ప్రపంచ దేశాలెన్నో కరోనాపై పోరులో తలమునకలై ఉండగా ఫిబ్రవరి ఒకటో తేదీన మయన్మార్‌లో సైన్యం తనదైన పాతబాణీలో ప్రజాప్రభుత్వంపై కత్తి దూసింది. మొన్న నవంబరు నాటి పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని ప్రజాదరణతో దండిగా ఓట్లు, సీట్లు గెలుచుకున్న ఎన్‌ఎల్‌డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ), నేడక్కడ అక్షరాలా రాజకీయ బందీ! అధ్యక్షుడు విన్ మయంట్, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ శాన్ సూచీలతోపాటు కీలక నేతలందర్నీ బంధించిన సైన్యం, అహేతుక తిరుగుబాటుపై నిరసన గళాల్నీ ఉక్కు పిడికిలితో నులిమేస్తోంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కృషిని నీరుకార్చే యత్నాలను గర్హించిన నేరానికి ఈ ఒకటిన్నర మాసాల వ్యవధిలో కనీసం 180 మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అంచనా.
సైనిక నేత అంధవిశ్వాసంతో..
2015 నాటి ఎన్నికల్లో మిలిటరీ మద్దతు గల యుఎస్‌డీపీ (యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్) పార్టీ ఓడిపోతే దేశంలో రక్తపాతం సంభవిస్తుందన్న హెచ్చరికల్ని లెక్కచేయని ప్రజలు, సూచీ పక్షానికి గట్టి మద్దతు చాటారు. నాటితో పోలిస్తే ఇటీవలి ఎన్నికల్లో ఇతోధిక జనాదరణ కూడగట్టిన సూచీ పక్షం కీలక రాజ్యాంగ సవరణలకు సిద్ధపడుతోందన్న భయానుమానాలే, సైనికాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్‌ను తిరుగుబాటు వైపు పురిగొల్పాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేపు జులైలో 65 ఏళ్లు నిండి పదవీ విరమణ చేశాక, స్వీయ సారథ్యాన రోహింగ్యాలపై మారణకాండకు సంబంధించి అంతర్జాతీయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న వెరపుతో, సైనిక తిరుగుబాటుకు లయాంగ్ పన్నిన కుట్ర- మయన్మార్ తలరాతనే మార్చేసింది. శాంతియుతంగా ప్రతిఘటిస్తున్న నిరసనకారులపై యథేచ్ఛగా సాగుతున్న సైనిక దాష్టీకంతో నేడక్కడి వీధులు ఎర్రబారుతున్నాయి. ఎలాగైనా సరే, అధికారం గుప్పిట పడితే విచారణల నుంచి రక్షణ లభిస్తుందన్న సైనికనేత అంధవిశ్వాసం- అక్కడి ప్రజాస్వామ్యం... పాము పడగనీడన కప్ప చందమేనని మరోసారి నిరూపించింది.
అవే అవలక్షణాలు..
భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చిన మరుసటి ఏడాదే ఆంగ్లేయుల చెర వీడిన మయన్మార్ (అప్పట్లో, బర్మా) 1962 లగాయతు దశాబ్దాల తరబడి కరకు సైనిక పాలనలో విలవిల్లాడింది. క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యానికి పాదు చేస్తున్నామంటూ 1990లో మిలిటరీ జుంటా నిర్వహించిన ఎన్నికల్లో సింహభాగం స్థానాలను ఎన్‌ఎల్‌డీ సాధించినా- రాజ్యాంగం లేకుండా అధికార బదిలీ సాధ్యంకాదంటూ ప్రజాస్వామ్యవాదుల్ని సైన్యం జైళ్లలోకి నెట్టింది. మూడు దశాబ్దాల తరవాత సైనిక తిరుగుబాటులో అవే అవలక్షణాలు, అక్కడ జనస్వామ్య స్ఫూర్తికి ప్రబల శత్రువులెవరో స్పష్టీకరిస్తున్నాయి. ఏడాదిపాటు అత్యయిక పరిస్థితి విధించిన సైనిక పాలకులు- లైసెన్సు లేని వాకీటాకీలు కలిగి ఉన్నారని, కరోనా నిబంధనలు ఉల్లంఘించారని సూచీపై తొలుత కేసులు బనాయించారు. తాజాగా అవినీతి ఆరోపణలతో ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు.
దౌత్య చొరవకు అడ్డుగా చైనా...
ప్రజాస్వామ్య స్వప్నం కరిగిపోయిన మయన్మార్‌లో సైనిక నేతలపై వివిధ ఆంక్షలు అమలుపరచనున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా ప్రకటించాయి. తనవంతుగా దక్షిణ కొరియా ఆయుధ విక్రయాలు నిలిపివేస్తానంటోంది. ఆసియాన్ తరఫున దౌత్యచొరవకు ఇండొనేసియా ప్రయత్నిస్తుండగా, చైనా ధోరణి కలవరపరుస్తోంది. స్వీయ ప్రయోజనాలు దెబ్బతినే పక్షంలో, అవతలి దేశం అనుమతితో నిమిత్తం లేకుండా విదేశీ భూభాగంపై పీఎల్‌ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) జోక్యానికి వీలుకల్పిస్తూ ఈమధ్యే జాతీయ రక్షణ చట్టాన్ని సవరించిన చైనా కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఉండాల్సిందే. మయన్మార్‌లో అస్థిరత రూపేణా ఈశాన్య భారతాన విద్రోహ చర్యల్ని రాజేసే ముప్పు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం వెయ్యికళ్లతో కాచుకోవాల్సిందే. అదే సమయంలో మయన్మార్ పౌరుల అభివృద్ధి కాంక్షలకు ప్రపంచదేశాలు గొడుగు పట్టేలా సారథ్య భూమికను ఐక్యరాజ్యసమితి సమర్థంగా నిభాయించాల్సి ఉంది. అంతర్జాతీయ తోడ్పాటుతో సంపూర్ణ ప్రజాస్వామ్య సాధనలో కృతకృత్యమైతేనే- దశాబ్దాల ఒంటరితనం, దుర్భర పేదరికాలపై మయన్మార్ గెలుపొందగలిగేది!