కరోనా సృష్టించిన లాక్‌డౌన్ పరిస్థితులు ప్రపంచ పత్తి, వస్త్ర మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్‌లో ఈ మార్కెటింగ్ ఏడాది (2019 అక్టోబరునుంచి 2020 సెప్టెంబరు) పత్తి దేశీయ వినియోగం తొలి అంచనాకన్నా ఏకంగా 51 లక్షల బేళ్లు తగ్గుతుందని తాజా అంచనా. లాక్‌డౌన్ కారణంగా కీలకమైన వేసవి సీజన్‌లో దేశంలో వస్త్ర వ్యాపారం కుదేలవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ మార్కెటింగ్ ఏడాది 3.31 కోట్ల బేళ్ల పత్తిని దేశీయంగా వినియోగిస్తారని తొలుత అంచనా వేయగా- లాక్‌డౌన్‌తో అది కాస్తా 2.80 కోట్ల బేళ్లకు పడిపోయిందని భారత పత్తి మిల్లుల సంఘం (సీఏఐ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీని ఫలితంగా వచ్చే అక్టోబరు 1న కొత్త ‘మార్కెటింగ్ ఏడాది’(2020-21) ప్రారంభమయ్యే నాటికి దేశంలో అక్షరాలా అరకోటి బేళ్ల పాత పత్తి నిల్వలు దేశ గోదాముల్లో మూలుగుతుంటాయని వెల్లడించింది. ఈ జూన్‌లో సాగు ప్రారంభం కానున్న పత్తి పంట మార్కెట్ అవకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అంశమనే చెప్పాలి. 2019-20లో మొత్తం 3.54 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఈ సంఘం తొలుత అంచనా వేసింది. కానీ, చివరికి అది 3.30 కోట్ల బేళ్లను దాటదని తాజాగా వెలువరించిన అంచనాల్లో సవరించింది.
దిగుబడి తక్కువే...
దేశంలో పత్తి పంట సాగు, దిగుబడుల తీరు గడచిన 20 ఏళ్లలోబాగా మారిపోయాయి. ఉదాహరణకు దేశంలో 2000-01లో కోటీ 40 లక్షల బేళ్ల పత్తి పంట పండితే ఈ ఏడాది 2019-20లో మూడు కోట్ల 30 లక్షల బేళ్లు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున హెక్టారుకు 782 కిలోల పత్తి పండుతుంటే భారత్‌లో సగటున 500కిలోలకు మించడం లేదని ‘భారత పత్తి విత్తన కంపెనీల సంఘం’(ఎన్‌ఎస్‌ఏ) తాజాగా కేంద్రానికి తెలిపింది. చైనాలో 1713, ఇజ్రాయిల్‌లో 1892 కిలోల పత్తి హెక్టారుకు పండుతుంటే అందులో సగానికి సగం కూడా భారతదేశంలో సగటున పండించలేకపోతున్నారు. ఇక్కడి వర్షాధార భూముల్లో కొందరు రైతులకు 3 నుంచి 4 క్వింటాళ్లకు మించి పంట పండటం లేదు. ఉదాహరణకు తెలంగాణలో నిరుడు 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగయితే 58 లక్షల బేళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. అంటే సగటున ఎకరానికి 1.09 బేళ్లు.
500 కిలోల పత్తితో ఒక బేలు దూది!
ఒక బేలు అంటే 170 కిలోల పత్తికి సమానం. రైతు పండించే సాధారణ పత్తి 550 కిలోలను మిల్లులో జిన్నింగ్ చేసి గింజలు తొలగిస్తే ఒక బేలు దూది వస్తుంది. గడచిన మూడు నెలలుగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల భారత పత్తి బేలు ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.19,100 నుంచి రూ.15,750కి పడిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటివాటితో పోలిస్తే మన దేశం పత్తిని విదేశాలకు తక్కువ ధరకే అమ్ముతోంది. దీనివల్ల పత్తి ఎగుమతులు ఈ ఏడాది 47 లక్షల బేళ్లకు చేరవచ్చని తాజా అంచనా. ఇది గతేడాదికన్నా 12 శాతం అదనం. ప్రపంచంలోనే అత్యధికంగా పత్తి పండిస్తున్న భారత్- అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తోంది. భారత్‌కు పక్కనే ఉన్న చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాల నుంచి పత్తిని కొంటున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇప్పుడవి భారత పత్తి కోసం చూస్తున్నాయని సీఐఏ వెల్లడించింది.
