ETV Bharat / opinion

డ్రాగన్​ వైపు రష్యా మొగ్గు.. బలపడుతున్న బంధం!

Russia China Relations: వింటర్​ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో రష్యా, చైనా అధినేతలు పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఆత్మీయ పలకరింపులు, ఆంతరంగిక చర్చలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం, మరీ ముఖ్యంగా పుతిన్‌ అధికారం చేపట్టాకే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా వృద్ధిచెందాయి.

china  russia bond
చైనా రష్యా
author img

By

Published : Feb 9, 2022, 10:32 AM IST

Russia China News: చైనా రాజధాని బీజింగ్‌ వేదికగా మొదలైన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడా సంరంభం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ మానవ హక్కుల హననం, వుయ్‌గర్‌ ముస్లిములపై దుర్విచక్షణను నిరసిస్తూ అమెరికా, యూకే, కెనడా, భారత్‌ సహా పలు ప్రజాస్వామ్య దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ ప్రకటించాయి. అదే సమయంలో సౌదీ అరేబియా, పాకిస్థాన్‌, ఈజిప్ట్‌ వంటి రాచరిక, నియంతృత్వ పాలనలో ఉన్న దేశాధినేతలు స్వయంగా హాజరై ఆరంభ వేడుకలను ఆస్వాదించారు. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిన సన్నివేశం మాత్రం రష్యా, చైనా అధినేతలు పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఆత్మీయ పలకరింపులు, ఆంతరంగిక చర్చలు. ఇరువురి భేటీ తరవాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో మరే ఇతర కూటమికి మా ద్వైపాక్షిక సంబంధాలు తీసిపోనివి. తిరుగులేనివి. ఈ బంధంలో దాపరికాల్లేవు. పరిమితుల్లేవు. నవశకానికి నాంది పలుకుతున్నాం' అంటూ చేసిన ప్రతిన బీజింగ్‌, మాస్కోల నడుమ తగ్గిన దూరానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఇరుదేశాల ప్రతినిధులు, వాణిజ్య, వ్యాపారవేత్తల స్థాయిలోనూ పలు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. భౌగోళిక సామీప్యత, కమ్యూనిజం సారూప్యతలు ఉన్నప్పటికీ- చైనా, రష్యాలది ఆర్థిక, వాణిజ్య బంధమే తప్ప, గాఢమైన హార్దిక అనుబంధం కాదన్నది చరిత్ర చెప్పే సత్యం. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం, మరీ ముఖ్యంగా పుతిన్‌ అధికారం చేపట్టాకే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా వృద్ధిచెందాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో తమ సైనిక బలగాలను మోహరించి అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలకు సవాలు విసురుతున్న రష్యా- యుద్ధం అనివార్యమైతే డ్రాగన్‌ సహకారాన్ని ఆశిస్తోంది. పుతిన్‌ పర్యటన అందుకు ఉద్దేశించిన పూర్వరంగంగా కనిపిస్తోంది.

ఉభయ కుశలోపరిగా...

పుతిన్‌ బీజింగ్‌కు బయల్దేరేముందు ఓ పత్రికకు రాసిన వ్యాసంలో 'చైనాతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. అమెరికా ఆధిపత్య ధోరణి, ప్రపంచంపై దాని ప్రాభవాన్ని సవాలుచేస్తాయి. ప్రాంతీయ, ప్రాపంచిక అంశాలపై స్పందించడంలో ఇరుదేశాలు ఏకోన్ముఖంగా సాగుతాయి' అని పేర్కొన్నారు. అన్నట్లుగానే ఈ పర్యటనలో ఇరుదేశాల నడుమ పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాదిలో మూడోవంతు పెరిగి 14,600 కోట్ల డాలర్లకు చేరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2021లో చైనాకు రష్యా 7,930 కోట్ల డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయగా- అందులో చమురు, గ్యాస్‌ వాటా 4,458 కోట్ల డాలర్లు. మొత్తం ఎగుమతుల్లో ఈ రెండు రంగాల వాటా 56శాతం. దీన్ని మరింత పెంచేందుకు రష్యాలో పెద్ద గ్యాస్‌ కంపెనీల్లో ఒకటైన గాజ్‌ప్రోమ్‌ ఈ ఏడాది తన ఉత్పత్తులను 3,800 కోట్ల ఘనపు మీటర్ల నుంచి 4,800 కోట్ల ఘ.మీ.కు పెంచాలని ఒప్పందం చేసుకుంది. చైనా సిరామిక్‌ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు వంటి వినియోగ వస్తువుల ఎగుమతులతో పాటు విరివిగా మానవ వనరులను, పెట్టుబడులను రష్యాకు తరలించనుంది. వాతావరణ మార్పులు, సైన్స్‌, ఆవిష్కరణలు, అంతరిక్షం, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలని ఉమ్మడి ప్రకటనలో ఉటంకించారు. ఇతర దేశాలు వివాదంగా భావిస్తున్న అంశాలను ఇరుదేశాలు తేలిగ్గా కొట్టిపారేశాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి డాన్‌బాస్‌ ప్రాంతంలో లక్ష మంది సైనికులను మోహరించి ఉద్రిక్తతలు రాజేసిన రష్యాకు బీజింగ్‌ అండగా నిలిచింది. పశ్చిమ దేశాలు తీసుకునే ఏ నిర్ణయమైనా రష్యా విదేశాంగ విధానానికి లోబడి ఉండాలని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌కు నాటో కూటమిలో స్థానం కల్పించకుండా పశ్చిమ దేశాలు రక్షణపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తైవాన్‌ ద్వీపాన్ని తమ నుంచి విడదీయలేరని, దాన్ని ఏ రూపంలోనూ స్వతంత్ర నేలగా పరిగణించబోమన్న చైనా వాదనను పుతిన్‌ సమర్థించారు. అంతర్జాతీయ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, వాటిని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దింపాలని యోచిస్తున్న అగ్రరాజ్యం ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎక్కడా వాషింగ్టన్‌ పేరెత్తకుండా 'కొన్ని దేశాలు ఆధిపత్య ధోరణితో విశ్వవ్యాప్తంగా తమ సైనిక కార్యకలాపాలు పెంచుకుంటున్నాయి. మరోపక్క ప్రజాస్వామ్యానికి కొత్త ప్రమాణాలు బోధిస్తున్నాయి. ఇదెక్కడి ద్వంద్వనీతి' అంటూ ప్రశ్నించారు. ఇరువురు నేతల ఉభయతారక ప్రకటనల వెనక అమెరికా ప్రతికూల వైఖరే ప్రతిబింబిస్తోంది.

