భీకర యుద్ధంలో నెత్తుటేళ్లు పారుతూ శవాల గుట్టలు పోగుపడుతుండగా, మాంసఖండాలు పీక్కుతినేందుకు ఆబగా వాలే రాబందుల గుంపుల్ని ఎప్పుడైనా చూశారా? కొవిడ్ మహమ్మారి యావత్ జాతినీ హడలెత్తిస్తుండగా, ఎక్కడికక్కడ నల్లబజారు దందా విక్రమిస్తుండటమే... ఆ దౌర్భాగ్య దృశ్యానికి సరిపోలిక!
దేశంలో ఇప్పుడు కొవిడ్ కేసులు రోజుకు నాలుగు లక్షల మేర విజృంభిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రతి నాలుగు కొవిడ్ మరణాల్లో ఒకటి ఇక్కడే నమోదవుతోంది. అమెరికా, మెక్సికో, బ్రెజిల్ తరువాత ఇండియాలోనే మరణాలు అధికమంటున్న గణాంకాలు పరిస్థితి తీవ్ర తను చాటుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండాలన్నదానిపై కేంద్ర మంత్రిమండలి వర్చువల్ భేటీ జరిపింది. అందులో- ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెరగాలని నిర్దేశించిన ప్రధాని మోదీ, అత్యవసర ఔషధాలకు ఎక్కడా కొరత లేకుండా చూడాలని యంత్రాంగానికి పిలుపిచ్చారు. వాస్తవంలో జరుగుతున్నదేమిటి? పలు రాష్ట్రాల్లో ఔషధాలకు కొరత ప్రజానీకాన్ని వేధిస్తోంది. గిరాకీ, సరఫరాల మధ్య అంతరాన్ని ఎడాపెడా సొమ్ము చేసుకునే ముఠాల బాగోతాలు వెలుగు చూస్తున్నాయి.
దేశ రాజధాని లోనూ అదే కథ. దానిపై మండిపడ్డ దిల్లీ ఉన్నత న్యాయస్థానం 'కొంత మందిక్కడ ఔషధాలను ఆక్సిజన్ను అక్రమంగా నిల్వపెడుతున్నారు.. మీరు చేతులు కట్టుక్కూర్చున్నారు!' అంటూ కేజీవాల్ సర్కారుపై నిప్పులు కక్కింది. ప్రాణాధార ఔషధాలు, ఇంజక్షన్లను దారిమళ్ళించి సులభార్జన వనరులుగా మలచుకుంటున్నవాళ్లు అసలు మనుషులేనా అని కోట్లాది అభాగ్యులు ఆక్రందిస్తున్నారు.
దేశం నలుమూలలా ఎన్నో చోట్ల కీలకమైన మందులు, ఆక్సిజన్ నల్లబజారుకు తరలిపోతున్నాయని, నిర్దేశించిన ధరలకు పదింతలకు పైగా దండుకుంటున్న అక్రమ నిల్వదారులూ దళారులపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలంటూ న్యాయశాస్త్ర విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తికి తాజాగా ఉమ్మడి లేఖ రాశారు. ఆ లేఖాంశాలతో పాటు ఇండోర్, రాయపూర్, జలంధర్, ఘజియాబాద్, రూర్కీ, హరిద్వార్ ప్రభృత ప్రాంతాల్లో రెమ్‌డెసివిర్ చోరముఠాల లీలా విలాసాలు పరికించినవారంతా నివ్వెరపోతున్నారు. రెమ్‌డెసివిర్ సీసాపై లోగో అలాగే ఉంచి లోపల నీటిని ఇతర పదార్థాలను నింపి 'అసలు సరకు'గా అంటగడుతున్న బాగోతాలూ వెలుగు చూస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖ, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో కరోనా మందుల పేరిట విచ్చలవిడిగా అక్రమ వ్యాపార కార్యకలాపాలు పెచ్చరిల్లుతున్నాయి.
చికిత్స పొందుతూ మరణించిన రోగికి సంబంధించి మిగిలిపోయిన ఇంజక్షన్లనూ కక్కుర్తిగా సొమ్ము చేసుకుంటున్న వాళ్లను మానవులుగా గుర్తించడానికి ఎవరికీ మనసొప్పదు! రోగుల అవసరాన్ని, వారి బంధువులు మిత్రులు సంబంధీకుల ఆందోళనను సువర్ణావకాశంగా మలచుకుని అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నారు. కరోనా వైరస్ లోడ్ అధికంగా ఉన్నవారికి సూచిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజక్షన్, ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి వినియోగించాల్సిన కొవిఫర్ ఔషధం... డబ్బు జబ్బు ముదిరిపోయి రాక్షసాంశ సంతరించుకున్నవాళ్లకు మహా గొప్ప ఆదాయ వనరులుగా పరిణమించాయి. రూ.40 వేల మేర గరిష్ఠ చిల్లర ధర కలిగిన తొసిలిజూమాబ్ ఇంజక్షన్ ఇప్పుడు కొన్ని చోట్ల లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల దాకా ధర పలుకుతోంది! ఇంతగా ఔష ధాలకు, అత్యవసర వైద్యసామగ్రి ధరవరలకు నల్ల రెక్కలు తొడుగుతున్న ప్రబుద్ధులు కాసులు రాబందులు కాక మరేమిటి?
