ETV Bharat / opinion

రాష్ట్రాలకేది విత్త సత్తువ.. కేంద్రం భరోసాతోనే ధీమా! - పన్నులు

ప్రజారోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత. కొవిడ్‌ విషకోరల నుంచి జనసమూహాల్ని కాచుకోవడానికి రాష్ట్ర సర్కార్లు సకల శక్తియుక్తుల్నీ కూడదీసుకుని మహాసమరం చేస్తున్న వేళ- విత్తలోటు సంక్షోభం వాటి నెత్తిన ఉరమడాన్ని మించిన వైపరీత్యం ఉందా? పన్ను రాబడులు తీసికట్టుగా ఉండటంతో బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రాష్ట్రాలకు బదలాయింపులు రెండు లక్షల కోట్ల రూపాయల దాకా తగ్గుతాయన్న సమాచారం. ఈ గడ్డుపరిస్థితి నుంచి రాష్ట్రాల్ని కేంద్రమే ఒడ్డున పడేయాలి.

EDITORIAL ON ECONOMY AND TAXES
రాష్ట్రాలకేది విత్త సత్తువ
author img

By

Published : May 5, 2020, 7:50 AM IST

ఒక ప్రపంచయుద్ధం సృష్టించగల పెను విధ్వంసం తీవ్రత ఏ పాటిదో కరోనా మహమ్మారి నేడు కళ్లకు కట్టింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని దేశాల్లో అపార ప్రాణనష్టం, తీసుకొన్న దేశాల్లో ఊహాతీత స్థాయిలో స్థూలదేశీయోత్పత్తి పతనం దిగ్భ్రాంతపరుస్తున్నాయి. మనుషుల ప్రాణాలే ముఖ్యం అంటూ ఇండియా ఆరు వారాల క్రితం విధించిన లాక్‌డౌన్‌తో దేశార్థిక వ్యవస్థ అక్షరాలా ఐసీయూలోకి చేరింది. ప్రజారోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత. కొవిడ్‌ విషకోరల నుంచి జనసమూహాల్ని కాచుకోవడానికి రాష్ట్ర సర్కార్లు సకల శక్తియుక్తుల్నీ కూడదీసుకుని మహాసమరం చేస్తున్న వేళ- విత్తలోటు సంక్షోభం వాటి నెత్తిన ఉరమడాన్ని మించిన వైపరీత్యం ఉందా? రాష్ట్రాలు స్వయంగా సేకరించే పన్నుల రాబడి 46శాతం, పన్నేతర ఆదాయం ఎనిమిది శాతం; తక్కినదంతా కేంద్ర పన్నుల్లో వాటా (26శాతం), గ్రాంట్లు (20శాతం) రూపేణా సమకూరేదే. రాష్ట్రాల రాబడుల్లో కీలక పద్దులైన ఎస్‌జీఎస్‌టీ (39.9 శాతం), పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ (21.5), ఎక్సైజ్‌ (11.9), స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ (11.2), వాహన పన్ను (5.7) వంటివన్నీ అక్షరాలా పడకేశాయి. గత నెలలో తెలంగాణకు రావాల్సిన ఆదాయం రూ.5,000 కోట్లు. తీరా వచ్చింది రూ.500 కోట్లు! ఉత్తర్‌ ప్రదేశ్‌ సర్కారుకు ఏప్రిల్‌లో వచ్చింది రూ.2,284 కోట్లు, జీతనాతాల చెల్లింపుల బిల్లు రూ.12 వేలకోట్లు! ఇలా రాబడికి ఖర్చులకు ఏమాత్రం లంగరందక తీవ్రాందోళన చెందుతున్న రాష్ట్రప్రభుత్వాలు- ఓ యుద్ధానికి ఏ మాత్రం తీసిపోని అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం విత్తసత్తువ ఇచ్చి తమను ఆదుకోవాలని కోరడం పూర్తిగా సమంజసమే. పన్ను రాబడులు తీసికట్టుగా ఉండటంతో బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రాష్ట్రాలకు బదలాయింపులు రెండు లక్షల కోట్ల రూపాయల దాకా తగ్గుతాయన్న సమాచారం గోరుచుట్టుపై రోకటి పోటే! ఈ గడ్డుపరిస్థితి నుంచి రాష్ట్రాల్ని కేంద్రమే ఒడ్డున పడేయాలి.

దశాబ్దాలుగా సహకార సమాఖ్య భావన వీనులవిందుగా వినిపించే భారతావనిలో రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన మరీచికగా మారిందన్నది నిజం. పద్నాలుగో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42 శాతం వాటాకు ఓటేసినా, ఆ మేరకు నిధుల ప్రవాహాలకు లాకులెత్తలేదన్నదీ వాస్తవం. 2017 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్‌టీ చట్టం కింద రాష్ట్రాలు తమ పన్ను అధికారాల్లో సింహభాగాన్ని జీఎస్‌టీ మండలికి బదలాయించాయి. పదిహేనో ఆర్థిక సంఘం కొత్త మార్గదర్శకాలకు లోబడి ఏం చెబుతుందో తెలియని నేపథ్యంలో- ద్రవ్యబాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి లోబడి అప్పులతో బండి నెట్టుకురావాల్సిన దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూరుకుపోయాయి. కరోనా దెబ్బకు కేంద్రం కంటే రాష్ట్రాల ఆర్థిక బడ్జెట్లే మరింతగా కకావికలమైపోయాయని అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్‌, విక్రయపన్ను రూపేణా రూ.3.26 లక్షల కోట్ల రాబడి వస్తుందని రాష్ట్రాలు బడ్జెట్లలో అంచనా వేశాయి. లిక్కర్‌పై పన్నే కీలకమైన ఎక్సైజ్‌ బడ్జెట్ల అంచనా రూ.1.75 లక్షల కోట్లు; స్టాంపు-రిజిస్ట్రేషన్ల ద్వారా రాగలవనుకొన్నది రూ.1.4 లక్షల కోట్లు! వాటన్నింటికీ కరోనా మంగళం పాడేస్తున్న తరుణంలో రోజువారీ ఖర్చులతోపాటు, కొవిడ్‌ కుంపట్లను ఆర్పడానికి అవసరమయ్యే అదనపు వనరుల్ని ఎలా సాధించాలో తెలియక రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్‌టీ బకాయీల కోసం కేరళ గట్టిగానే గొంతెత్తుతోంది. నిధుల తాత్కాలిక సర్దుబాటు పరిమితిని ఆర్‌బీఐ పెంచినా, దానివల్ల రాష్ట్రాలకు పెద్దగా ఒనగూడేదేముంది? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించి అదనంగా మరో రెండు శాతం రుణస్వీకరణకు వెసులుబాటు కల్పించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. సత్వరం రాష్ట్రాల ఆర్థిక స్వస్థతకు కేంద్రం భరోసా ఇస్తేనే, ధీమాగా కొవిడ్‌పై కత్తి ఝళిపించే సావకాశం వాటికి చిక్కుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.