భారత ప్రయోజనాలకు విఘాతం

భారత ప్రధాని మోదీ 2019లో రష్యా తూర్పు తీర నగరమైన వ్లాదివొస్తోక్‌లో పర్యటించినప్పుడు మిత్రదేశానికి అనూహ్యంగా రూ.7,000 కోట్ల రుణాన్ని ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో పలు ప్రాజెక్టుల్ని ఉమ్మడిగా చేపట్టాలని, అక్కడి నుంచి చెన్నై వరకు సముద్ర నడవాను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. పుతిన్‌ బీజింగ్‌ పర్యటనలో రష్యాలోని తూర్పు ప్రాంతాల్లో చైనా పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇకపై చైనాతో భారత్‌ కంపెనీలు పోటీ పడాల్సి ఉంది. గతంలో బ్రిక్స్‌, ఆర్‌సీఐ (రష్యా, చైనా, ఇండియా) శిఖరాగ్ర సదస్సుల తీర్మానాల మేరకు ప్రాంతీయ సహకారం వేళ్లూనుకునేలా మూడు దేశాలూ పనిచేయాలని పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఉమ్మడి ప్రకటనలో ఓ వాక్యం జోడించారు. ఇది... దిల్లీని విస్మరించలేమన్న భావన కల్పిస్తూ చేసిన కంటితుడుపు ప్రకటనగానే భావించవచ్చు. రక్షణ, సైనిక పరికరాల వ్యాపారంలో ఇండియాకు ప్రధాన భాగస్వామిగా ఉన్న రష్యా, నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడే బీజింగ్‌తోనూ అదే తరహా సంబంధాలు నెరపడం మన ప్రయోజనాలకు విరుద్ధమనే చెప్పాలి. అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా, చైనాలు ఉగ్రవాదంపై పోరులో చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంది. ప్రాంతీయ సమగ్రత, శాంతి స్థాపనకు విఘాతం కలిగించే ఏ పరిణామాన్నైనా సమర్థంగా ఎదుర్కోవడమే ఇండియా ముందున్న కర్తవ్యం.

బీజింగ్‌ అండ అత్యవసరం

రష్యా దురాక్రమణతో 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్‌, నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌)లో చేరి పశ్చిమ దేశాల అండతో నిలబడాలని ఆశిస్తోంది. ఇప్పటికే పూర్వ సోవియట్‌లో భాగమైన లాథ్వియా, లిథువేనియా, ఈస్తోనియాలను చేర్చుకున్న నాటో కూటమి తదుపరి విస్తరణలో ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. నాటో విస్తరణవాదాన్ని క్రెమ్లిన్‌ గట్టిగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్‌, మాస్కో ప్రతినిధుల మధ్య వివిధ స్థాయుల్లో పలుమార్లు చర్చించినా ప్రతిష్టంభన తొలగిపోలేదు సరికదా, నల్లసముద్రం తీరంలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో అమెరికా యుద్ధవిమానాల్లో సైనిక సామగ్రిని తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, రొమేనియాలకు తరలించడం తాజా పరిణామం. ఈ స్థితిలో పశ్చిమ దేశాల కూటమిని సవాలు చేయడానికి చైనా సహకారం అవసరమని క్రెమ్లిన్‌ భావిస్తోంది.

- బోండ్ల అశోక్‌

ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.