భారత విదేశాంగ నీతి ఒక ఆశావహ అలీన ఉద్యమం నుంచి క్రమంగా రూపాంతరం చెంది మరింత వాస్తవికమైన సమతౌల్య విధానంగా అవతరించింది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలూ అందుకు అనుగుణంగా రూపుదిద్దుకొన్నాయి. మరీ ముఖ్యంగా హూస్టన్, అహ్మదాబాద్ ర్యాలీల అనంతరం ఉభయదేశాల సంబంధాలు శిఖరస్థాయిని అందుకున్నాయి. ప్రధాన మంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఈ అద్భుత బాంధవ్యానికి ప్రధాన కారణంగా భావిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం ద్విధ్రువ ప్రపంచ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఆ తరవాత సోవియట్ యూనియన్ విచ్చిన్నతతో ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థల విలీనం వంటి పరిణామాల కారణంగా బహుళధ్రువ ప్రపంచం ఆవిష్కృతమైంది. మారిన పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం మరింత వాస్తవికమైన సమతౌల్య వైఖరిని సంతరించుకోవడం సమంజసమే. ఇప్పుడు భారత్ వివిధ అంశాలపై విభిన్న దేశాలతో జతకడుతోంది. అమెరికా ఎన్నికల ఫలితాలు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని స్పష్టం చేశాయి. ప్రపంచవేదికపై అమెరికా పూర్వస్థితిని పునరుద్ధరిస్తారని భావిస్తూ బైడెన్ గెలుపును హర్షిస్తూ కొంతమంది, ట్రంప్ ఓటమిని గొప్ప ఊరటగా భావించి మరికొందరు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలు భారత్‌లో చాలామందికి ఆందోళన కలిగించాయి. భవిష్యత్తులో భారత్, అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయి? మారిన పరిస్థితుల్లోనూ అవి ఎప్పటి మాదిరిగానే కొనసాగుతాయా? ఇటువంటి ప్రశ్నలు చర్చనీయాంశాలుగా మనముందుకు వచ్చాయి. అగ్రనేతల వ్యక్తిగత అనుబంధం ఆ దేశాల సంబంధాలనూ ప్రభావితం చేసే మాట వాస్తవమే. అయితే.. నేతల అనుబంధం ఒక్కటే ఉభయ దేశాల సంబంధాలను నిర్ణయించలేదు. ప్రస్తుత ఆందోళనలో ఎంత సత్యం ఉందో నిర్ధారించాలంటే, ఇందుకు దారితీసిన కారణాలను నిశితంగా పరిశీలించాలి.
పాత లెక్కలు పదిలం!
ఈ ఆందోళనకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ట్రంప్, మోదీల మధ్య నెలకొన్న చక్కటి వ్యక్తిగత సంబంధం మోదీ, బైడెన్‌ల మధ్య ఇప్పటివరకూ లేదు. అమెరికాలో నాయకత్వం మారింది. ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల భారత్ పట్ల అమెరికా విధానం మారాల్సిన అవసరం లేదు. యూఎస్ డెమొక్రాట్లు పాకిస్థాన్ పట్ల మృదువైఖరి అవలంబిస్తారన్న అభిప్రాయం ఉంది. జో బైడెన్ నేతృత్వంలో అగ్రరాజ్య ద్వైపాక్షిక బృందం ఒకటి 2009లో పాకిస్థాన్‌లో పర్యటించిన మాట వాస్తవమే. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆ సందర్భంగా బైడెన్‌కు 'హిలాలే-పాకిస్థాన్' పురస్కారమూ ప్రదానం చేశారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యానికి బైడెన్ తిరుగులేని మద్దతు ఇచ్చారని, అమెరికా-పాక్ సంబంధాలను సరికొత్త స్థాయికి చేర్చారనీ ఆయన పేర్కొన్నారు. అంతేకాదు- భారత్‌లో జరుగుతున్నట్లు చెప్పే మానవ హక్కుల ఉల్లంఘనను బైడెన్, కమలా హ్యారిస్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిష్టరు వంటి అంశాల మీదా వారు భారత్‌పై విమర్శలు చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ, ఉభయ దేశాల సంబంధాలపై వ్యక్తమవుతున్న భయంలో నిజం లేదు. పొరుగు దేశాలతో అసంఖ్యాక ప్రాదేశిక వివాదాలు పెట్టుకుని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైనాపట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న వాస్తవాన్ని ఇక్కడ తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఇదే నేడు భారత్‌కు అతిపెద్ద అనుకూల అంశం. ఆఖరుకు కొవిడ్ మహమ్మారి విషయంలోనూ చైనా వ్యవహరించిన తీరుపట్ల పలు దేశాలు అనుమాన దృక్కులు సారించాయి. విదేశాంగ దౌత్యనీతిలో ఒక సూక్తి ఉంది- నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు... ఇది మనం మరిచిపోకూడదు!
