విశ్వవ్యాప్తంగా అయిదు కోట్లకు పైబడిన కేసులు, పది లక్షలకు మించిన మరణాలు... కొవిడ్ మహోద్ధృతిని చాటుతున్నాయి. చలి వాతావరణంలో వైరస్ మరింతగా విజృంభించనుందన్న అంచనాలు అసంఖ్యాక ప్రజానీకాన్ని హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్ళే పిల్లలున్న తల్లిదండ్రులకు- తరగతుల పునరారంభంపై ప్రభుత్వాల యోచనలు, నిపుణుల స్పందనలూ హెచ్చరికలు కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. అనేక జాగ్రత్తలు తీసుకుని దశలవారీగా పాఠశాలల్ని తిరిగి తెరవడానికి సంసిద్ధులమైనట్లు ప్రభుత్వపరంగా భరోసా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభృత రాష్ట్రాల్లో ఒక్కుదుటున కేసుల పెరుగుదల ఆందోళనపరుస్తోంది.
ఈ పరిణామం నేపథ్యంలో, నవంబరు 15 తరవాత 9-12 తరగతుల నిర్వహణ ప్రణాళిక అమలుపై ఒడిశా వెనక్కి తగ్గింది. దీపావళి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుస్తామన్న తమిళనాడు, హరియాణా వంటివీ విస్తృత సంప్రతింపులు, లోతుపాతుల కూలంకష పరిశీలన జరిపాకనే ముందడుగు వేస్తామంటున్నాయి. ఏపీలో 829 మంది ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు గతవారమే నిర్ధారణ అయిన దృష్ట్యా, ఆచితూచి అడుగు కదపాలనే తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 17-22 తేదీల మధ్య ఉపాధ్యాయులందరికీ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించి ఆ మర్నాటినుంచి నిర్ణీత క్రమంలో తరగతుల నిర్వహణకు మహారాష్ట్ర సిద్ధపడుతోంది.
దూకుడు ముప్పే..
మరోవైపు పశ్చిమ్ బంగ సర్కారు- డిసెంబరు మొదటివారం వరకు బడులు మూసే ఉంచుతామని, అప్పటి పరిస్థితుల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటామని కరాఖండీగా చెబుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దాన్నిబట్టి స్పందిస్తామని ప్రైవేటు విద్యాసంస్థలు అంటున్నాయి. ఏది ఏమైనా, ప్రస్తుత విపత్కర స్థితిలో దూకుడు నిర్ణయాలు జాతి భవితకే పెను గండాలవుతాయి!
ఎన్నో అనుభవాలు..
విద్యను చట్టబద్ధ హక్కుగా నిర్ధారించిన దేశం మనది. ‘తగినంత ఆర్థిక స్థోమత లేక సర్కారీ బడుల్లో చదువుకుంటున్న మాకు ఇప్పుడు తరగతులకు హాజరయ్యాక కొవిడ్ వస్తే... ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’ అని వేడుకుంటున్న అభాగ్య విద్యార్థుల్ని పాలకులే అన్నివిధాలా కాచుకోవాలి! అందుకు సిద్ధమైతేనే తరగతుల నిర్వహణ చేపట్టాలని ఇజ్రాయెల్ అనుభవం సైతం చాటుతోంది. అక్కడ పాఠశాలలకు వెళ్ళిన విద్యార్థుల ద్వారా వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకిన ఉదంతాలెన్నో నమోదయ్యాయి. చైనాలో లాక్‌డౌన్ విధించడానికి మునుపు నమోదైన కొవిడ్ కేసుల్లో 79 శాతానికి, సింగపూర్‌లో 48 శాతానికి- కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తులే ముఖ్యకారణమని అధ్యయనాలు ధ్రువీకరించాయి. అదే తరహాలో రోగ లక్షణాలు వ్యక్తంకాని విద్యార్థులతో సన్నిహితంగా మెలగిన పిల్లల ద్వారా ఇంట్లో వారి తోబుట్టువులకు, కుటుంబంలోని వయోవృద్ధులకు కొవిడ్ ఇట్టే సోకే ముప్పు పొంచే ఉంది.
ఐరోపాలో కేసులు మళ్ళీ జోరెత్తడంతో తిరిగి లాక్‌డౌన్ విధింపు వైపు అక్కడి ప్రభుత్వాలు మొగ్గుతున్నా- జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటివి విద్యాసంవత్సరం దెబ్బతినరాదన్న పట్టుదలతో తరగతుల కొనసాగింపునకే గట్టిగా ఓటేస్తున్నాయి. ఆరోగ్య సేవలకు సమధిక నిధులు కేటాయించే ఆయా దేశాల వ్యవస్థాగత సన్నద్ధతకు, దేశీయ స్థితిగతులకు ఎక్కడా పొంతన కుదరదు. ఎందరో వయోజనులే చేతుల పరిశుభ్రత, ముఖానికి మాస్కు, భౌతిక దూరం నిబంధనల్ని గాలికి వదిలేస్తుండగా- పాఠశాలల్లో కొవిడ్ రక్షణలు కట్టుదిట్టమని, విద్యార్థులు అన్నిరకాల జాగ్రత్తల్నీ పాటిస్తూ కొవిడ్‌పై పోరాటంలో నెగ్గుకురాగలరన్న భావనే సరి కాదు. ఆ లెక్క తలకిందులైతే వాటిల్లే కేసుల ప్రజ్వలనాన్ని నిభాయించగల వ్యవస్థాగత సన్నద్ధత లేనప్పుడు, తరగతుల పునరారంభానికి ఇంకొన్నాళ్లు నిరీక్షించడం తప్ప మార్గాంతరం లేదు!
ఇదీ చూడండి: పంజాబ్ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు!