ఎంత శ్రమ చేసినా కడుపునింపే నాలుగు ముద్దల కోసమే అంటారు పెద్దలు. ఆ భాగ్యానికి నోచుకోనివారు భారతదేశంలో కొల్లలు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ కాస్తంత గంజితో కడుపు నింపుకొనేవారు, రెండుపూటలా సరైన తిండి దొరకనివారు ఎందరో ఉన్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడిన తరవాత ఈ సమస్య మరింత పెరిగినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. పథకాలు ఎన్ని అమలవుతున్నా పోషకాహార లోపం(Nutrition India), ఆకలి బాధలు దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్టపడాలంటే సామాజిక వంటశాలలను(Community Kitchen In India) ఏర్పాటు చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
మాయని మచ్చ
ఆకలి భూతంపై పోరాడేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సామాజిక వంటశాలలు(Community Kitchen In India) ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్తలు అరుణ్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన సింగ్‌లు దేశ అత్యున్నత న్యాయస్థానంలో రెండేళ్ల క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. క్షుధార్తులకు ప్రభుత్వాలు ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు పౌష్టికాహారం(Nutrition India) అందించడమే సామాజిక వంటశాలల లక్ష్యం. ఇప్పటికే దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అభాగ్యుల ఆకలి బాధను తీరుస్తున్నాయి. అనేక మత సంస్థలు సైతం ఉచిత భోజనం అందిస్తున్నాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్(Akshaya Patra Foundation) దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఉచితంగా ఆహారం సమకూరుస్తోంది. హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో అయిదు రూపాయలకే భోజనం అందించే కేంద్రాలు కొనసాగుతున్నాయి. వలసకూలీలు, పేదల కోసం తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. అతి తక్కువ ధరకే వీటి ద్వారా అల్పాహారం, భోజనం అందించేవారు. ఏపీలో ప్రభుత్వం మారిన తరవాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అదే పేరుతో వాటిని కొనసాగిస్తోంది.
దేశ చరిత్రలో మాయని మచ్చలా
బ్రెజిల్, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సూప్ కిచెన్లు, మీల్ సెంటర్లు, ఫుడ్ కిచెన్లు, ఫుడ్‌బ్యాంక్‌లు వంటి పేర్లతో సామాజిక వంటశాలలు కనిపిస్తాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో వీటి ఆవశ్యకత బాగా తెలిసివచ్చింది. తొలి దశ లాక్‌డౌన్ మొదలైన వెంటనే కేరళ సర్కారు సామాజిక వంటశాలల ఏర్పాటును ప్రకటించింది. పంచాయతీ స్థాయిలో మహిళా సంఘాలు స్థానిక ప్రభుత్వాల సాయంతో పెద్దమొత్తంలో ఆహారం వండి అవసరమైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. క్వారంటైన్‌లో ఉన్నవారు, వృద్ధులు, వికలాంగులతో పాటు మరెందరికో అవి అన్నపూర్ణగా నిలిచాయి. త్రిపుర, ఒడిశా, ఝార్ఖండ్, దిల్లీ, ఉత్తరాఖండ్‌లలోనూ ఇదే తరహాలో సామాజిక వంటశాలలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో అంతకు ముందు నుంచే ఇవి పనిచేస్తున్నాయి. కరోనా సమయంలో స్వచ్ఛంద సంస్థలు లక్షల మంది వలస కూలీలు, క్షుధార్తుల ఆకలి తీర్చాయి. అయినా మరెందరో నకనకలాడే కడుపులతో, నెత్తురోడుతున్న పాదాలతో సుదీర్ఘ ప్రయాణాలు సాగించారు. వారి విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం దేశ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుంది.
పౌష్టికాహార లోపమే కారణమని..
దేశంలో పిల్లల కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలవుతోంది. సమీకృత శిశు అభివృద్ధి పథకం ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆహార భద్రత కింద కోట్ల మందికి రాయితీ ధరల్లో నిత్యావసరాలు దక్కుతున్నాయి. అయినా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 79 కోట్ల మంది ఆకలిలో అలమటిస్తుంటే, అందులో పావు వంతు భారత్‌లోనే ఉన్నట్లు పలు అధ్యయనాలు కుండ బద్దలుకొట్టాయి. దేశంలో అకాల మృత్యువాత పడుతున్న అయిదేళ్లలోపు చిన్నారుల్లో 68శాతం మరణాలకు పౌష్టికాహార లోపమే కారణమని భారతీయ వైద్య పరిశోధన మండలి అధ్యయనం చాటుతోంది. దేశంలో ప్రతి ముగ్గురు శిశువుల్లో ఒకరికి ఒక్కపూటే ఆహార పానీయాలు అందుతున్నట్లు ఇటీవల యునిసెఫ్ ప్రకటించింది. తాజాగా ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కన్నా భారత్ అధమ స్థానంలో(India Food Security Index) నిలిచింది. వీటన్నింటినీ బట్టి చూస్తే దేశంలో సామాజిక వంటశాలల ఆవశ్యకత తప్పకుండా ఉందని స్పష్టమవుతుంది.
పనులు దొరక్క పస్తులు
ఇటీవలి కాలంలో పట్టణీకరణ జోరందుకుంటోంది. వ్యవసాయంలో సంక్షోభం కారణంగా ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వస్తున్నారు. పనులు దొరకని రోజు వీరికి పస్తులు లేదా అర్ధాకలి తప్పడంలేదు. వీరి పిల్లలపై ఈ ప్రభావం మరింతగా ఉంటోంది. వీరందరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక వంటశాలలను ఏర్పాటు చేసి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలి. కూలీల అడ్డాలు, పారిశ్రామిక వాడలు వంటి చోట్ల వీటిని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా చౌక ధరల సరకులు అందని వారికోసం జాతీయ ఫుడ్ గ్రిడ్‌ను సైతం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు పౌష్టికాహారం అందించే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. జీవించే హక్కులో భాగమైన ఆహారానికి ఏ ఒక్కరూ దూరం కాకుండా కాచుకోవడం పాలకుల విధ్యుక్త ధర్మం!
- దివ్యాన్షశ్రీ
ఇవీ చూడండి: