ETV Bharat / opinion

లోపాలను ఎత్తిచూపుతూ నిజం చెబితే నేరమా? - criminal cases against media

కరోనాపై యుద్ధంలో ముందు వరుస సైనికులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య పనివారితోపాటు పాత్రికేయులూ నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజల భద్రత, ఆరోగ్య సేవల్లో లొసుగులూ లోపాల్ని నిక్కచ్చిగా ఎత్తిచూపుతూ.. వనరుల సక్రమ వినియోగంలో అధికార శ్రేణులకు దారి దీపాలవుతున్నారు. అలాంటివారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం.

criminal cases against journalists
లోపాల్ని ఎత్తిచూపుతూ నిజం చెబితే నేరమా?
author img

By

Published : Jun 21, 2020, 10:55 AM IST

'సత్యమేవ జయతే' అంటుంది భారతీయ సంస్కృతి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే భారత రాజ్యాంగం అంబారీ కట్టిన భావ ప్రకటన స్వేచ్ఛ దేశ ప్రజాస్వామ్యానికి ఊపిరిగా మారింది. సత్యనిష్ఠతో కష్టనష్టాలకోర్చి నిజాల్ని, పాలక శ్రేణులకు రుచించని అప్రియ సత్యాల్ని తవ్వితీసి భావప్రకటన స్వేచ్ఛకు బాసటగా నిలుస్తున్న పాత్రికేయానికే ఊపిరి సలపనీయని పరిస్థితి ప్రజాతంత్రానికి చేటు చేస్తుంది. కరోనాపై యుద్ధంలో ముందు వరస సైనికులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య పనివారితోపాటు పాత్రికేయులూ అహరహం శ్రమిస్తున్నారు. ప్రజల భద్రత, ఆరోగ్య సేవల్లో లొసుగులూ లోపాల్ని నిక్కచ్చిగా ఎత్తిచూపుతూ, వనరుల సక్రమ వినియోగంలో అధికార శ్రేణులకు దారిదీపాలవుతున్నారు. అలాంటివారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించడం- ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు!

'కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ముందు వరస సైనికులు డాక్టర్లు, నర్సుల నుంచి మనం స్ఫూర్తి పొందాలి' మార్చి చివరివారం నాటి ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ చెప్పిన మాట అది. ఆరోగ్య సిబ్బందిపై హింసకు పాల్పడితే సహించేది లేదన్న కేంద్ర ప్రభుత్వం.. వారి భద్రతను లక్షించి హుటాహుటిన ఆర్డినెన్స్‌ కూడా తెచ్చింది. రోగుల నుంచి ఆ మహమ్మారి తమకు సోకకుండా భద్రత కల్పించే స్వీయ రక్షణ కిట్లు కొరవడ్డాయని దేశవ్యాప్తంగా పలువురు వైద్యులు మొత్తుకొని, న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా, వాతావరణం తేటపడిందని చెప్పే వీలులేదు. దేశ రాజధానిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని చెప్పక తప్పదు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో స్థితిగతుల్ని చిత్రించి దాన్ని బయటపెట్టిన నేరానికి ఓ వైద్యుడిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం నేరాభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ సైతం దాఖలు చేసింది. దాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వేధించడం మానాలంటూ వాస్తవాల్ని అణచివేయలేరని కేజ్రీ సర్కారుకు తలంటింది. ఒక్క దిల్లీ అనే ఏముంది పాత్రికేయులపై తప్పుడు కేసుల రూపేణా వాస్తవాల ఆణచివేత పలుచోట్ల సాగిపోతూనే ఉంది.

పాత్రికేయులపై కేసులు...

