ETV Bharat / opinion

కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు - పంట వ్యర్థాల దహనం

శీతకాలంలో దేశ రాజధాని దిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. ఊపిరి పీల్చుకోవడమే కష్టమై వేలాది ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​లో పంట వ్యర్థాల దహనం నుంచే కాలుష్య కణాలు, పొగలే దిల్లీని కమ్మేస్తుంటాయి. ఈ కారణంతో ఎప్పటిలాగే ఈసారీ హస్తినలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. కాబట్టి కాలుష్యం కమ్మేయకముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. రాష్ట్రాలు, కేంద్రం సమన్వయంతో పనిచేయాలి.

Delhi under siege of pollution
మోగుతున్న ప్రమాద ఘంటికలు- కాలుష్య కాసారంగా దిల్లీ
author img

By

Published : Oct 29, 2020, 8:36 AM IST

దేశ రాజధాని దిల్లీ ఏటా శీతకాలంలో కాలుష్య కాసారంగా మారుతోంది. అక్కడి ప్రజలకు ఊపిరి పీల్చుకోవడమే కష్టతరమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. శీతకాలంలో హస్తిన కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుండటానికి ప్రధాన కారణం- దాని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ల్లో పంట వ్యర్థాల దహనమే. ఆ మంటల నుంచి వెలువడే కాలుష్య కణాలు, పొగ దిల్లీని కమ్మేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాదీ సమస్య పునరావృతమవుతున్నట్లు కనిపిస్తోంది. దిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలు ప్రారంభమవడమే ఇందుకు కారణం. ‘పంజాబ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఆగ్రో-ఎకోసిస్టమ్స్‌ అండ్‌ క్రాప్‌ మోడలింగ్‌’ చెప్పిన లెక్కల ప్రకారం- గడచిన రెండేళ్లతో పోలిస్తే ఆ రాష్ట్రంలో పంట వ్యర్థాలను దహనం చేస్తున్న ఘటనలు పెరిగాయి. నిరుడు సెప్టెంబరు 21నుంచి అక్టోబరు 12 మధ్య- పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం ఘటనలు 755 నమోదయ్యాయి. 2018లో ఇదే కాలవ్యవధిలో 510 ఘటనలు వెలుగుచూశాయి. ఈ ఏడాది మాత్రం ఏకంగా 2,873 ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

పంజాబ్‌, హరియాణాల్లో వరి ప్రధాన పంట. దేశంలో ఏటా ఉత్పత్తయ్యే మొత్తం బియ్యంలో 15శాతం ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాల నుంచే వస్తోంది. పంజాబ్‌లో రమారమి 74 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. హరియాణాలో ఆ వైశాల్యం 32 లక్షల ఎకరాలకు పైమాటే. దరిమిలా పంట కోతల అనంతరం- అంటే సెప్టెంబరు నెలాఖరు వరకు భారీ మొత్తంలో వరి గడ్డి పొలాల్లో పోగుపడుతోంది. అది రైతులకు భారంగా మారుతోంది. దాన్ని తొలగిస్తేగానీ తదుపరి పంటకు భూమి సిద్ధం కాదు. దీంతో పొలాల్లోనే ఆ వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఆ మంటలతో భారీగా పొగతోపాటు హానికర వాయువులైన మిథేన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటివి విడుదలవుతున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనమూ హస్తినలో కాలుష్యం పెరుగుదలకు కారణమవుతోంది. అసలే శీతకాలంలో పొగ మంచు దెబ్బకు ఇబ్బందిపడే దేశ రాజధాని వాసులకు ఈ రసాయనాలు మరింత శరాఘాతంగా మారుతున్నాయి. వ్యర్థాలను వదిలించుకోవడానికి యంత్రాలు అందుబాటులో ఉన్నా, వాటి వినియోగానికయ్యే ఖర్చు అన్నదాతలకు భారంగా మారుతోంది. ఆ యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు సరిపోవు. పూర్తి ఉచితంగా వాటిని అందుబాటులోకి తెస్తేనే యంత్రాల వినియోగం పెరుగుతుంది. రైతుల తరఫున ఆ మాత్రం ఖర్చు భరించడం మేలన్న విషయాన్ని ప్రభుత్వాలు తక్షణం గుర్తించాలి. పంట వ్యర్థాలను భారంగా పరిగణించడం కంటే వాటిని ప్రయోజనకరంగా మార్చుకోవడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. జీవ ఇంధనం వంటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించుకోవాలి. గడ్డిని దహనం చేయకుండా రైతులకు ప్రభుత్వాలు స్వల్ప మొత్తాలను పరిహారంగా అందిస్తున్నాయి. దానికి బదులుగా పంట వ్యర్థాలను కొనుగోలు చేయాలి. అవసరమైతే ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి ప్రయోజనకర ఉత్పత్తులుగా వాటిని మార్చాలి.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కల్లోలం కొనసాగుతోంది. దిల్లీలో కేసుల వరదకు తెరపడట్లేదు. కరోనా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితుల్లో కాలుష్య భూతం కూడా పంజా విసిరితే దిల్లీ వాసుల జీవనం మరింత కష్టతరంగా మారుతుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పెరుగుతాయి. మరోవైపు- కాలుష్య తీవ్రత పెరిగితే ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ ప్రకారం నిర్మాణ పనులపై నిషేధం, పరిశ్రమల్లో ఇంధన వాడకంపై ఆంక్షలు, వాహనాల రాకపోకల రద్దు వంటి కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, కాలుష్య నియంత్రణ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. జనజీవనం వేగం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూరుతుంది. ప్రజలు ఉపాధి కోల్పోతారు. కాబట్టి కాలుష్యం కమ్మేయకముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. రాష్ట్రాలు, కేంద్రం సమన్వయంతో పనిచేయాలి. కాలుష్యం పెరుగుదల, పంట వ్యర్థాల దహనంపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలయాపన చేయకుండా పటిష్ఠ ప్రణాళికలను రూపొందించుకోవాలి. పంట వ్యర్థాల దహనం ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రాంతాలను (హాట్‌స్పాట్లు) గుర్తించాలి. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి.

- మండ నవీన్‌ కుమార్‌ గౌడ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.