జపాన్ వందో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫుమియో కిషిదకు ఇంటా బయటా కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతికి కళ్లెం వేయడం, మహమ్మారి దెబ్బకు పట్టాలు తప్పిన ఆర్థిక ప్రగతిని తిరిగి పట్టాలెక్కించడం- ఆయన ముందు ఉన్న ప్రధాన లక్ష్యాలు. అదే సమయంలో చైనా, ఉత్తర కొరియాల నుంచి భద్రతాపరంగా ఎదురవుతున్న ముప్పునూ దీటుగా ఎదుర్కోవాలి. కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని నెలకొల్పడంలో తనవంతు పాత్ర పోషించాలి. సుదీర్ఘ కాలం విదేశాంగ మంత్రిగా, మరికొన్నాళ్లు రక్షణ మంత్రిగా పనిచేసిన కిషిద ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని జపనీయులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు ఆయన ప్రధాని పీఠమెక్కడం ఇండియాకూ కలిసివచ్చే విషయమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'భారత్‌లో తయారీ' కార్యక్రమానికి జపాన్ తోడ్పాటుతో మరింత ఊపు తీసుకొచ్చేందుకు ఇదే సరైన తరుణం.
అనూహ్య పరిణామాలు
ఏడాదిన్నరగా జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి నాయకుడిగానూ తనదైన ముద్ర వేసిన షింజో అబె అనారోగ్య కారణాలతో గద్దె దిగారు. కొవిడ్ సంక్షోభం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న విపత్కర పరిస్థితుల్లో- నిరుడు సెప్టెంబరులో అబె కుడిభుజం యోషిహిదె సుగా ప్రధానమంత్రి అయ్యారు. కరోనా మహమ్మారి నియంత్రణలో విఫలమయ్యారని, టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించలేదని విమర్శలు వెల్లువెత్తడంతో ఏడాది తిరిగేసరికి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అలా కిషిదకు పదవీ భాగ్యం సంప్రాప్తించింది. తొలుత ఆయన అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. ఆ తరవాత ప్రధాని ఎన్నికల్లో సునాయాస విజయం సాధించారు. రక్షణ, దౌత్య వ్యవహారాలపై గట్టి పట్టు ఉన్న కిషిద లోగడ చైనాకు వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడలేదు. ఇటీవల ఆయన స్వరం మార్చారు.
ప్రధాని ఎన్నికల ప్రచార పర్వంలో అవకాశం చిక్కిన ప్రతిసారీ డ్రాగన్‌ను ఎండగట్టారు. తైవాన్‌ను కవ్విస్తున్న తీరును ఖండించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ విస్తరణ వైఖరిని తూర్పారబట్టారు. ఎన్నికల్లో గెలిచాక చేసిన తొలి ప్రసంగంలోనూ ఆ ప్రాంత పరిణామాలను ప్రస్తావించారు. ఇండో-పసిఫిక్‌లో వాణిజ్య, రవాణా కార్యకలాపాలు స్వేచ్ఛగా జరిగేలా చూడటం తన ప్రాధాన్యాంశాల్లో ఒకటని ఉద్ఘాటించారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా వంటి భావసారూప్య దేశాలతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న కిషిద ప్రధాని కావడం- చైనాకు మింగుడుపడని విషయమే!
భారత్ అభిమాని..
కిషిద భారతదేశాన్ని అభిమానిస్తారు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఇండియాకు మద్దతుగా మాట్లాడారు. ఈశాన్య భారతంలో మౌలిక వసతుల అభివృద్ధికి అబె సర్కారు 2015లో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించి జపాన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో అది ఒకటి. దాన్ని సాకారం చేయడం వెనక కిషిద కృషి ఉంది. అంతకు రెండేళ్ల మునుపు భారత్‌కు సంబంధించి మొత్తం 17 వేల కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీతో పలు కీలక ప్రాజెక్టులను ఆయన ప్రకటించారు.
ఆ తరవాత ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు... 'భారత్‌లో తయారీ'కు జపాన్ దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సముద్ర జలాల్లో ఇరు దేశాలు పరస్పర సహాకారాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇండో-జపాన్ బంధాన్ని పటిష్ఠం చేసేందుకు తన కృషిని కిషిద కొనసాగించవచ్చు. సెమీకండక్టర్లు, ఇతర విడిభాగాల కోసం చైనాపై ఆధారపడటాన్ని జపాన్ తగ్గించుకోవాలని ఇటీవలే ఆయన పిలుపిచ్చారు. చైనాను వీడి భారత్, ఈశాన్య ఆసియా దేశాల్లో వ్యాపారాలను ఏర్పాటుచేసుకునే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. కిషిద విధానాలను మోదీ సర్కారు సద్వినియోగం చేసుకోవాలి. జపాన్ సంస్థలను భారత్‌కు రప్పించాలి. వాటికి వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. అబె హయాములో బలపడ్డ ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పుడు కొత్త ఎత్తులకు తీసుకెళ్ళాల్సి ఉంది. సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి భారత్, జపాన్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమాన్ని(ఎస్‌సీఆర్‌ఐ) విజయవంతం చేయడంపైనా దృష్టి సారించాలి.
మరోవైపు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, జపాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడంపై మోదీ, కిషిద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. జీ-4 కూటమిలోని ఇతర సభ్యదేశాలైన జర్మనీ, బ్రెజిల్‌లతో కలిసి... భద్రతామండలిలో సంస్కరణల కోసం అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలి.
- నవీన్ కుమార్