China tibet rail poject: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టించే చైనాను ఓ రైల్వే ప్రాజెక్టు ముప్పుతిప్పలు పెడుతోంది. త్రీగోర్జెస్ ఆనకట్ట, బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు, రోదసిలో పరిశోధనలు, సముద్ర జలాలపై పట్టు సహా ఎన్నింటిలోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం చేస్తున్న డ్రాగన్‌కు ఈ ప్రాజెక్టు మాత్రం మునుపెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతోంది.
Chengdu lhasa railway: చెంగ్డు-లాసా మధ్య రైల్వే లైను ఏర్పాటు చేయాలని 13వ పంచవర్ష ప్రణాళికలో డ్రాగన్ దేశం నిర్ణయించింది. సైనిక, వాణిజ్య కేంద్రంగా ఉన్న చెంగ్డు- చైనాలో అత్యంత రద్దీగా ఉండే రాష్ట్రాల్లో ఒకటైన సిచువాన్‌కు రాజధాని నగరం. టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతానికి(టీఏఆర్) లాసా రాజధాని. దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తయిన టిబెటన్ పీఠభూమిలో లాసా ఉంటుంది. టీఏఆర్, షిన్‌జాంగ్ సహా నైరుతి చైనాలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ రైల్వే లైను ప్రణాళికలు ఉపకరిస్తాయని డ్రాగన్ విశ్వసిస్తోంది. తద్వారా నేపాల్‌పైనా తమ వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని ఆశిస్తోంది. సైనిక పరంగా భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపించే ఈ రైల్వే నెట్‌వర్క్‌కు 'ప్రకృతి' పెనుశాపంగా మారింది. సమస్యలను అధిగమించే దారి అంతుచిక్కకపోవడంతో అక్కడి శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని చైనా సంకల్పించినా, డ్రాగన్ ఆకాంక్ష నెరవేరుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: EU against China: డ్రాగన్‌కు దీటుగా ఐరోపా ఎత్తుగడ
సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో..
Chinese electric railway in tibet: చెంగ్డు నుంచి లాసాకు చేరుకోవాలంటే 100ఏళ్ల క్రితం గుర్రాలపై ఏడాది సమయం పట్టేది. ప్రస్తుతం 50గంటల సమయం అవసరమవుతోంది. చైనా తలపెట్టిన రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుంది. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ రైల్వే వ్యవస్థను డ్రాగన్ నిర్మిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. లాసా నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉండే నింగ్‌చి ప్రాంతం వరకు విద్యుత్ బుల్లెట్ రైలు సేవలను డ్రాగన్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభించింది. చెంగ్డు-లాసా రైల్వే ప్రాజెక్టులో ఇది ఒక భాగం. టిబెట్‌లో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన తొలి రైల్వే లైను ఇదే. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైల్వేలైన్ కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. దీనిద్వారా భారత సరిహద్దుకు చైనా తన బలగాలు, యుద్ధ సామగ్రిని తరలించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనడం నిస్సందేహం. చెంగ్డు-లాసా రైల్వే లైను విషయంలో డ్రాగన్ సాంకేతికతకు ప్రకృతి రూపంలో అతిపెద్ద సవాలు ఎదురైంది.
ఇదీ చూడండి: 14వ విడత చర్చలకు భారత్- చైనా సన్నద్ధం
భారీ ఉష్ణోగ్రతల ప్రభావం...
Environment effect on china tibet railway: చెంగ్డులో మొదలయ్యే 1,567 కిలోమీటర్ల ప్రయాణం- యాన్ సిటీ, కాంగ్డింగ్ కౌంటీ, కమ్డో, నింగ్‌చి, షానన్ మీదుగా లాసాకు చేరుతుంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర భౌగోళిక అస్థిరత, సంక్లిష్టమైన నీటి ప్రవాహ వ్యవస్థ, అతి సున్నితమైన పర్యావరణం రైల్వే ప్రాజెక్టుకు ప్రతికూలంగా మారాయి. ఎత్తయిన పర్వతాల మధ్య వంతెనలు, లోతైన సొరంగాలు నిర్మించడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. నింగ్‌చి-లాసా మధ్య 120 వంతెనలు, 70 సొరంగాలు ఉన్నాయి. వాటిలో ఒక సొరంగం పొడవు ఏకంగా 40 కిలోమీటర్లు. మరో సొరంగం భూ ఉపరితలానికి 2,100 మీటర్ల లోతులో ఉంటుంది. సొరంగాల తవ్వకాలపై భూగర్భంలోని భారీ ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంటుందని చైనాలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 'జర్నల్ ఆఫ్ ఇంజినీరింగ్ జియాలజీ' నివేదికను ఆ దేశ మీడియా ఇటీవలే బయటపెట్టింది. దాని ప్రకారం పలు ప్రాంతాల్లో అత్యధికంగా 89డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.
అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాజెక్టుగా..
Journal of engineering china tibet project: ఎన్నో ఏళ్ల క్రితం హిమాలయాలు, టిబెటన్ పీఠభూమి ఏర్పడిన క్రమంలో భూమి లోపల పెద్దమొత్తంలో వేడి పోగుపడినట్లు శాస్త్రవ్తేతలు విశ్వసిస్తున్నారు. అదే ప్రస్తుతం రైల్వే ప్రాజెక్టుపై ప్రభావం చూపుతోంది. సిచియాన్-టిబెట్ (చెంగ్డు-లాసా) రైల్వే లైనును ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాజెక్టుగా జర్నల్ ఆఫ్ ఇంజినీరింగ్ నివేదిక అభివర్ణించింది. ఉపరితలం, భూగర్భంలో రైల్వే లైను ఏర్పాటుకు సంబంధించి ఎన్నో సవాళ్లు ఉన్నాయని, అవి ఆ ప్రాజెక్టు భద్రతా ప్రమాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ఈ పరిస్థితుల్లో చైనా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
- సంజీవ్ కె. బారువా
ఇవీ చూడండి: