ETV Bharat / opinion

సవాళ్లకు దీటుగా భారత్‌ వ్యూహాత్మక పొత్తులు - India agreements with US

వ్యూహాత్మక భాగస్వామ్యాలతో కొత్త పొత్తులు పెట్టుకుంటూ పొరుగు దేశాలతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది భారత్​. చైనా పద్ధతినే అందిపుచ్చుకున్న భారత్​.. కొత్త సమీకరణలకు తెరలేపుతుండటం విశేషం. అమెరికాతో రక్షణ ఒప్పందం ద్వారా 'డ్రాగన్‌' దేశానికి బలమైన సంకేతాలు పంపేందుకే భారత్‌ నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

A special story on India strategies against China with Qude
సవాళ్లకు దీటుగా భారత్‌ వ్యూహాత్మక పొత్తులు
author img

By

Published : Oct 24, 2020, 8:25 AM IST

అంతర్జాతీయ వేదికపై చైనా విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ సమీకరణలు ఒక్కపెట్టున మారిపోయాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో కొత్త పొత్తుల ఆవిర్భావానికి ఈ వాతావరణం అవకాశం కల్పిస్తోంది. అవతలి పక్షాన్ని ఒంటరి చేసి దూకుడుగా ముందుకు వెళ్ళడం సాధారణంగా చైనా అనుసరించే శైలి. ఇప్పుడు అదే పద్ధతిని అందిపుచ్చుకుని భారత్‌ కొత్త సమీకరణలకు తెరలేపుతుండటం విశేషం. పాకిస్థాన్‌ విషయం పక్కనపెడితే- నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో భారత్‌కు దూరం పెంచేందుకు చైనా సకల విధ ప్రయత్నాలు చేసి కొంతమేర కృతకృత్యమైంది.

బీజింగ్‌ దురాక్రమణ తత్వం తెలిసిన భారత్‌ ఆ దేశాన్ని నిలువరించే బలమైన శక్తులతో బంధాలను పటిష్ఠపరచుకుంటోంది. చుషూల్‌-మోల్దో పోస్టులో భారత్‌-చైనా కోర్‌ కమాండర్ల స్థాయిలో ఎనిమిదో విడత సమావేశం త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నారు. అమెరికాతో రక్షణ ఒప్పందం ద్వారా 'డ్రాగన్‌' దేశానికి బలమైన సంకేతాలు పంపేందుకే భారత్‌ నిశ్చయించుకున్నట్లు ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పరస్పర సహకారంలో మరో మైలురాయి.

అప్పుడే పునాదులు పడ్డాయి!

భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ఈ నెల 26-27 తేదీల్లో దిల్లీలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు- భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌లతో భేటీ కానున్నారు. మైక్‌ పాంపియో భారత మంత్రులతో భేటీ కావడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజాగా 2+2 చర్చల్లో అత్యంత కీలకమైన బేసిక్‌ ఎక్స్చేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికాతో రక్షణ సంబంధాలు పటిష్ఠపరచే ప్రాథమిక ఒప్పందాల్లో ఇదీ ఒకటి! వాజ్‌పేయీ హయాములో ఇరుదేశాల మధ్య 2002లో సైనిక సమాచార భద్రత ఒప్పందం(జీఎస్‌వోఎంఐఏ) కుదరడంతో భారత్‌, అమెరికాల బలమైన సైనిక బంధానికి పునాదులు పడ్డాయి. మోదీ ప్రభుత్వం 2016లో లెమోవా (ది లాజిస్టిక్స్‌ ఎక్స్చేంజీ మెమొరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌), 2018లో కోమ్‌కాసా (కమ్యూనికేషన్‌, కాంపాటబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌) ఒప్పందాలు అమెరికాతో కుదుర్చుకుంది. వీటితో ఇరుపక్షాల మధ్య సైనిక పరికరాల సమాచారం, నౌకాదళ స్థావరాల వినియోగం, పటిష్ఠమైన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

తాజాగా కుదుర్చుకునే 'బెకా ఒప్పందం'తో ఉపగ్రహాల నుంచి సేకరించిన కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని ఇరుపక్షాలు పంచుకొనే అవకాశం లభించింది. భారత్‌ కంటే ఎన్నో రెట్లు అధికంగా అమెరికా వద్ద దాదాపు 1,425 ఉపగ్రహాలు ఉన్నాయి! శత్రువుల కదలికలకు సంబంధించిన కీలకమైన భౌగోళిక సమాచారాన్ని వీటి ద్వారా భారత్‌ సేకరించవచ్చు. ఫలితంగా అత్యుత్తమ నాణ్యత (మిలిటరీ రిజల్యూషన్‌)గల చిత్రాలు భారత్‌ చేతికి వస్తాయి. సరిహద్దుల్లో కీలక కార్యాచరణకు ఉద్దేశించిన ఈ సమాచారం భారత్‌కు అదనపు శక్తినిస్తుంది. ముఖ్యమైన సైనిక 'ఆపరేషన్ల'కు ప్రాతిపదిక అవుతుంది. నిర్దిష్ట లక్ష్యాలకు క్షిపణులను గురిపెట్టడంలో, ఆయుధాలను కచ్చితంగా ప్రయోగించడంలో భారత్‌ పాటవం ఇనుమడిస్తుంది. భవిష్యత్తు యుద్ధతంత్రంలో కీలక సాధనాలైన 'డ్రోన్ల'ను నిర్దుష్ట దిశలో నడిపేందుకూ ఈ సమాచారం అక్కరకొస్తుంది.

