడ్‌ రోగులకు ఇస్తూ వ్యాధి ముదరకుండా నివారిస్తున్నారు. డెల్టా వేరియంట్లపైనా ఈ యాంటీబాడీ మిశ్రమాలు పనిచేస్తాయా అని పరిశీలిస్తున్నారు.

రచయిత- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.