అందరికీ అన్నదాత.. దేశానికి వెన్నెముక.. రైతే రాజు.. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రైతుల గురించి చదువుకున్నది, తెలుసుకున్నది.. ఇవే! రాజస్థాన్ భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఎక్కడ చదువుకున్నాడో ఏమో.. కోటాలో కూర్చొని కాలు కదపకుండా చాలా కనిపెట్టేశాడు. రైతులు తీవ్రవాదులని, దోపిడి దొంగలని, బర్డ్ ఫ్లూ వ్యాపింపజేసే ప్రమాదకారులని, దేశంలో సంక్షోభం సృష్టిస్తున్నారని.. తీర్మానించేశాడు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలై యాభై రోజులవుతున్నా కేంద్ర నిఘాసంస్థలు సైతం ఆ విషయాలను పసిగట్టలేకపోవడం నిజంగా వారి అసమర్థతకు నిదర్శనమే. దిలావర్ దక్షతను గుర్తించి అందరూ ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం మంచిదనిపిస్తోంది.
ఉద్యమానికి ఊపునివ్వాలని, ఊపిరవ్వాలని విషం తాగి రైతులు విగతజీవులవుతున్న విషయాన్నీ విస్మరించి, విహారయాత్రలు చేస్తున్నారంటూ విస్తుగొలిపే విడ్డూరాలను ఆ రామ్‌గంజ్‌మండీ ఎమ్మెల్యే వెల్లడిస్తున్నారంటే- కచ్చితంగా ఆయన దగ్గర ఏవో నికార్సయిన నివేదికలు ఉండే ఉంటాయి. అరవైమంది వరకు రైతులు ఆందోళనల మధ్య నడిరోడ్లపై అసువులు బాసినా, ఇంకా రౌండ్ల మీద రౌండ్లు చర్చలతో సాగదీస్తున్న ప్రభుత్వం దిలావర్ దగ్గర ఉన్న నివేదికల్ని తప్పకుండా అడిగి తీసుకోవాలి. వాటి ఆధారంగా సరిహద్దుల్లో ఉన్న విద్రోహశక్తులను వెంటనే జైళ్లలో పెట్టాలి. చికెన్ బిర్యానీలు తిని బర్డ్‌ఫ్లూ వ్యాపింపజేస్తున్న వారిపై విపత్తు నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తి నివారణ చట్టాల కింద కేసులు పెట్టి కారాగారాల్లోకి నెట్టాలి. లేకపోతే నయా వ్యవసాయ చట్టాల వల్ల లాభాలపై లాభాలు వచ్చిపడతాయని చెప్పినా చెవికెక్కించుకోకుండా, మద్దతు ధరకు హామీ ఉందంటున్నా మాట వినిపించుకోకుండా, ఆ హామీని కాస్త చట్టంలో చేర్చి కాపాడమని కర్షకులు గొంతెమ్మ కోరికలు కోరడం కచ్చితంగా విపరీతపు విద్రోహచర్య కాక ఇంకేమిటి?
అన్నదాతలు ఆటంకవాదులా? సాగు చట్టాల వల్ల దగా పడతామనిపిస్తోంది కాస్త దయచూపమనేవాళ్లు దోపిడిదారులా? రెక్కల కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించేవారు దొంగలా? దాదాపు మతిభ్రమించిందేమో అన్న స్థితిలో దిలావర్ మాట్లాడిన మాటలివి. అక్కడిదో ఆగిందా ఆ వాచాలత్వం? రైతులంతా ఆందోళనల పేరుతో దేశ రాజధాని శివార్లలో విహారయాత్రను వినోదంగా సాగిస్తున్నారట. చికెన్ బిర్యానీలు, జీడిపప్పు, బాదాం తింటూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారట. దీనికి కర్ణాటకలోని కోలార్ భాజపా ఎంపీ మునుస్వామి తందానతాన అంటున్నాడు. ఈయన మెనూ ఇంకాస్త పెంచాడు. రైతులు పిజ్జాలు, బర్గర్లు లాగించేస్తున్నారట. డబ్బులు పుచ్చుకొని డ్రామాలాడుతున్నారట. నాగలిని నమ్ముకొని కష్టించే శ్రమజీవుల శాంతియుత నిరసనల్లో ఖలిస్థానీయులను, మావోయిస్టులను కనిపెట్టిన హరియాణా భాజపా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కారుకూతల గొడవ ఇంకా ముగియక ముందే- మదన్ దిలావర్, మునుస్వామి వింత వాదాలతో రెచ్చిపోతున్నారు!
