నాణ్యమైన రహదారులు ప్రగతికి మేలుబాటలవుతాయి. దేశార్థిక పారిశ్రామిక రంగాల సుస్థిరాభివృద్ధికి గరిష్ఠంగా దోహదపడతాయి. వాస్తవంలో, రోడ్ల నిర్మాణంలో నాసి ప్రమాణాలు తీవ్ర అనర్థదాయకంగా పరిణమిస్తున్న వేళ- జవాబుదారీతనాన్ని పాదుగొల్పేందుకంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కొత్త సర్క్యులర్‌తో ముందుకొచ్చింది.
అందరూ వివరణ ఇవ్వల్సిందే..
ఇప్పటివరకు రహదారి నిర్మాణాల్లో తప్పిదాలు, వైఫల్యాలకు సంబంధిత గుత్తేదారులూ కన్సల్టెంట్ల సంజాయిషీ కోరడం లేదా చెవులు మెలేయడంతో సరిపుచ్చుతున్నారు. ఇకమీదట పర్యవేక్షణ లోపాలకు ఎన్‌హెచ్‌ఏఐ(భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) అధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాంతీయ సిబ్బంది, కార్యనిర్వాహక సంచాలకులు ప్రభృతులందరూ వివరణ ఇచ్చుకోవాల్సిందేనని, బాధ్యులపై చర్యలూ తథ్యమన్నది సరికొత్త ఉత్తర్వుల సారాంశం. నిర్ణీత కాలావధిలో పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించి తీరాలంటున్న మంత్రిత్వశాఖ- నిబంధనల ఉల్లంఘనల్ని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన వైఖరి అవలంబిస్తేనే, పరిస్థితి తేటపడుతుంది.
నూతన విధానం..
వచ్చే రెండేళ్లలో రహదారి నిర్మాణ పద్దు కింద రూ.15లక్షల కోట్ల మేర వ్యయీకరించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎనిమిది వారాల క్రితం వెల్లడించారు. అందులో జాతీయ రహదారులతోపాటు సాధారణ రోడ్ల నిర్మాణ వ్యయమూ కలిసి ఉంది. అంత భూరి మొత్తం ప్రజాధనంలో ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా దీటైన కార్యాచరణ చురుగ్గా పట్టాలకు ఎక్కాలి. అధ్వాన రహదారులకు బాధ్యులైన గుత్తేదారులకు రూ.10కోట్ల వరకు జరిమానా, ప్రమాదాలు చోటుచేసుకున్న పక్షంలో రెండేళ్లపాటు వారికి సస్పెన్షన్ విధించేలా నూతన విధానాన్ని క్రోడీకరించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అయిదు నెలల క్రితం ప్రకటించింది. అటువంటి విధినిషేధాలు పకడ్బందీగా అమలుకు నోచుకుంటేనే, రహదారి నిర్మాణ స్థాయీప్రమాణాలు గుణాత్మకంగా మెరుగుపడతాయి!
అవి ప్రాథమిక హక్కు..
సుమారు లక్షా 36 వేల కిలోమీటర్ల నిడివి జాతీయ రహదారులున్న దేశంలో లక్షా 76 వేల కిలోమీటర్లకు పైగా రాష్ట్ర హైవేలు, 59 లక్షల కిలోమీటర్ల దాకా ఇతర రోడ్లు లెక్క తేలుతున్నాయి. శాస్త్రీయత, నిర్దుష్టత కొరవడిన రోడ్ల నిర్మాణం, డిజైనింగ్ తప్పిదాలకు అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, మద్యపానం తదితరాలు జతపడి ప్రజల ప్రాణాల్ని తోడేస్తున్నాయి. ఒక్క జాతీయ రహదారులనేముంది- ఎక్కడ ఏ పరిధిలోనిదైనా రోడ్డు నిర్మాణంలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందే. 'గుంతలు లేని రోడ్లు, సరైన పాదచారి బాటలు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు'అని ఆరేళ్ల క్రితం బాంబే హైకోర్టు స్పష్టీకరించింది.
రహదారులు సక్రమంగా లేకపోయినా వీధులు, పాదచారి బాటలు గుంతలమయమైనా పౌరుల ప్రాణాలకే ముప్పు అంటూ బెంగళూరు నగర పాలికను కర్ణాటక హైకోర్టు తప్పుపట్టడాన్ని నిరుడు సుప్రీంకోర్టూ సమర్థించింది! అయినా, క్షేత్ర స్థాయిలో దుర్భర స్థితిగతులు నిశ్చేష్టపరుస్తున్నాయి. కొత్తగా వేసిన రహదారులూ రెండు మూడు నెలలైనా గడవకముందే వర్షానికి గుంతలమయమై, కొన్నిచోట్ల సాంతం కొట్టుకుపోతున్నాయి.
అంతులేని వ్యధ!..
హైదరాబాద్, విజయవాడ, కొచ్చి, ముంబై, ఉధంపూర్, కోల్‌కతా- ఎక్కడ చూసినా తరతమ భేదాలతో ఇదే కథ.. అంతులేని వ్యధ! రోడ్ల నిర్మాణానికి కనీసం ఎంత ఖర్చవుతుందన్నది విస్మరించి తక్కువ ధర పేర్కొన్నవాళ్లకు గుత్తేదారులుగా కిరీటం తొడిగాక- ఎక్కడికక్కడ అవినీతి వాటాలు తెగుతున్నాయి.
సుప్రీం ధర్మాసనం లోగడే చెప్పినట్లు- ఆయా స్థానిక సంస్థలు, గుత్తేదారులు, రాష్ట్రాల రహదారి విభాగాల అధిపతులది తిలా పాపం తలా పిడికెడు. రహదారి భద్రతకు, జీవన హక్కు పరిరక్షణకు ప్రాణాధారమైన రోడ్ల నిర్మాణ నాణ్యతకు ఏ స్థాయిలోనూ తూట్లు పడకుండా ప్రజా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే పౌరులు తెప్పరిల్లుతారు!