Commodity Price Rise: ఇప్పటికే కొవిడ్ దెబ్బకు అతలాకుతలమైన సామాన్య, మధ్య తరగతి ప్రజలు- నిత్యావసరాల ధరల సెగకు మరింతగా విలవిల్లాడుతున్నారు. గత పది నెలలుగా టోకు ధరల సూచీ రెండంకెల్లో కొనసాగుతోంది. దాంతో అన్ని నిత్యావసరాల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. అందుబాటు ధరల్లో లభిస్తూ అధికంగా అమ్ముడయ్యే సరకుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు నాలుగు నెలల క్రితమే అన్ని ఉత్పత్తుల ధరల్నీ పెంచాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణ బూచిని చూపి మరోసారి వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న పోరుతో ప్రపంచవ్యాప్తంగా టోకు, రిటైల్ ధరల సూచీలు 30 నుంచి 50శాతం దాకా పెరిగాయి. ముఖ్యంగా ఇంధన ధరలకు రెక్కలు రావడంతో అన్ని నిత్యావసరాల ధరలూ సామాన్యుడిని వణికిస్తున్నాయి. ఎలెక్ట్రానిక్స్ కంపెనీలు సైతం ఎఫ్‌ఎంసీజీ సంస్థల బాటలోనే నడుస్తున్నాయి. సంవత్సర కాలంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు సైతం 20శాతానికి పైగా పెరిగాయి.
కొత్త రికార్డులు
Fuel Prices Hike: ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిత్యం కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. వాస్తవానికి రష్యా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్న చమురు, గ్యాస్ 15శాతం లోపే ఉంటుంది. యుద్ధం, రష్యాపై ఆంక్షలను బూచిగా చూపి ఒపెక్ దేశాలు దాదాపు 30శాతం ధరలు పెంచేసి లాభాలు దండుకుంటున్నాయి. ఇప్పటిదాకా తమవద్ద ఉన్న బఫర్ నిల్వలను వినియోగించుకుంటున్న పలు దేశాలు రాబోయే రోజుల్లో అధిక ధరలు చెల్లించి దిగుమతులు చేసుకోక తప్పదు. భారత్‌కు అవసరమయ్యే చమురులో 80శాతానికి విదేశాలపైనే ఆధారపడుతున్నాం. రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది స్వల్పమే అయినా యుద్ధ సంక్షోభంవల్ల అధిక భారాన్ని మోయాల్సి వస్తోంది. దానికితోడు పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు దాదాపు 60శాతం మేర ఉంటున్నాయి. వాటిని తగ్గించేందుకు పాలకులు సిద్ధంగా లేకపోవడంవల్లా ధరలు భగ్గుమంటున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల తతంగం ముగిసిన తరవాత అంతా అనుకున్నట్టుగానే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్ దేశంలో చాలా చోట్ల రూ. 110 దాటింది. ఇది రూ.125దాకా చేరే అవకాశం ఉందని, డీజిల్ ధర సైతం రానున్న నెల రోజుల్లో రూ.115కు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా నిత్యావసర సరకుల ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితులను తట్టుకోవడానికి దాదాపు అన్ని దేశాలు ఉద్దీపన కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేశాయి. అదే ఇప్పుడు ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాన్ని కట్టడి చేయకపోతే 2023 లేదా 2024లో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోతుందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఆర్థిక, వ్యాపార పరిశోధన కేంద్రం (సీఈబీఆర్) జనవరిలోనే హెచ్చరించింది. దాదాపు నాలుగేళ్లుగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నాలుగు నుంచి ఆరు శాతం మధ్య కట్టడి చేస్తున్న రిజర్వ్ బ్యాంకుకు- ఇప్పుడు ధరలను అదుపులో ఉంచడం కత్తి మీద సాములా మారింది.
నియంత్రణ వ్యవస్థ అవసరం
దేశంలో వంటనూనెలు మినహా ఆహార వస్తువుల ఉత్పత్తి బాగానే ఉంది. రవాణా వ్యయాల పెరుగుదల ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతోంది. భారత్ 70శాతానికి పైగా వంట నూనెలను ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. వాటి ధరలు ఏడాది కాలంలోనే దాదాపు రెట్టింపు అయ్యాయి. దేశీయంగా నిత్యావసరాలకు ఎలాంటి కొరతా లేదని కేంద్రం ప్రకటిస్తున్నా, వాటి ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి. గత ఏడాది కాలంలో పప్పులతో సహా అన్ని నిత్యావసరాల ధరలు 30 నుంచి 40శాతం దాకా పెరిగాయి. వంట గ్యాస్ ధర 2014లో రూ.500 - రూ.550 మధ్య ఉండేది. ప్రస్తుతం దాని ధర వెయ్యి రూపాయలు దాటింది. గ్యాస్ సబ్సిడీలకూ కేంద్రం ఏటా కోత విధించుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు పేదలకు నిత్యావసర సరకులకు తోడు గ్యాస్ సైతం పెను భారంగా మారింది. సరకుల కృత్రిమ కొరత సృష్టించేందుకు వాటిని పరిమితికి మించి నిల్వ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పకడ్బందీ నియంత్రణ వ్యవస్థ దేశంలో లేదు. దానివల్లా ధరలు దిగి రావడంలేదు. నిత్యావసరాల చట్టాన్ని పటిష్ఠం చేయడం, బ్లాక్ మార్కెట్‌ను అదుపు చేయడంతోపాటు పెట్రో ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించినప్పుడే- నిత్యావసరాల ధరలను అదుపులోకి తేవడం సాధ్యమవుతుంది.
- ఎం.ఎస్.వి.త్రిమూర్తులు
ఇదీ చదవండి: బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!