చిప్‌ల కొరతతో అంతర్జాతీయ వాహన రంగం కుదేలవుతోంది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న కార్ల తయారీ సంస్థలకు ఈ సమస్య పెనుశాపమవుతోంది. దేశీయ పరిశ్రమపైనా దీని దుష్ప్రభావం పడుతోంది. చిప్‌ల కోసం(Chip Shortage) దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావడంతో ఇండియాకు మరింత నష్టం వాటిల్లుతోంది.
కార్లలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అనేక అత్యాధునిక సదుపాయాలకు సెమీకండక్టర్ చిప్‌లే (Semiconductor shortage in India) ఆధారం. బ్లూటూత్ అనుసంధానత నుంచి ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్ నియంత్రణ వ్యవస్థ, ఇతర భద్రతా ప్రమాణాల కోసం చిప్‌సెట్లను విరివిగా వినియోగిస్తున్నారు. అందుకే వాటికి ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాకీ ఉంది. కరోనాతో వీటికి తీవ్రస్థాయి కొరత ఏర్పడింది. కొవిడ్ విజృంభణతో 2020 ప్రథమార్ధంలో దాదాపుగా అన్ని దేశాలూ జనజీవనంపై ఆంక్షలు అమలు చేశాయి. ఫలితంగా కర్మాగారాలు మూతపడి తయారీ నిలిచిపోయింది. అమ్మకాలు కోసుకుపోవడంతో వాహన సంస్థలు- చిప్‌ల కోసం(Chip shortage automotive) ఆర్డర్లు ఇవ్వడం తగ్గించేశాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 'ఇంటి నుంచే పని' సంస్కృతి ఊపందుకుంది.
వాటికి విపరీతంగా గిరాకీ..
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. వాటి తయారీ సంస్థలు చిప్‌లకు భారీస్థాయిలో ఆర్డర్లు ఇచ్చాయి. సమీప భవిష్యత్తులో వాహన రంగం పుంజుకోవడం అసాధ్యమేనని భావించిన చిప్‌ల తయారీ సంస్థలు సైతం డిజిటల్ ఉపకరణాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాయి. ఇక్కడే అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. వివిధ దేశాల్లో లాక్‌డౌన్లను సడలించాక వాహన రంగం అనూహ్యంగా పుంజుకుంది. కొవిడ్ భయంతో(Coronavirus) ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు ఇష్టపడని ప్రజలు- సొంత వాహనాలపై ఆసక్తి చూపారు. ఫలితంగా మధ్యశ్రేణి ఎస్‌యూవీలకు గిరాకీ ఎగబాకింది. వాటిని తయారు చేయాలంటే సెమీకండక్టర్ చిప్‌లు(Semiconductor devices) కావాలి. అవి తగినంతగా అందుబాటులో లేకపోవడంతో వాహన రంగం(Automobile Industry) ఉక్కిరిబిక్కిరవుతోంది.
చిప్‌ల తయారీ సంస్థల సంఖ్య చాలా తక్కువగా ఉండటమూ ప్రస్తుత సమస్యకు మరో కారణం. దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్, అమెరికా సంస్థ ఇంటెల్, తైవాన్‌లోని టీఎస్‌ఎంసీలు ఈ రంగంలో రాజ్యమేలుతున్నాయి. కరోనాతో ఇప్పటికీ కొన్ని సంస్థల్లో వారానికి రెండు, మూడు రోజులకు మించి ఉత్పత్తి సాధ్యపడటం లేదు. దాంతో అంతర్జాతీయ వాహన రంగం ఈ ఏడాదిలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోనుందని అమెరికాకు చెందిన బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. చిప్‌ల లేమితో ప్రపంచవ్యాప్తంగా ఈ సంవ్సతరంలోనే 70 లక్షల కార్ల తయారీ నిలిచిపోనుంది. గిరాకీకి తగినట్లుగా కార్లను ఉత్పత్తి చేయలేమని ఫోర్డ్, టయోటా సంస్థలు ఇప్పటికే చేతులెత్తేశాయి. మరికొన్ని కంపెనీలు అత్యాధునిక కార్లలోని సదుపాయాలకు కోత విధిస్తున్నాయి. తమ సంస్థ కార్లలో ప్రస్తుతానికి నేవిగేషన్ వ్యవస్థ ఉండబోదని నిస్సాన్ ప్రకటించింది.
చిప్‌ల కొరతతో..
కొవిడ్ రెండో దశతో పాటు చిప్‌ల కొరతతో భారత వాహన రంగమూ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ ఏడాది రూ.10 వేల కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు లక్ష కార్ల ఉత్పత్తి ఆగిపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. గుజరాత్‌లోని తమ యూనిట్‌లో ఉత్పత్తి పడిపోవచ్చని దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ప్రకటించింది. స్విఫ్ట్, బెలీనోలపైనా ఈ ప్రభావం పడుతోంది. చిప్‌ల సమస్య లేకపోయుంటే ఏప్రిల్-జులై మధ్య కాలంలో 30వేలకుపైగా కార్లను అధికంగా విక్రయించగలిగి ఉండేవాళ్లమని టాటా మోటార్స్ ఆవేదన వ్యక్తంచేసింది. ఎస్‌యూవీ విభాగంలో దేశంలోనే అధిక అమ్మకాలను నమోదు చేస్తున్న కియా సంస్థ సైతం కార్ల ఉత్పత్తిని తగ్గించేసింది. తమకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి(Covid-19) అదుపులోకి వచ్చి, తయారీ ఊపందుకొంటే- 2022 రెండో త్రైమాసికం నుంచి చిప్‌సెట్‌ల సరఫరా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శామ్‌సంగ్, టీఎస్‌ఎంసీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సెమీకండక్టర్ల పరిశ్రమపై అమెరికా, చైనాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
చిప్‌ల కొరత దృష్ట్యా దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని చర్యలూ తీసుకొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించారు. అవి వాస్తవ రూపం దాలిస్తే- భవిష్యత్తులో దేశీయ వాహన రంగానికి మేలు జరుగుతుంది. సెమీకండక్టర్ల పరిశ్రమల స్థాపనకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రైవేటు సంస్థలు ఇప్పుటికిప్పుడే ముందుకు రాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా ఉంటేనే ఈ రంగంలో ఇండియా సత్ఫలితాలను సాధించగలుగుతుంది!
- విజయ్