ఇరాన్ అణు ఒప్పందం, ప్యారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక- ఈ రెండు ప్రధాన అంశాలపై ట్రంప్ అవలంబించిన విధానాలను తాను తిరగదోడతానని ఎన్నికల ప్రచారంలో బైడెన్ వాగ్దానం చేశారు. ఈ రెండింటి విషయంలో భారత్ కొంత మేరకు లబ్ధి పొందుతుందనే చెప్పాలి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక ఆంక్షలు తొలగిపోతే, భారత్ ఇరాన్ నుంచి మళ్ళీ లాభసాటిగా చమురు కొనుగోలు చేయగలుగుతుంది. ప్రాంతీయ అనుసంధానం పెంపొందించే దిశగా కొత్త పథకాలు చేపట్టడానికీ వీలవుతుంది. అలాగే, ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడంవల్ల ప్రతిపాదిత 'అంతర్జాతీయ సౌర కూటమి' ('ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్'ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్ సంయుక్తంగా ప్రతిపాదించారు) వాస్తవరూపం దాల్చి, భారత్ ఇంధన పరివర్తన పథకాలకూ ఊతంగా ఉపయోగపడుతుంది.
అగ్రరాజ్యం వైఖరి సుస్పష్టం
బైడెన్ ఎన్నికల ప్రచారంలో చేసిన మరో వాగ్దానం- హెచ్-1బి వీసా సంబంధిత సమస్యల పునస్సమీక్ష. ట్రంప్ ప్రవచించిన హెచ్-1బి వీసా విధానాలు, ఆయన వీసా నియంత్రణలు భారత వలసదారులకు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అవరోధాలుగా మారాయి. బైడెన్ హెచ్-1బి వీసా సంబంధిత ఆంక్షలు తొలగిస్తే, ఆ దేశంలో రకరకాల వృత్తుల్లో ఉన్న భారతీయ ఉద్యోగులకు భారత్‌నుంచి తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకువెళ్ళే వీలు కలుగుతుంది. తీవ్రవాదం, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం ఇత్యాది అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్‌తో కలిసి పనిచేస్తాననీ బైడెన్ హామీ ఇచ్చారు. తీవ్రవాదాన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడంలో అమెరికా భారత్ కలిసికట్టుగా నిలుస్తాయని, ఈ ప్రాంతంలో చైనానుంచి లేదా మరో దేశం నుంచి పొరుగు దేశాలకు ముప్పు లేకుండా శాంతి సుస్థిరతలను కాపాడేందుకు కృషి చేస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ తీవ్రవాదంపై పోరులో భారత్‌కు సహకారం అందించే అంశంలో తన ప్రకటనల ద్వారా బైడెన్ వెలువరించిన సందేశం సుస్పష్టంగా సుదృఢంగా ఉంది.
మార్పు మంచిదే
వాణిజ్య యుద్ధాలు, పారిశ్రామిక రహస్యాల చౌర్యం, గూఢచర్యం, సైబర్ దాడులు- కరోనా వైరస్‌ను ప్రయోగశాలల నుంచి 'స్మగుల్' చేసిందన్న వార్తలు- ఇలా అనేక విషయాల్లో అమెరికాకు చైనాతో సమస్యలు ఉన్నాయి. గతంలో తలెత్తిన ఈ సమస్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. ఈ పరిస్థితుల్లో, చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి భారత్‌వంటి నమ్మకమైన మిత్రుడు బైడెన్‌కు అవసరం.
- కె.సి.రెడ్డి (మాజీ ఐపీఎస్ అధికారి, ఐరాస మాజీ భద్రతా సలహాదారు)