మంచుకొండల కింద పెనుముప్పు - north india earthquake
ఉత్తర భారతానికి ఎప్పటికైనా భూకంపాల ముప్పు పొంచి ఉందని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు ఇప్పటికే తేల్చారు. హిమాలయ పర్వత పాదాల వెంబడి భూగర్భంలో ఎన్నడూ లేని రీతిలో పగుళ్ల పరంపరను పరిశోధకులు గుర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. హిమాలయ పర్వతాలు అత్యధికంగా భారత భూభాగం పలక, యురేనియన్ పలకల కదలికలపైనే ఆధారపడి ఉండటంవల్ల ఈ ప్రాంతమంతా భూకంపాల తాకిడికి గురై భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇప్పటి నుంచే విపత్తు నిర్వహణ ప్రణాళిక, కార్యాచరణతో సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎత్తయిన మంచుకొండలు, ప్రకృతి రమణీయమైన లోయలు, కనుమలతో నిండిన హిమాలయాలు భీతావహ ప్రకృతి విపత్తులకు కారణం కావచ్చునని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నేపాల్‌కు, ఉత్తర భారతానికి ఎప్పటికైనా భూకంపాల ముప్పు పొంచి ఉందనేది కెనడా లోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ కోసం పరిశోధనలు చేస్తున్న సమయంలో వెల్లడైన అంశాలివి. హిమాలయ పర్వత పాదాల వెంబడి భూగర్భంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పగుళ్ల పరంపరను పరిశోధకులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.
పర్వతోద్భవ ప్రక్రియ వల్ల
హిమాలయాలు ప్రపంచంలోనే అతి నవీన ముడుత పర్వతాలు. నిరంతర పర్వతోద్భవ ప్రక్రియ వల్ల- భూగర్భంలో పలు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రత్యేకించి హిమాలయ పర్వతాలు అత్యధికంగా భారత భూభాగం పలక, యురేనియన్ పలకల కదలికలపైనే ఆధారపడి ఉండటంవల్ల ఈ ప్రాంతమంతా భూకంపాల తాకిడికి గురై భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015లో నేపాల్‌లో పెను విధ్వంసం సృష్టించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదైంది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. తొమ్మిది వేలమంది మృత్యువాత పడ్డారు. హిమాలయాలు విస్తరించిన ప్రాంతానికంతటికీ సమీప భవిష్యత్తులోనే భారీ భూకంపాల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అత్యధిక జనసాంద్రత గల నేపాల్ దక్షిణ భూభాగ ప్రాంతం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక ఉత్తర భారతానికి పొంచిఉన్న ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇప్పటి నుంచే విపత్తు నిర్వహణ ప్రణాళిక, కార్యాచరణతో సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉంది!
నిరంతర చలనాలు
హిమాలయ పర్వతపాదాల వద్ద భూగర్భంలో ఇటీవల కనుకొన్న పగుళ్లు ఆగ్నేయ నేపాల్ భూభాగం పరిధిలోకి వస్తున్నట్లు ఆల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. ఇది అత్యధిక జనసాంద్రత గల ప్రాంతం. పెట్రోలియం అన్వేషణల్లో భాగంగా గంగానది వరద మైదానాల అంతర భూభాగంలోకి ధ్వని తరంగాలను పంపించగా అవి, అడుగున ఉన్న అవక్షేప పొరలను తాకి పరావర్తనం చెందినప్పుడు ఏర్పడిన ఛాయా చిత్రాలను పరిశీలిస్తే భూపటలం ముక్కలుగా, ఖండఖండాలుగా కనిపించింది. దాంతో భారీయెత్తున పగుళ్లున్నట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.
మరింత లోతైన పరిశోధన కావాలి..
