ETV Bharat / opinion

ఇంకెన్నాళ్లీ రాష్ట్రాల సరిహద్దు వివాదాలు?

దేశంలో అంతర్భాగమైన అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. సమస్య మూలాలను పరిష్కరిస్తేనే ఈ తరహా వివాదాలకు అడ్డుకట్ట పడుతుందన్నది నిపుణుల మాట. ఈ నేపథ్యంలో రాజకీయాలకు తావులేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశం అశాంతితో రగిలిపోయే ప్రమాదం ఉంది.

border dispute
రాష్ట్రాల సరిహద్దు వివాదాలు
author img

By

Published : Aug 3, 2021, 5:10 AM IST

అసోం-మిజోరం రాష్ట్రాలమధ్య సరిహద్దుల వివాదం చినికి చినికి గాలివాన అయిన చందంగా, ఏడుగురు పోలీసుల మృతికి దారితీయడం దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతపరచింది. ఇరు రాష్ట్రప్రభుత్వాలూ అధికార శ్రేణులపై పరస్పరం కేసులు బనాయించుకున్న క్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేరు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లోకి ఎక్కింది. అంతగా ప్రజ్వరిల్లిన విభేదాల ఉపశమనానికి కేంద్ర యత్నం కొంతవరకు ఫలించినట్లే కనిపిస్తోంది. చర్చల ద్వారానే సరిహద్దు వివాదాలు ఒక కొలిక్కి వస్తాయని హిమంత శర్మ తాజాగా 'ట్వీట్‌' చేయగా- కేంద్రం జోక్యంతోనే సామరస్యపూర్వక పరిష్కారం లభించగలదని మిజోరం ముఖ్యమంత్రి జొరాం థాంగా విశ్వాసం వ్యక్తీకరిస్తున్నారు. గత అయిదేళ్లలో అక్కడ రెండువందల ఘర్షణలు జరిగి 40 కేసులు నమోదైనా ఉద్రిక్తతల ఉపశమనానికి గట్టి యత్నమన్నది కొరవడటంవల్లే కక్షలూ కార్పణ్యాలు ఇంతగా ప్రబలాయన్నది సుస్పష్టం.

రోగమొకటి.. మందొకటి..

వాస్తవానికి సమస్య మూలాలు ఆంగ్లేయుల జమానాలో ఉన్నప్పటికీ, నాలుగైదేళ్లుగానే విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. వివాదాస్పద అటవీ ప్రాంతంలోకి మిజోవాసుల్ని రానివ్వడం లేదన్నది జొరాం థాంగా ప్రధాన ఆరోపణ. రిజర్వ్‌ అటవీ భూముల్ని మిజోవాసులు ఆక్రమించారన్నది అసోం ప్రతివాదన. రెండు రాష్ట్రాలకూ ఆమోదయోగ్య పరిష్కారం కోసం పక్షం రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్న హిమంత శర్మకు గుర్తుందో లేదో- అస్సాముతో నాగాలాండ్‌, అరుణాచల్‌ సరిహద్దు వివాదాలు ఇప్పటికే 'సుప్రీం' తీర్పు కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నాయి. లోగడ ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు వివాదం తలెత్తినప్పుడు 21 గ్రామాలపై హక్కుల్ని తనకు దఖలుపరచాలన్న ఒడిశా అభ్యర్థనపై పదిహేనేళ్ల క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దాని ప్రకారం, రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు 'సుప్రీం' పరిధిలోకి రావు. అందువల్ల అస్సాం-మిజోరం రాష్ట్రాలమధ్య ఘర్షణలకు కారణమైన అంశాలను మరికొన్నేళ్లపాటు మురగబెట్టకుండా సత్వర పరిష్కార సాధనపై కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టడం సముచితం, విజ్ఞతాయుతం.

గుంటనక్కలా చైనా..

అసోం, మిజోరం ఏమైనా శత్రుదేశాలా? అవి ఒకే దేశంలోని ఇరుగు పొరుగు రాష్ట్రాలు. వాటి మధ్య ఏ కారణంగానైనా కత్తులు దూసుకునేంత వైర భావనలకు తావే ఉండకూడదు. ఎందుకంటే, సరైన అవకాశం కోసం చైనా అక్కడే గుంటనక్కలా నిరీక్షిస్తోంది! అసోం-మిజోరం తరహాలో మరికొన్ని కుంపట్లూ దేశంలో రాజుకుంటున్నాయని కేంద్రం ఇటీవలే పార్లమెంటులో ప్రకటించింది. హరియాణా-హిమాచల్‌, లద్దాఖ్‌-హిమాచల్‌, మహారాష్ట్ర-కర్ణాటక, అసోం-అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం-నాగాలాండ్‌, అసోం-మేఘాలయల మధ్యా అపరిష్కృత సరిహద్దు వివాదాలు నెలకొన్నట్లు లెక్కచెప్పింది. అది ప్రస్తావించనివీ మరికొన్ని ఉన్నాయి. 1936లో బంగాల్‌-బిహార్‌-ఒరిస్సా ప్రావిన్స్‌ నుంచి రూపుదాల్చిన నేటి ఒడిశాకు నాలుగు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లతో పొలిమేర పేచీలు అంతులేని కథగా కొనసాగుతున్నాయి. 1956 నాటి పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొన్ని ప్రాంతాల్ని కలుపుతూ రాష్ట్రాలను నెలకొల్పగా- ఆంగ్లేయుల ఏలుబడిలోని ప్రావిన్సుల తాలూకు ప్రాంతాలు కొత్త రాష్ట్రాల పరిధిలోకి చేరడం ఎన్నో వివాదాలకు అంటుకట్టింది.

వివాదాస్పద ప్రాంతాలపై భిన్నవాదాలకు సంకుచిత రాజకీయాలు జతపడి ప్రజానీకంలో భావోద్వేగాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆయా అంశాల్ని ఏళ్ల తరబడి పేరబెట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. భిన్న రాష్ట్రాల మధ్య, వేర్వేరు ప్రాంతీయుల నడుమ స్నేహ బాంధవ్యాలు పెంపొందాలే తప్ప- వైషమ్యాలు భగ్గుమనకూడదు. సమస్యాత్మక ప్రాంతాలపై అనుసరణీయ మార్గమేమిటో సంబంధిత రాష్ట్రాలకు చెందిన పెద్దలు తర్కించి శాస్త్రీయ పద్ధతినొకదాన్ని ప్రామాణీకరించి దేశమంతటా అనుసరింపజేయడమే సర్వోత్తమ పరిష్కారం. అందుకు ఏ కారణంగానైనా రాష్ట్రాలు ముందుకు రానట్లయితే, కేంద్రమే చొరవ కనబరచాలి. దేశంలో ఎక్కడా ఘర్షణలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. అంతర్జాతీయంగా భారత్‌ నవ్వులపాలు కాకుండా కాచుకోవాలి!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.