వైరస్‌లు, వ్యాధులు, వాటి వ్యాప్తిపై తన పరిశోధన విజ్ఞాన విభవాన్ని వీడియోల ద్వారా వెదజల్లడం దిలావర్‌కు అలవాటే. ఆ మధ్య కరోనాపై ఏవో గందరగోళపరచే కూతలు కూయడం సహా భౌతిక దూరాన్ని పాటించకుండా ప్రజలను పోగేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. చికెన్ బిర్యానీ తింటూ రైతులు బర్డ్‌ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని కనిపెట్టి ఇతగాడు ఓ వీడియోతో మీడియాలోకెక్కాడు. ప్రఖ్యాత పరిశోధన సంస్థలు సైతం సిగ్గుపడేలా కుట్ర సిద్ధాంతాలను సూత్రీకరించాడు. ఇదంతా తెలియకపోవడం వల్లే కాబోలు- బ్రిటన్, కెనడా ప్రధానులు అన్నదాతల ఆక్రోశానికి మద్దతు తెలిపారు పాపం. ఈ సమాచారం అత్యున్నత న్యాయస్థానం దగ్గర లేకపోవడం వల్లే సేద్యజీవుల సమస్యలకు కరిగిపోయి త్వరగా పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరింది!!
రైతుల సంక్షేమంతోనే రామరాజ్యం వస్తుందంటూ తెగ పొగిడి ఓట్లు రాబట్టుకున్నప్పుడు తీవ్రవాదులెవరో తెలిసినట్లు లేదు. మళ్లీ ఓట్ల కోసం ఆ ఆటంకవాదుల గడపలనే తొక్కాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించినట్లున్నారు. వీడియోలు, విమర్శలతో ఇంత గోల చేసే బదులు కొత్త చట్టాలు ఎలా మేలు చేస్తాయో చెప్పి కళ్లు తెరిపిస్తే రైతులంతా ప్రశాంతంగా ఇళ్లకు చేరిపోతారు కదా!
అడ్డూ అదుపూ లేకుండా నోటి దురుసుతో అన్నదాతలను ఆడిపోసుకుంటున్న ఘనత ఆ నేతలకే చెల్లింది. కొత్త చట్టాల వల్ల పంటంతా కార్పొరేట్ కాకుల పాలవుతుందని రాబోయే కష్టాలను ఏకరువు పెడుతూ, ఏకంగా రైతు కుటుంబాల పిల్లలూ పెద్దలంతా రోడ్డున పడి చేస్తున్న ఆందోళనలు పిక్నిక్కుల్లాగా ఉన్నాయంటూ పిచ్చితనానికి పరాకాష్ఠగా ప్రకటిస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. గడ్డకట్టే చలిలో వణుకుతూ వ్యక్తం చేస్తున్న నిరసనల్లో న్యాయాన్ని చూడలేకపోగా, అనవసరమైన దూషణలతో దాడులకు పాల్పడుతున్న నాయకుల గుడ్డితనాన్ని మరెవరూ గుర్తించలేదు. ఇప్పటికైనా అధినేతలు స్పందించకపోతే ఒకరి తరవాత ఒకరు ఇలాగే విమర్శలకు తెగబడతారు. దాంతో రైతుల గౌరవంతోపాటు దేశ ప్రతిష్ఠ కూడా ప్రపంచంలో పలుచనయ్యే ప్రమాదం ఉంది. బర్డ్‌ఫ్లూని అడ్డం పెట్టుకొని ప్రేలాపనలతో పేట్రేగిపోతున్న నాయకులకేమీ ఫర్వాలేదు. ఓట్ల కాలానికి అన్నీ వదిలేసి అన్నదాతల గూటికి చేరి వారి కాళ్లపై పడిపోతారు. పోయేది మాత్రం మన జాతి పరువే!
- ఎమ్మెస్
ఇదీ చూడండి:ప్రభుత్వ కృషితోనే అంకురాల అభివృద్ధికి అవకాశం