మరోవైపు నేపాల్ నైరుతి భూభాగం సమతలంగా ఉండటానికి కారణం భూఖండ చలనాల వల్ల ఉత్పన్నమయ్యే బలాలు తోయడంవల్లేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రాంతంలోని భూకంపాలను, అంతర్గత నిర్మాణాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే భూఅంతర్భాగంలో మరింత లోతుకెళ్లి పరిశోధించాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం చాటుతోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే- ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా కాకుండా, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఖండచలనాలు 40 కి.మీ దక్షిణదిశగా వెనక్కు జరిగినట్లు తెలుస్తోందన్న పరిశోధకుల వ్యాఖ్యలు- భూగర్భంలో అంతర్గత సర్దుబాట్లు క్రియాశీలకంగా ఉన్నాయని విశదీకరిస్తున్నాయి. హిమాలయ పర్వతాల రూపు మార్పు తీరునూ తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అతి నవీనంగా ఉద్భవిస్తున్న పర్వతశ్రేణులు, వాటి అమరికనూ తెలియజెబుతున్నాయి. దీన్నిబట్టి హిమాలయ పర్వతాల్లో మార్పుచేర్పులు అనునిత్యం కొనసాగుతుండటం- ఖండచలనాల క్రియాశీలతను స్పష్టీకరిస్తోంది. భూకంపాలకు సంబంధించిన శాస్త్రీయమైన, కచ్చిత సమాచారం వందేళ్ల నుంచే లభిస్తోంది. అంతకుముందు కాలంలో హిమాలయాల్లో సంభవించిన భూప్రకంపనల వివరాలు నమోదు కాకపోవడంవల్ల నాటి పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నాం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అత్యధిక శాతం పగుళ్లు ప్రతి వెయ్యి సంవత్సరాలకోసారి మాత్రమే ఏర్పడతాయి. ప్రస్తుతం దృఢంగా ఉన్న భూభాగం ప్రాంతమంతా అడ్డుపగుళ్లతో కూడి భూమి ఉపరితలానికి లోపల ఉండటం వల్ల కుంగిపోవడమే కాకుండా, భవిష్యత్తులో భూకంపాలు భారీ తీవ్రతతో సంభవించడానికి ఆస్కారం ఉందన్న సంగతిని తాజా పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి.
అప్రమత్తం కావాలి
దాదాపుగా పదికోట్ల సంవత్సరాలకు మించిన కాలం నుంచే భారత ఉపఖండం ఉన్న పలక ఉత్తర దిశగా కదులుతూనే ఉంది. గడచిన నాలుగు లేదా అయిదు కోట్ల సంవత్సరాల నుంచి భారత ఉపఖండం పలక ఆసియా పలకను ఢీ కొడుతుండటంవల్ల జనించిన ఊర్ధ్వ బలాలే- ప్రపంచంలోని అత్యున్నత హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడటానికి కారణమయ్యాయన్న సంగతి విస్మరించలేనిది. భారత్ భూభాగం పలక నేటికీ ఉత్తరదిశగా ఆసియా పలకవైపు సంవత్సరానికి దాదాపు రెండు సెంటీమీటర్ల మేర కదులుతూనే ఉందని పరిశోధకులు గుర్తించారు. నేపాల్‌లోని హిమాలయాల ముందున్న ప్రాంతం వెంబడి ఉన్న పగుళ్లు- భారత ఉపఖండం ఆసియాన్ పలక కిందకు తోసుకురావడంవల్ల ఉత్పన్నమైన ఊర్ధ్వ బలాలవల్ల ఏర్పడ్డాయి. ఈ పలకల కదలికలు కుదుపులతో కూడినవి కావడం వల్ల, అదీగాక ఈ ప్రాంతమంతా అత్యధిక జనసాంద్రత కలిగి ఉండటంవల్ల భూకంపాల ముప్పు అధికంగా ఉంటుందని గమనించాలి. తాజాగా వెలుగులోకి వచ్చిన పగుళ్లు భారత భూభాగంలోకి విస్తరించినట్లుగా కనిపించనప్పటికీ భూకంప తరంగాల ప్రభావం నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారతంపై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మరవరానిదే. భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయనేది స్పష్టంగా చెప్పలేం. కాబట్టి సమగ్ర విపత్తు నిర్వహణ విధానాలతో సంసిద్ధులమై ఉంటే నష్టతీవ్రతను తగ్గించవచ్చు!
(రచయిత- డాక్టర్ జీవీఎల్ విజయ్ కుమార్, భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)
ఇదీ చదవండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!