'నల్లజాతి వ్యక్తి పోలీసులకు ఎదురుపడినప్పుడు స్వేచ్ఛనో, ప్రాణాన్నో కోల్పోవడం తప్పనిసరి అవుతోంది'- 2016 జులైలో ట్విటర్ వేదికగా ఓ ఆఫ్రో అమెరికన్ పంచుకొన్న హృదయావేదన అది. ఆనాడు మిన్నెసోటా, లూసియానాల్లో నల్లజాతి యువకులు పోలీసుల చేతిలో బలైపోవడం నేర న్యాయ వ్యవస్థలో ఉన్న విస్తృత జాతి దుర్విచక్షణా విధానాలకు సంకేతమని దేశాధ్యక్షుడిగా ఖండించిన ఒబామా- పోలీసు దురహంకారానికి ప్రాణాలు కోల్పోతున్న వారిలో నల్లవారే అధిక సంఖ్యాకులని గణాంకాలూ ఉటంకించారు. అప్పట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన డొనాల్డ్ ట్రంప్- అదే తరహా నేరం చేసిన గుండె గాయంతో అమెరికా అట్టుడుకుతుంటే, సైన్యాన్ని దింపి ఆందోళనల్ని అణచివేస్తానని నేడు హుంకరిస్తున్నారు. 1968లో మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యానంతరం రేగిన ఘర్షణల స్థాయిలో పదుల సంఖ్యలో నగరాలు పోరాట బాటలో కదం తొక్కుతుండటానికి కారణం అత్యంత సున్నితమైనది. జార్జి ఫ్లాయిడ్ (46) అనే వ్యక్తిది హత్యేనని శవ పరీక్ష నిర్ధారించకముందే- అతగాడి మెడను మోకాలితో పేవ్‌మెంట్‌కు అదిమిపెట్టి అమానుషంగా ఉసురు తీసిన పోలీసు పైశాచికాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది. 2014 జులైలో ఎరిక్ గార్నర్ అనే నల్లజాతీయుణ్ని నిర్బంధించేటప్పుడు న్యూయార్క్ నగర పోలీసులు ఊపిరి ఆడకుండా చేస్తుంటే- శ్వాస ఆడటం లేదు (ఐకాంట్ బ్రీత్) అని మొరపెట్టుకొంటూ ఎరిక్ ప్రాణాలు వదిలాడు. నేడు ఫ్లాయిడ్ చివరి మాటా అదే కావడంతో- 'ఐకాంట్ బ్రీత్' అన్నదే సమర నినాదమై ఒక్క అమెరికాలోనే కాదు- లండన్ బెర్లిన్‌లలోనూ ఆందోళనలు రేగుతున్నాయి. నిరసనకారుల్ని దుండగులుగా తూలనాడి, లూటీలకు తూటాలే సమాధానం చెబుతాయన్న ట్రంప్ జాత్యహంకార ధోరణి ఆందోళనల అగ్గికి ఆజ్యమవుతోంది!
సర్వమానవ సమానత్వం ఎక్కడ?
దాదాపు రెండున్నర శతాబ్దాల నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన మనుషులంతా సమానమేనని ఘనంగా చాటింది. ఎక్కడ అన్యాయం జరిగినా అన్ని చోట్లా న్యాయానికి అది ముప్పేనని ఎలుగెత్తి, సమన్యాయ పోరాటంలో మార్టిన్ లూథర్ కింగ్ ప్రాణాలు వదిలిన 53 ఏళ్ల తరవాతా నల్లజాతీయులపై దుర్విచక్షణ కొత్త కోరలు తొడుక్కొంటూనే ఉంది. శ్వేతజాతి దురహంకార పునాదులపై ఎదిగిన అమెరికన్ సమాజంలో 'మార్పు'ను నినదిస్తూ 2009లో ఒబామా శ్వేతసౌధంలో అడుగిడినప్పుడు నల్లకలువల గుండెలు ఎంత విప్పారినా- సామాజిక పీడన సద్దుమణగనే లేదు. శ్వేత జాతీయులతో పోలిస్తే ఆఫ్రో- అమెరికన్ల వాహనాల్ని పోలీసులు అడ్డగించే అవకాశం 30శాతం, సోదా చెయ్యడం మూడు రెట్లు అధికమన్న ఒబామా వ్యాఖ్యలో ఏమాత్రం పొల్లు లేదు! అమెరికాలో మహమ్మారి కరోనా విలయ నర్తనం లక్షా ఏడు వేల మందిని కబళిస్తే- మృతుల్లో నల్లజాతీయుల సంఖ్య తెల్లవారికన్నా మూడు రెట్లు ఎక్కువ! ఉద్యోగ నియామకాల్లో చివరన, తొలగింపుల్లో ముందు వరసన నల్లజాతీయుల్ని నిలబెట్టిన అమెరికా, జాతి దుర్విచక్షణకు ప్రతీక! అమెరికా జనాభాలో 13.4 శాతంగా నాలుగు కోట్లకుపైగా ఉన్న నల్లజాతీయులు- కరోనా ప్రాణాలు తోడేస్తున్నా, మాంద్యం ఉపాధిని మింగేసినా కిక్కురుమన్నది లేదు. 'ఘర్షణ అంటే, ఎవరికీ పట్టని పీడితుల భాష' అన్న మార్టిన్ లూథర్ కింగ్ మాటే పోరుబాటగా అగ్రరాజ్యం సెగలు పొగలు కక్కడానికి- ట్రంపరితనమే ప్రధాన హేతువైంది. గత ఎన్నికల్లో దిగువ, మధ్యతరగతి శ్వేత జాతీయుల ఓట్లే తనను గట్టెక్కించాయనుకొంటూ, జాతి విద్వేషాల అలలపై పునరధికార తీరం చేరాలన్న ట్రంప్ ధోరణి దిగ్భ్రాంతపరుస్తోంది. తాను అధికారానికి వస్తే తొలి వంద రోజుల్లోనే వ్యవస్థీకృత జాతి విద్వేష సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జో బిడెన్ అంటున్నారు. రేసిజమూ రాజకీయ ముడిసరకు అయితే అమెరికా కోలుకొనేదెప్పుడు?
ఇదీ చూడండి: సామాన్యుని రథం 'సైకిల్' చరిత్ర ఘనం