బిహార్ రాజకీయ చదరంగంలో ఎన్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. యాదవ్, ముస్లిం వర్గాలు తీసుకునే నిర్ణయం భాజపాకు లాభం చేకూర్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అయితే, బిహార్ కులం కార్డు రాజకీయాలు, మరికొన్ని సమీకరణలు ఎన్డీఏవైపు ఈ రెండు పక్షాలను తీసుకురావటానికి అడ్డుపడుతున్నాయి.
నితీశ్ ఎత్తులు
సీఎం నితీశ్ కుమార్ జపించిన అభివృద్ధి మంత్రం, ముస్లింలు- ఓబీసీల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు బిహార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ వర్గాల్లో కొత్త ఓటర్లను తెచ్చిపెట్టాయి. అయితే, కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ముస్లింలను కాస్త దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా పౌరసత్వ చట్ట సవరణ ఈ వర్గంలో కలవరపాటుకు కారణమైంది.
ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు, వారి మద్దతు తిరిగి కూడగట్టుకునేందుకు జేడీయూ తన మార్కు రాజకీయాలనే నమ్ముకుంది. అందులో భాగంగానే.. ముస్లింలు, యాదవులకు సీట్ల కేటాయింపుల్లో అగ్రపీఠం వేసింది. నితీశ్ సోషల్ ఇంజినీరింగ్ విధానాలతో.. జేడీయూ ఆ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
వ్యూహాత్మక నిర్ణయాలు
కేటాయింపుల్లో భాగంగానే.. 27% ముస్లిం జనాభా ఉన్న దర్భంగా జిల్లాలో ఫరాజ్ ఫాత్మీ వంటి నేతను నిలిపింది. అలాగే 'బరేల్వీ' ప్రముఖుల మద్దతు కూడగట్టుకుంటూ జేడీయూ తరఫున ప్రచారం చేయిస్తోంది. ఇలా ముస్లిం ఓటర్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార పార్టీ.
యాదవులకు 18 స్థానాలు కేటాయించటం ద్వారా.. ఆర్జేడీని దెబ్బకొట్టే ఎత్తులు వేస్తోంది. ముస్లింలకు 11 సీట్లు కేటాయించింది. ఆర్జేడీకి ఆస్తిలా ఉన్న ఈ రెండు వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రత్యర్థిని దెబ్బతీసేందుకే ?
ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ మామ చంద్రికా రాయ్‌ను జేడీయూ బరిలో నిలిపింది. వీరి కుటుంబానికి ఆర్జేడీతో బలమైన బంధం ఉండేది. రాయ్ తండ్రి దరోగా ప్రసాద్ లాలూ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున విజయం సాధించిన జయవర్ధన్ యాదవ్‌కు సైతం జేడీయూ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా నితీశ్ ఆర్జేడీ కీలక నేతలను తమవైపు తిప్పుకుంటున్నారు. అన్ని రకాలుగా లాలూ పార్టీని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.
బిహార్‌లో కీలక సామాజిక వర్గాలైన ముస్లింలు, యాదవులు అసంఘటితంగా ఉన్నారు. వీరిపై నితీశ్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభావవంతంగా ఉన్న ఈ ఓటర్లను ఆకట్టుకుని.. మహాకుటమిలో ముఖ్యంగా ఆర్జేడీకి పడే ఓట్లను తగ్గించాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఈ వర్గాల్లో విభజన ఎత్తులు వేస్తున్నారు.
అగ్రవర్ణాల ప్రాధాన్యం
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ ప్రధానంగా అగ్రవర్ణాల ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. అయితే, భాజపా హిందుత్వ నినాదం కారణంగా కాంగ్రెస్ అగ్రవర్ణాల ఓటర్లు.. కమలంవైపు అడుగులేస్తున్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ అనుసరించిన లౌకిక సిద్ధాంతం స్వాతంత్ర్యం తర్వాత మొదటి నాలుగు దశాబ్దాలు బాగానే పనిచేసింది. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. అప్పటివరకు ఉన్న అగ్రవర్ణాల నేతలను పక్కకు నెట్టి.. 90లలో లాలూ, నితీశ్, రాంవిలాస్ పాసవాన్ వంటి నేతలు వెలుగులోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
కాంగ్రెస్ రాజకీయాలు
కాంగ్రెస్ ఎప్పుడూ ప్రధాన నాయకులను అగ్రవర్ణాల నుంచి ఎన్నుకుని.. నిమ్నవర్గాలు, ఓబీసీలు, ముస్లింలలో పూర్తిస్థాయి మద్దతు కూడగట్టుకోవాలనే ఆలోచనలో ఉండేది. వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కేది కాదు. రాజకీయాల్లో వారి ఎదుగుదలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్య మంత్రులుగా పనిచేసిన దుర్గా ప్రసాద్ రాయ్, కర్పూరీ ఠాకూర్ ఉదంతాలు.. కాంగ్రెస్ అగ్రవర్ణ రాజకీయాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
బిహార్‌లో సామాజిక వర్గాల సమీకరణలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. కులం కార్డు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచుతుంది. ఓటింగ్ తక్కువగా జరిగినప్పుడు ఆగ్రవర్ణాల రాజకీయాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చేవి. పోలింగ్ శాతం పెరగుతున్న కొద్దీ హస్తం పార్టీ ప్రాభవం మసకబారింది.
ప్రజలే విజేతలు
గణాంకాలు చూస్తే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిహార్ ప్రజలెప్పుడూ.. తెలివిగానే వ్యవహరించారు. అధికారం చెపట్టేంత మెజార్టీ ఏ పార్టీకి ఇవ్వటం లేదు. వాస్తవానికి ఇదే సరైంది. ఎందుకంటే పూర్తిస్థాయి మెజారిటీ దేశంలోని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ ప్రజలను దోపిడీ చేసింది.
ఇదీ చూడండి: బిహార్ బరి: పద్మవ్యూహాన్ని తలపిస్తున్న రాజకీయం..!
ఇదీ చూడండి: బిహార్ బరి: 'రాబిన్ హుడ్' ప్రభావమెంత ?