ETV Bharat / opinion

పడగెత్తుతున్న విపత్తులు.. నష్టనివారణే తక్షణ కర్తవ్యం!

ఈ ఏడాదిలో తొలి తుపాను 'తౌక్టే'.. తీర ప్రాంత రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపార నష్టాన్ని మిగిల్చింది. మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన వాతావరణ మార్పులను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేయాలి.

natural disasters
విపత్తులు
author img

By

Published : May 20, 2021, 8:09 AM IST

'కోట్లాది సామాన్యుల జీవనోపాధులను రక్షించాలంటే ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుకోవాలి' అంటూ ప్రధాని మోదీ పిలుపిచ్చిన రెండు నెలలకే ఈ ఏడాదిలో తొలి తుపాను 'తౌక్టే' తరుముకొచ్చింది. పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసి అపార నష్టాన్ని మిగిల్చింది! ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టాన్ని పరిమితం చేయగలిగినా, ఆస్తి విధ్వంసంపై అంచనాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు! కట్టుదాటిన కర్బన ఉద్గారాలతో చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పుల మూలంగా అరేబియన్‌ జలధి వేడెక్కుతోంది. తత్ఫలితంగా రేగుతున్న తుపాన్లు పశ్చిమ భారతానికి పెనుప్రమాదంగా పరిణమిస్తున్నాయి.

తీవ్రస్థాయి తుపాన్లతో తూర్పుతీరం తరచుగా శోకతప్తమవుతున్న తరుణంలో పశ్చిమ దిక్కు నుంచీ అదే ముప్పు ముంచుకొస్తోందని కొన్నాళ్లుగా హెచ్చరికలు చెవిన పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ఏటా విరుచుకుపడే ఉష్ణమండల తుపానుల్లో బంగాళాఖాతం నుంచి పుట్టుకొచ్చేవి నాలుగు శాతమే అయినా, మిగిల్చిపోయే నష్టంలో మాత్రం ఎనభై శాతం వాటా వీటిదే! ఈ తీవ్రతను ఇప్పుడు అరేబియన్‌ తుపాన్లూ అందిపుచ్చుకుంటున్నాయని అంటున్న పరిశోధకులు- హిందూ మహాసముద్రాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. 'ముందస్తు హెచ్చరికల వ్యవస్థలో సాధించిన ప్రగతి ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలుగుతున్నాం. ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఆస్తినష్టాన్ని సాధ్యమైనంత తక్కువకు పరిమితం చేయడమే ఇప్పుడు మన లక్ష్యం కావాలి' అంటున్న భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మాటలు తక్షణ కర్తవ్యమేమిటో ప్రభుత్వాలకు గుర్తుచేస్తున్నాయి.

ఫొని, అంపన్ బీభత్సం..

రెండేళ్ల కిందట భారత్‌, బంగ్లాదేశ్‌లతో కన్నీళ్లు పెట్టించిన 'ఫొని' తుపాను రూ.59 వేల కోట్ల విలువైన ఆస్తిపాస్తులను గంగపాలు చేసింది. నిరుడు పశ్చిమ్‌ బంగపై మహోగ్రంగా దండెత్తిన 'అంపన్‌' విపత్తు ఆర్థికంగా అంతకు రెండింతలు దెబ్బకొట్టింది. ఏడు వేల కిలోమీటర్లకు పైబడిన సాగర తీరంలో అయిదు వేల కిలోమీటర్లకు పైగా ప్రాంతం పెను ఉత్పాతాలకు ఆలవాలమవుతోంది. 'జాతీయ తుపాను ప్రమాద తీవ్రత తగ్గింపు కార్యక్రమం' (ఎన్‌సీఆర్‌ఎంపీ) కింద ప్రపంచ బ్యాంకు తోడ్పాటుతో సముద్రతీర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తినష్టాన్ని అరికట్టాలని దశాబ్దం కిందటే కేంద్రం తలపోసింది! రూ.2361 కోట్లతో గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాల్లో ఎన్‌సీఆర్‌ఎంపీ రెండో దశ అమలుకు అయిదేళ్ల కిందట మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది.

నత్తనడకన పనులు..

నిరుడు మార్చి నాటికి పూర్తికావాల్సిన పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి! ఈ తరహా ఉదాసీనతే వైపరీత్యాల సమయంలో పుట్టి ముంచుతోంది! రెండు దశాబ్దాల కిందట సూపర్‌ సైక్లోన్‌ విలయం నుంచి పాఠాలు నేర్చుకున్న ఒడిశా విపత్తులను తట్టుకుని నిలిచేలా మౌలిక వసతులను తీర్చిదిద్దుకుంది. గ్రామస్థాయి వాలంటీర్లు, పటిష్ఠమైన తుపాను షెల్టర్లు, రేషన్‌కిట్ల సరఫరా యంత్రాంగాలతో అపాయాన్ని నేర్పుగా ఎదుర్కొంటోంది. పర్యావరణ మార్పులతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్న 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి.

వీటిలో ముంబై, చెన్నై లాంటి సముద్రతీర మహానగరాల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ముందస్తు సన్నద్ధత తప్పనిసరి! సాగర మథనంతో సిరుల సేద్యం చేస్తున్న ప్రపంచ దేశాలకు భారత్‌ దీటుగా నిలవాలంటే తీరప్రాంత రాష్ట్రాలు విపత్తుల వేళ కన్నీటి సంద్రాలు కాకుండా కాచుకోవాలి. మానవాళి మనుగడకు మరణశాసనం రాస్తున్న వాతావరణ మార్పులను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలను మరింత చిత్తశుద్ధితో నిర్వర్తించాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.