కరోనా మహమ్మారి కోర సాచిన వేళ జనజీవనం ఎంత దుర్భరంగా మారిందీ అక్షరీకరిస్తూ సాక్ష్యాధారాలతో కలం వీరులు గళమెత్తేసరికి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు బెంబేలెత్తాయి. పాత్రికేయులపై నేరాభియోగాల కొరడా ఝళిపించాయి. జనంగోడు, లాక్‌డౌన్‌ నిబంధనలు నీరుగారుతున్న తీరు వంటి వాటిని బయటపెట్టిన ‘మహా నేరా’నికి 55 మంది పాత్రికేయులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ దత్తత తీసుకున్న వారణాసి గ్రామంలో లాక్‌డౌన్‌ సమయాన ప్రజలు ఆకలితో బాధ పడ్డారన్న వార్తాంశం యూపీ సర్కారుకు కోపకారణమైంది. దొమారి గ్రామంలో ప్రజలు లాక్‌డౌన్‌లో ఎలా కష్టాల పాలైందీ వారి వారి అనుభవాల్ని క్రోడీకరిస్తూ వ్యాస పరంపర రాసిన స్క్రోల్‌ ఇన్‌ పోర్టల్‌కు చెందిన సుప్రియా శర్మపై పలు సెక్షన్ల కింద కేసులు దాఖలయ్యాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పని చెయ్యకపోవడం, అధికార యంత్రాంగం అసమర్థత, అవినీతి వంటివన్నీ ఆహార కొరత, జనం కష్టాలకు కారణమయ్యాయన్న వార్తా కథనాల్లో నిజానికి తప్పు పట్టాల్సిందేమీ లేదు. క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి లొసుగుల్ని పరిహరించడానికి పాలన యంత్రాంగానికి అవి ఎంతో ఉపయుక్తంగానూ ఉంటాయి. అయినా తాను చెప్పిన దాన్ని తప్పుగా రాసి తనకు మానసిక వేదన కలిగించారన్న మాయాదేవి అనే మహిళ ఫిర్యాదు మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల చట్టంతోపాటు ఐపీసీ 269 సెక్షన్‌ (నిర్లక్ష్యంతో ప్రాణహాని కారక అంటువ్యాధి విస్తరణ), 501 (పరువునష్టం కలిగించే ప్రచురణ) కేసులు బనాయించారు. మార్చి 25న అయోధ్యలో ఒక మతకార్యక్రమంలో పాల్గొనేందుకు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వెళ్లారన్న వార్త ప్రచురించినందుకు 'ది వైర్'’ సంపాదకులు సిద్ధార్థ్‌ వరదరాజన్‌ పైనా యూపీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. కరోనా సంక్షోభంలో అందరినీ కలుపుకొని మహమ్మారిపై పోరు సాగించాల్సి ఉండగా, ఈ తరహా అసహనంతో ప్రభుత్వాలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు?

'పత్రికలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానం చెయ్యగలిగినప్పుడే (ఒక్కోసారి అవి పరిస్థితుల్ని తప్పుగా చిత్రీకరించినప్పటికీ) పత్రికా స్వాతంత్య్రానికి నిజంగా గౌరవం దక్కినట్లు' అని తీర్మానించారు మహాత్మాగాంధీ. పాత్రికేయులపై క్రిమినల్‌ చట్టాల ప్రయోగం ఆందోళనకర హేయమైన ధోరణిగా మారిపోయిందన్న ఎడిటర్స్‌గిల్డ్‌ ఆవేదన ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. కరవు కాటకాలు వంటి విపత్తులు దాపురించినప్పుడు నియంతృత్వ సమాజాల్లోకన్నా ప్రజాస్వామ్య దేశాల్లోనే సత్వరం జనం తెరిపిన పడే అవకాశం ఉంటుందన్న అమర్త్యసేన్‌.. పత్రికాస్వేచ్ఛ ఆయా సమయాల్లో ప్రాణాధారంగా మారుతుందని విశ్లేషించారు. కనిష్ఠ వనరుల్ని గరిష్ఠ ప్రయోజన సాధకంగా మలచుకోవాలనుకొనే ఏ ప్రభుత్వాలైనా- ముఖ్యంగా విపత్తుల వేళ, మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించాలి. నిష్కపటపు వార్తాప్రసారాన్ని గౌరవించాలి. 'దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావప్రకటన స్వేచ్ఛకు గొడుగుపట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి' అని సుప్రీంకోర్టు విస్పష్టంగా ఆదేశించి మూడున్నర దశాబ్దాలు దాటింది. 'ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. హింసను ప్రేరేపించినట్లయితేనే ప్రభుత్వం ఎవరిమీద నైనా రాజద్రోహం కేసు పెట్టగలుగుతుంది' అని అయిదేళ్లనాడు బాంబే హైకోర్టు నిర్దేశించినా.. వార్తల్లోని వాస్తవాలనూ జీర్ణించుకోలేని విధంగా ప్రభుత్వాల్లో పెరిగిన అసహనం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహసిస్తోంది. జనస్వామ్య విలువల్ని కాలరాస్తోంది. ఏమంటారు?

-పర్వతం మూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.