వచ్చే ఏడాది పెరగనున్న డిమాండ్
వచ్చే మార్కెటింగ్ ఏడాదిలో ప్రపంచ పత్తి వినియోగం 11శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని అమెరికా వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ పెరుగుదలలో 75శాతం వాడకం చైనా, ఇండియాలదేననీ అంచనా వేసింది. ప్రజలు వస్త్రాలు, దూదితో తయారయ్యే ఫర్నీచర్‌పై పెట్టే వ్యయం దేశాల జీడీపీలపై ప్రభావం చూపుతుంది. లాక్‌డౌన్ తరవాత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, చిల్లర వస్త్ర దుకాణాల వ్యాపారం ఎలా ఉంటుందనే దానిపైనే పత్తి వినియోగం వృద్ధి ఆధారపడి ఉంటుంది. 2019-20 చివరలో ప్రారంభమైన లాక్‌డౌన్ అంతిమంగా పత్తి వినియోగ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గడచిన పదేళ్లుగా దేశంలో పత్తి సగటు దిగుబడి పెరగడం లేదని భారత పత్తి విత్తన కంపెనీల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దిగుబడి పెంచడానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్న సంఘం వాదన సహేతుకం. దిగుబడి పెంపు, సాగువ్యయం తగ్గింపుపై సరైన వ్యూహం, శ్రద్ధ లేకుండా సాగు విస్తీర్ణం పెంచుతూ పోతే రైతుల ఆదాయానికి పూచీకత్తు లభించదు.
రెండో పంట అవసరం
తెలుగు రాష్ట్రాల్లో జూన్‌లో పత్తి విత్తిన చేనులో ఒక ఏడాది దాకా మరో పంట వేయడం లేదు. దీనివల్ల ఒక కమతంలో పత్తిపైవచ్చే ఆదాయంతోనే రైతులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీనికి భిన్నంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లో ఏప్రిల్, మే నెలల్లో పత్తి విత్తి దాని సాగును నవంబరుకల్లా ముగించి అదే చేనులో తిరిగి రెండో పంటగా గోధుమ సాగుచేస్తున్నారు. ఇలాగే మధ్యప్రదేశ్‌లో రెండోపంటగా సెనగ వేసి లాభాలార్జిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా రెండోపంట సాగు చేస్తే రైతుకు పత్తిపై నష్టమొచ్చినా రెండోపంట ఆదుకునే అవకాశముంటుంది. పత్తి ఆహార పంట కాదు. దేశంలో పప్పుధాన్యాలు సరిపోక ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
మద్దతు ధర కీలకం
వంటనూనెల తయారీకి నూనెగింజల పంటలు లేక ఏటా రూ.80వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నారు. ఆహార భద్రతనిచ్చే ఇలాంటి పంటలను వదిలేసి పర్యావరణానికి విఘాతం కలిగించే ఆదాయంపై పూచీకత్తులేని పత్తి వంటి వాణిజ్య పంట సాగువల్ల రైతుల కుటుంబాలకు ఆర్థిక, ఆహార, ఆరోగ్య భద్రత దక్కడం అంతసులభం కాదు. ఇప్పటికే అన్ని రకాల మొక్కలను చంపే అత్యంత విషపూరిత రసాయన మందులను తట్టుకుని బతికే జన్యుమార్పిడి(జీఎం) పత్తి విత్తనాలను అక్రమంగా వాడుతున్నారు. వీటిని ప్రైవేటు కంపెనీలు యథేచ్ఛగా అమ్మేస్తున్నాయి. ఈ రసాయనాలు వాడేవారికి క్యాన్సర్ వస్తుందని అమెరికన్ న్యాయస్థానం నిర్ధరించింది. ఇలాంటి మందులు వాడుతూ భారతీయ రైతులు తమ ఆరోగ్యానికి ఎలాంటి రక్షణ లేకుండా పత్తి సాగును పెంచేస్తున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితులనుంచి రైతులను రక్షించడంతోపాటు- తప్పకుండా మద్దతు ధరకు పత్తిని కొనే విధానాలు అమలైతేనే దీని సాగు లాభదాయకం.
-మంగమూరి శ్రీనివాస్