ఆరోగ్య బీమా ఉన్నా..
'దయచేసి వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోండి...' అని ప్రాధేయపడే కొవిడ్ రోగులు, వారి సంబంధీకులు ఎవరైనా తారసపడితే- దళారి బృందాలకు పండగే పండగ. ఒకరోజు చికిత్సకు ఐసొలేషన్లో అయితే రూ.4000, ఐసీయూలో అయితే ఏడున్నర వేలు, వెంటిలేటర్‌పై సేవలకు రూ.9000 వంతున వసూలు చేయాలన్న సర్కారీ ఆదేశాలను ఎన్నో ప్రైవేటు ఆస్పత్రులు బేఖాతరు చేస్తున్నాయి. రెండో దశ విజృంభణ దృష్ట్యా రోగుల పట్ల ఉదారంగా వ్యవహరించాలన్న భారతీయ వైద్య సంస్థ (ఐఎమ్ఎ) విజ్ఞప్తినీ తుంగలో తొక్కుతున్నాయి. కనీసం లక్ష రూపాయలు చెల్లిస్తేనే దవాఖానాలో ప్రవేశం దక్కుతోంది. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ అంగీకరించేదే లేదంటూ బిల్లులో నిర్దిష్ట మొత్తం నగదు రూపేణా చెల్లించాలన్న షరతుపైనే ఆస్పత్రిలో పడకను కేటాయిస్తున్న ఉదంతాలకూ కొదవ లేదు.
కొవిడ్ ధాటికి వణుకుతున్న 12 రాష్ట్రాల ఆక్సిజన్ అవసరాలకు మూడింతల మేర ట్యాంకుల నిల్వలున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు నివేదించింది. మరి రాష్ట్రాల వారీగా ఆక్సిజన్ కొరత నెల కొందంటూ ఆందోళన ఎందుకు చెలరేగుతున్నదంటే, సరైన సమాధానం ఎక్కడా ఆచూకీ లేదు. ఒక్కో ఆక్సిజన్ సిలిండరు లక్ష రూపాయల దాకా డిమాండు చేస్తున్నారన్న వార్తాకథనాల్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు- అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నవాళ్లను తమ ఎదుట ప్రవేశ పెట్టమనేసరికి, యంత్రాంగం కిక్కురుమంటే ఒట్టు! ఇష్టారాజ్యంగా రేటు పెంచేసి నల్లబజారులో కాసుల వేట సాగిస్తున్న భాగ్యనగర వాసులిద్దరి వద్ద 57 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకున్నారు. ఒక్క ముక్కలో, దేశవ్యాప్తంగా మూడు సిలిండర్లు ఆరు నోట్ల కట్టలుగా నల్ల వ్యాపారం పచ్చగా వర్ధిల్లుతోంది!
ఆస్పత్రిలో ప్రవేశానికి, మందులకు, చికిత్సకు అప్పోసప్పో చేసి భారీగా బిల్లు చెల్లించినా అయినవారిని దక్కించుకోలేక గొల్లుమంటున్న కుటుంబీకుల అవస్థలు అక్కడితో ముగియడం లేదు. ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో చనిపోతే, మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి పాతిక వేల రూపాయల వరకు బాదుడుకు సిద్ధపడాల్సిందేనని క్షేత్రస్థాయి కథనాలు చాటుతున్నాయి. శవాలపై కాసులేరుకునే దళారుల బరితెగింపు, చితిమంటల్లో మానవత్వం తగలబడుతున్న దిగ్భ్రాంతకర దృశ్యాన్ని కళ్లకు కడుతోంది. ఏ కారణంగానైనా మృతదేహం తరలింపు ఆలస్యమైతే, ఫ్రీజర్ సేవలకూ వేలల్లో చెల్లించాల్సిందేనంటూ కరాఖండీగా చెప్పి వసూలు చేసుకుంటున్న వాళ్లదీ అసురుల అంశే.
కొవిడ్ ఔషధాలను అక్రమంగా నిల్వ ఉంచి అడ్డగోలు వ్యాపారానికి తెగబడుతున్న వాళ్లపై 1980 నాటి జాతీయ భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో మూన్నాళ్ల క్రితమే ప్రజాప్రయోజన వ్యాజ్యమొకటి దాఖలైంది. జాతికే పెనువిపత్తు దాపురించిన వేళ, ఎందరిలోనో మానవత్వం కానరాకుండా పోతున్న దుస్థితిపై ఎవరికి నివేదించుకోవాలి?
--బాలు