అంతర్జాతీయ స్థాయిలో ఎంతగా విమర్శల పాలవుతున్నా- చైనా తన దుందుడుకు వైఖరిని మార్చుకోవడం లేదు. అహంకార ధోరణిని వీడటం లేదు. తాజాగా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంలోనూ డ్రాగన్ జోక్యం చేసుకుంది. క్వాడ్‌లో చేరికపై ఆ దేశాన్ని హెచ్చరించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకంగా మారుతున్న ఆ కూటమిపై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో- బంగ్లాదేశ్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు స్వేచ్ఛగా జరిగేలా చూడటం ఈ కూటమి ప్రధాన లక్ష్యం.
క్వాడ్ చట్రంలో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవుల వంటి దక్షిణాసియా దేశాల్లో భారత్, జపాన్ సంయుక్తంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. ప్రధానంగా బంగ్లాదేశ్, మాల్దీవుల్లో- రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి ప్రాజెక్టులను జోరుగా కొనసాగిస్తున్నాయి. కొవిడ్ విజృంభణపై చర్చించేందుకు ఈ ఏడాది క్వాడ్ నిర్వహించిన సమావేశానికి దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం సైతం హాజరయ్యాయి. దీంతో కూటమి విస్తరణకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. క్వాడ్ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతుండటం చైనాకు ఆందోళన కలిగించింది. కూటమిలో చేరాల్సిందిగా బంగ్లాదేశ్‌పై అమెరికా, భారత్ ఒత్తిడి తెస్తాయేమోనని భయపడింది. ఒకవేళ వాటితో బంగ్లా చేతులు కలిపితే- దక్షిణాసియా భౌగోళిక, రాజకీయ వ్యవహారాల్లో చైనాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. ఆ పరిణామాన్ని అడ్డుకునేందుకు వెంటనే రంగంలోకి దిగింది. క్వాడ్‌లో చేరితే తమతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ బంగ్లాదేశ్‌ను చైనా రాయబారి లీ జిమింగ్ నేరుగా హెచ్చరించారు. నాలుగు దేశాలతో కూడిన చిన్న కూటమిలో చేరడంవల్ల ఒరిగేదేమీ ఉండబోదని సూచించారు.
చైనా రాయబారి చేసిన ఈ హెచ్చరిక అంతర్జాతీయ దౌత్యవర్గాల్లో ప్రకంపనలు రేపింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో డ్రాగన్ జోక్యం చేసుకుందంటూ విమర్శలు వెల్లువెెత్తాయి. డ్రాగన్ హెచ్చరికపై బంగ్లా ఆచితూచి స్పందించింది. తమది స్వతంత్ర, సార్వభౌమ దేశమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె.అబ్దుల్ మొమెన్ పేర్కొన్నారు. తమకంటూ సొంత విదేశాంగ విధానం ఉందని, దాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని తేల్చిచెప్పారు. అయితే అభిప్రాయాలను వెలువరించే స్వేచ్ఛ ఏ దేశానికైనా ఉంటుందని స్పష్టం చేశారు.
రెండూ కీలకమే..
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, చైనాలతో బంగ్లాదేశ్ ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తుందనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్, చైనా రెండూ ఆ దేశానికి కీలకమైనవేే. దశాబ్దాలుగా మన దేశంతో బంగ్లాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసలు స్వతంత్ర దేశంగా దాని అవతరణే భారత్ వల్ల సాధ్యమైంది. సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారీ ఆ దేశానికి ఇండియా అండగా నిలుస్తూ వస్తోంది. కొవిడ్ విజృంభణ వేళా టీకాల సరఫరాతో స్నేహహస్తం అందించింది. 2010-2017 మధ్య బంగ్లాకు భారత్ మూడు లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) సదుపాయాలను కల్పించింది. ఇప్పటిదాకా భారత్ నుంచి అత్యధిక మొత్తంలో ఎల్‌ఓసీ నిధులను అందుకున్న దేశం బంగ్లాయే.
మరోవైపు- చైనానూ విస్మరించే స్థితిలో బంగ్లాదేశ్ లేదు. ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ముఖ్యమైన దేశాల్లో ఒకటిగా బంగ్లాను డ్రాగన్ చూస్తోంది. కొన్నేళ్లుగా ఆ దేశంలో భారీగా పెట్టుబడులు గుమ్మరిస్తోంది. భారత్‌తో పోలిస్తే చైనాయే బంగ్లాకు పెద్ద వాణిజ్య భాగస్వామి. బంగ్లాదేశ్ ఉత్పత్తుల్లో 97శాతానికి సుంకాల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు చైనా గత ఏడాది ప్రకటించింది. ఈ క్రమంలో చైనా తాజా హెచ్చరికను బంగ్లాదేశ్ అంత తేలిగ్గా తీసుకునే అవకాశాలు లేనేలేవు.
'తొందరపాటు వద్దు'
భావసారూప్య దేశాలు కలిసి వస్తే కూటమిని విస్తరించేందుకు సిద్ధమని క్వాడ్ దేశాలు వివిధ సందర్భాల్లో ప్రకటించాయి. కానీ, నిర్దిష్ట ప్రణాళికలను ఇంకా రూపొందించలేదు. బంగ్లాకు ఆహ్వానమూ పంపలేదు. అయినప్పటికీ తొందరపాటుతో ఆ దేశాన్ని చైనా హెచ్చరించింది. అదే తప్పును భారత్ చేయకూడదు. క్వాడ్‌లో చేరాలంటూ బంగ్లాపై ఒత్తిడి తేకూడదు. ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితిని తెచ్చుకోకూడదు. దక్షిణాసియాలో సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. ఇండియాకు క్వాడ్ ఎంత ముఖ్యమో, దక్షిణాసియాలో బంగ్లా కూడా అంతే ప్రధానం. గతంలో ఉన్న ఖలీదా ప్రభుత్వంతో పోలిస్తే- ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం భారత్‌తో బంధానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. కాబట్టి హసీనా ప్రభుత్వానికి ఇండియా తన మద్దతును కొనసాగించాలి. అమెరికా క్వాడ్‌ను కేవలం చైనాకు ముకుతాడు వేసే ఆయుధంగానే పరిగణిస్తోందనే సంగతిని విస్మరించకూడదు!
- మండ నవీన్ కుమార్ గౌడ్
ఇదీ చదవండి : వ్యాక్సినేషన్లో చైనా జోరు.. 5 రోజుల్లో 10 కోట్లు..