సైబర్‌దాడుల్లో పండిపోయిన అమెరికా ఈ రూపంలో- అత్యాధునిక మాల్‌వేర్లు, బాట్‌లను తన డేటా, పరికరాలతోపాటు భారత సమాచార నిధిలోకి జొప్పించే ప్రమాదమూ కొట్టిపారేయలేనిది. ఇది నాణేనికి రెండోవైపు! భారత్‌ దళాల కదలికలు, కీలక సమయాల్లో ఆపరేషన్ల సమాచారాన్నీ అమెరికా గుప్పిట పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా సమస్త సమాచారాన్నీ ఆ దేశానికి ధారాదత్తం చేయకుండా- భారత్‌ సైతం పకడ్బందీ రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అమెరికన్‌ ఆధునిక వ్యవస్థలతో దేశీయ 'వ్యూహాత్మక ఆయుధాగారా'న్ని పరిపుష్టం చేసుకొనే సందర్భంలో- అమెరికా అందజేస్తున్న ఆయుధ వ్యవస్థలను క్షుణ్నంగా తనిఖీ చేసుకొనే యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

అమెరికా వ్యూహాత్మక 'నెట్‌వర్క్‌'కు వినియోగించే 'లింక్‌-16' 1960ల నాటిది. చిన్నమార్పులతో దీన్నే ఇప్పటికీ వాడుతోంది. ప్రస్తుత ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్రంలో ఇది బలహీనమైనదన్న వాదనలూ ఉన్నాయి. కాబట్టి, ఈ విషయంలో భారత్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం అవసరం. గతంలో అమెరికా ఎల్‌ఎస్‌ఏ ఒప్పందాన్ని భారత్‌ అవసరాల రీత్యా మార్పులు చేసి 'లెమోవా'గా, అదేవిధంగా 'సిస్మోవా' ఒప్పంద అసలు రూపానికి మార్పుచేర్పులతో ‘కోమ్‌కాసా’గా తీర్చిదిద్దారు. అదే పంథాలో 'బెకా' ఒప్పందంలోనూ మన ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన మార్పులను సూచించేందుకు భారత్‌ వెనకాడరాదు.

'క్వాడ్‌'కు కోరలు

ఈ నెలలోనే క్వాడ్‌ దేశాల (భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. కొవిడ్‌ సమయంలో వీరు వ్యక్తిగతంగా కలుసుకోవడం సాధారణ విషయం కాదు. అంతకుముందే మైక్‌ పాంపియో ద.కొరియా, మంగోలియాలో పర్యటను రద్దు చేసుకొని- క్వాడ్‌ భేటీకి హాజరు కావడం దానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. క్వాడ్‌ భేటీ జరిగిన కొన్ని వారాల్లోనే ఆస్ట్రేలియాను మలబార్‌ యుద్ధవిన్యాసాల్లో భాగం చేసేందుకు భారత్‌ పచ్చజెండా ఊపింది. వాస్తవానికి ఈ నిర్ణయం ప్రకటించడానికి భారత్‌ జులై నుంచి మల్లగుల్లాలు పడుతోంది.

దీంతో మలబార్‌ యుద్ధవిన్యాసాల్లో క్వాడ్‌ దేశాలన్నింటికీ భాగస్వామ్యం లభించినట్లయింది. త్వరలో మొదలయ్యే మలబార్‌ యుద్ధవిన్యాసాల కంటే ముందే- భారత్‌ ‘బెకా’ ఒప్పందం కుదుర్చుకోవడం ఆసియాలో రాజకీయ సమీకరణలను ప్రభావితం చేసే అంశం. మలబార్‌ విన్యాసాల్లో రహస్య కమ్యూనికేషన్ల పనితీరును పరీక్షించే అవకాశాలున్నాయి. ఆధునిక యుద్ధతంత్రంలో సమాచారం ప్రాణవాయువు లాంటిది. శత్రువు వ్యూహాలు, కదలికలను ముందే పసిగట్టి వాటికి అడ్డుకట్ట వేయడానికి అక్కరకొచ్చే దిశలో భారత్‌ వేస్తున్న అడుగులు భౌగోళిక రాజకీయ సమీకరణలను గుణాత్మకంగా మారుస్తాయనడంలో సందేహం లేదు.

ఒప్పందాల్లో సమతౌల్యం కీలకం

రక్షణ ఒప్పందాలు విదేశాంగ విధానాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అమెరికాతో భారత్‌ చేసుకొనే ఒప్పందం- రష్యాతో సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే భారత ఆయుధాల్లో సగానికిపైగా రష్యా నుంచే దిగుమతవుతున్నాయి. వాటి విడిభాగాల సరఫరా, నిర్వహణపై ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం కనబరచకుండా భారత్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు అవసరమైతే కీలక ఆయుధాలను రష్యా నుంచి కొనుగోలు చేసే అవకాశాలనూ భారత్‌ సజీవంగా ఉంచుకోవడం చాలా అవసరం!

రచయిత- పెద్దింటి ఫణికిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.