భవిష్యత్తులో కొవిడ్ తరహా మహమ్మారులు(Covid Pandemic) విరుచుకుపడే ప్రమాదాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయగల అంతర్జాతీయ హెచ్చరిక కేంద్రాన్ని ఇటీవల బెర్లిన్‌లో(Berlin News) నెలకొల్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జర్మనీ ప్రభుత్వం కలిసి ఏర్పరచిన ఈ కేంద్రం- ప్రపంచమంతటా వెలువడే అపార సమాచార రాశిని ఏఐతో(Artificial Intelligence) విశ్లేషించి నివారణ ప్రణాళికను సూచిస్తుంది. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, అంతర్జాతీయ ప్రయాణాల విస్తరణ, జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వైరస్‌ల వల్ల మరిన్ని మహమ్మారులు మానవాళిపై దాడి చేసే ప్రమాదం ఖాయంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అడవి, పెంపుడు జంతువుల ఆరోగ్యస్థితిలో వచ్చే మార్పులు, మానవుల్లో ఉన్నట్లుండి పొడచూపే అసాధారణ వ్యాధులు, మానవ ప్రవర్తనలో మార్పులు, జనం వలసలు, వాతావరణ వైపరీత్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సేకరించి ఏఐ ఆధారంగా విశ్లేషించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది. దీనికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని ఈ ఏడాది మేలోనే నిర్ణయించింది. జర్మనీ పూర్తి సహకారంతో సెప్టెంబర్ ఒకటిన ఈ సంస్థ బెర్లిన్ నగరంలో ప్రారంభమైంది. దీని నిర్మాణ, నిర్వహణలకు జర్మన్ ప్రభుత్వం మూడు కోట్ల యూరోల (సుమారు రూ.258 కోట్ల) నిధులు సమకూర్చింది. ఆ దేశంలోని విఖ్యాత సంస్థలైన రాబర్ట్ కాచ్ ఇన్‌స్టిట్యూట్, చారిటీ హాస్పిటల్, హాసో ప్లాట్‌నర్ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకొంటున్నాయి.
'కృత్రిమ మేధ' సాయంతో..
మహమ్మారులు, అంటువ్యాధులను ముందే పసిగట్టి నివారించడంలో మన వైఫల్యాన్ని కొవిడ్ పట్టిచూపిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనొమ్ గబ్రెయేసస్(Tedros Adhanom) మే నెలలో వ్యాఖ్యానించారు. 'వైరస్‌లు మహా వేగంగా వ్యాపించే మాట నిజం. సమాచారం అంతకన్నా వేగంగా ప్రసారమవుతుంది' అని గుర్తుచేస్తూ, భావి వైరస్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ మహత్తర సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. నిజానికి కొవిడ్‌పై పోరాటానికి ఇప్పటికే ఏఐ తోడ్పడుతోంది. ఏఐ చలవతోనే కరోనా వైరస్ జన్యుక్రమాన్ని వేగంగా కనిపెట్టి టీకాలను ఉత్పత్తి చేయగలిగారు. వైరస్‌లో వస్తున్న రూపాంతరాలను కనిపెట్టి వ్యాక్సిన్లలో తగు మార్పులు చేయడానికీ అది తోడ్పడుతుంది. అందుబాటులో ఉన్న సమాచారంతో ఏం చేయాలి, దాన్ని ఎలా విశ్లేషించాలి వంటి వాటి గురించి తెలిపేదే ఏఐ. ఫలానా పని చేయవలసిందిగా కంప్యూటర్‌ను అది పురమాయిస్తుంది. అందుకోసం ఏఐ జారీ చేసే ఆదేశాలు లేదా సూచనలను అల్గొరిథమ్స్ అంటారు. మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) అల్గొరిథమ్స్ కూడా ఏఐ కిందకే వస్తాయి. వీటి సాయంతో ఏఐ తాను చూసిన, విశ్లేషించిన సమాచారం నుంచి పాఠాలను నేర్చుకొని, కొత్త పనులు చేసే సామర్థ్యాన్ని సంతరించుకొంటుంది.
ఏఐ, ఎంఎల్‌లను కంప్యూటర్ ప్రోగ్రామ్‌లుగా నిర్వచించవచ్చు. తరవాతి కార్యాచరణకు సలహాలు సూచనలు ఇచ్చే సత్తా వీటికి ఉంది. వేలు, లక్షల ముఖాలను సరిపోల్చి మనం వెతుకుతున్న వ్యక్తి ఆనవాళ్లను పసిగట్టే ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్‌వేర్ కూడా ఏఐలో అంతర్భాగమే. కొవిడ్ సమయంలో ఆస్పత్రులకు వస్తున్న వందలు, వేల రోగుల్లో ఎవరు నిజంగా కొవిడ్ బారిన పడ్డారో తెలుసుకోవాలంటే ఛాతీ ఎక్స్‌రేలను పరిశీలించాలి. కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఈ పనిని రేడియాలజిస్టులకన్నా ఏఐ వేగంగా చేయగలుగుతుంది. టెలీమెడిసిన్‌లోనూ ఏఐ కీలకం. కొవిడ్ విరుచుకుపడిన కొత్తల్లో దక్షిణ కొరియాలో సీజీన్ కంపెనీ ఏఐ సాయంతో వేగంగా కరోనా పరీక్షలు చేసే పద్ధతిని కనిపెట్టింది. గతేడాది ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి మధ్యకల్లా దక్షిణ కొరియా 2.30 లక్షల కరోనా పరీక్షలు పూర్తిచేయగలిగింది.
'బీటా' కట్టడికి దోహదం
దక్షిణాఫ్రికాలో వైరస్ రూపాంతరాల వల్ల కొవిడ్ మూడో దశ ఎప్పుడు వస్తుందో ముందే కనిపెట్టడానికి ఏఐ అల్గొరిథమ్ తోడ్పడింది. భవిష్యత్తులో వచ్చే కేసుల సంఖ్యను అంచనా వేయడానికీ ఉపకరించింది. దేశంలో మునుపటి కొవిడ్ కేసులను, జనం ఒక చోట నుంచి మరో చోటుకు చేసే ప్రయాణాలనూ పరిగణనలోకి తీసుకొని తన అంచనా వెలువరించింది. బీటా రకం వ్యాప్తిని నిలువరించడానికి ఏఐ సాయపడిందని ఆఫ్రికా-కెనడా కృత్రిమ మేధ కన్సార్టియం ప్రతినిధులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాతోపాటు మరో ఎనిమిది ఆఫ్రికా దేశాలకూ ఏఐ విధానాన్ని అందించామని కన్సార్టియం తెలిపింది. ఆసుపత్రుల్లో చేరినవారి వయసు, వారికున్న ఇతర వ్యాధులు, నివాస ప్రాంతం, ప్రయాణ సమాచారాన్ని ఏఐకి అందిస్తే- అది కొవిడ్ వ్యాప్తి ఎక్కడ, ఎప్పుడు, ఏ మేరకు ఉంటుందో అంచనా వేయగలుగుతుంది. ఏఐ విశ్లేషణ ఆధారంగా విధాన కర్తలు వేగంగా తగిన చర్యలు తీసుకోగలుగుతారు. బెర్లిన్‌లో ఏర్పాటైన కృత్రిమ మేధ కేంద్రం భవిష్యత్తులో యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయనుంది.
- ప్రసాద్
ఇదీ చదవండి: