ఆడపిల్ల పెళ్ళికి ఏది సరైన వయసు? మహిళల వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే దిశగా యోచిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించారు. దీనిపై జయాజైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ వివిధ వర్గాల అభిప్రాయాల్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్ళి వయసు ఎంత ఉండాలనేది మన దేశంలో కొత్త సమస్యేమీ కాదు. దశాబ్దాలుగా ఇది ఎంతకీతెగని చర్చగా సాగుతూ వస్తోంది. ఈ విషయంలో 1884లో వెలుగులోకి వచ్చిన ముంబయిలోని రుక్మాబాయి ఉదంతమే అత్యంత పాత కేసు. 1876లో రుక్మాబాయికి పదకొండేళ్ల వయసులో దాదాజి భికాజితో వివాహమైంది. అయినా తన సవతి తండ్రి, తల్లివద్దే ఉండిపోయారు. చివరికి భర్త వద్దకు వెళ్లేందుకు తిరస్కరించడం వల్ల 1884లో ప్రముఖ కేసుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్ హిల్ ఫినే ఈ వ్యవహారంలో బ్రిటిష్ సమ్మతి చట్టాన్ని వర్తింపజేయడం కష్టమని భావించారు.
ఈ తరహా ఉదంతం పూర్వాపరాలూ లభ్యం కాలేదు. పెళ్ళినాటికి రుక్మాబాయి చాలా చిన్నమ్మాయి కావడంవల్ల సమ్మతి లభించినట్లు భావించలేమనేది న్యాయమూర్తి అభిప్రాయం. నాటి సంప్రదాయ భారతీయ సమాజంలో ఆ అభిప్రాయానికి బలం చేకూరలేదు. కేసు తిరిగి ప్రారంభమైంది. రాబర్ట్ తీర్పునూ తిరగదోడారు. రుక్మాబాయి ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదలలేదు. విషయాన్ని ప్రఖ్యాత టైమ్స్ పత్రికకు రాయడం సహా బ్రిటిష్ రాణి విక్టోరియాకు పిటిషన్ పంపారు. చివరికి రాణి జోక్యం చేసుకొని వివాహాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తరవాత రుక్మాబాయి వివాదాలన్నింటినీ వదిలేసి, లండన్‌లో వైద్యవిద్య చదువుకోవడానికి వెళ్లారు. భారత్‌కు తిరిగి వచ్చి గుజరాత్‌లో చాలాకాలంపాటు ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఈ కేసు ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
చట్టాల అమలులో వెనకబాటు
సమ్మతి వయసు చట్టాన్ని 1891లో ఆమోదించిన నాటి నుంచి మనదేశంలో పెళ్ళి వయసు అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ చట్టంలో పెళ్ళి వయసును నేరుగా ప్రస్తావించకుండా, లైంగిక కార్యానికి సమ్మతించే వయసును పది నుంచి పన్నెండేళ్లకు పెంచారు. చివరికి 1929లో బాల్యవివాహాల నిరోధక చట్టంలో పెళ్ళి వయసు బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 సంవత్సరాలుగా నిర్ణయించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం గుర్తించే యత్నం జరిగింది. ఇదే ప్రఖ్యాత శారదా చట్టంగా పేరొందింది. తదనంతర కాలంలో వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లకు పెరిగింది. 2006లో వివాహ వయసు పరిమితుల్ని అదేవిధంగా ఉంచుతూ, చట్టం పేరును మాత్రం బాల్యవివాహ నిషేధ చట్టంగా మార్చారు. ప్రస్తుతం మన దేశంలో బాలికల కనీస పెళ్ళి వయసు 18 ఏళ్లు.
అయినా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా చిన్నారి పెళ్ళికుమార్తెల సంఖ్య నమోదవుతున్న దేశమిది. నిత్యం పెద్ద సంఖ్యలో చిన్నారులు పెళ్ళిపీటలకు ఎక్కుతూనే ఉన్నట్లు ఐరాస జనాభా నిధి(యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్ళి వయసు పెంచితే, బాల్యవివాహాలు తగ్గుతాయా అన్నదీ పెద్ద ప్రశ్నే. బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 ప్రకారం వధువు, వరుడు కోరుకుంటేనే పెళ్ళి రద్దవుతుంది. తన పెళ్ళి చట్ట విరుద్ధమన్న సంగతే తెలియని ఓ బాలిక ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు, అత్తామామలు అంగీకరిస్తారా అన్నదీ అనుమానమే. బాల్యవివాహాలకు కారణం పెళ్ళి వయసు తక్కువగా ఉండటం కాదని, ప్రస్తుతమున్న వివాహ చట్టాల అమలు సరిగ్గా లేకపోవడం, మహిళల విద్య, ఉపాధి, భద్రత వంటివన్నీ తోడవుతున్నాయని విదితమవుతోంది.
చైతన్యం పెరిగితేనే...
మహిళలకు సాధికారత కల్పనలో లోపాల్ని పరిష్కరించకుండా వివాహ వయసును పెంచడం వల్ల నష్టమే తప్ప సానుకూల ప్రభావం ఉండదని 'యంగ్ వాయిసెస్: నేషనల్ వర్కింగ్ గ్రూప్' నివేదిక పేర్కొంది. బాల్యవివాహాలకు మూలకారణాల్ని గుర్తించి పరిష్కరించకపోతే ఈ చట్టం చేసే చెడే ఎక్కువని, పెళ్ళీడు పెంచితే ఆడపిల్లను భారంగా భావించి, మరింతగా భ్రూణహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని చిన్నారుల హక్కుల ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ ఎదుట అభిప్రాయం ప్రకటించేందుకు ఎంపికైన రాజస్థాన్ అజ్మేర్‌కు చెందిన యువతి మమతా జంగిడ్- పద్దెనిమిదేళ్లకే ఓటేసే అవకాశం ఇస్తున్నప్పుడు ఆ వయసులో పెళ్ళి చేసుకోవాలా, వద్దా అనేది అమ్మాయిలు నిర్ణయించుకోలేరా అని ప్రశ్నించారు.
ఝార్ఖండ్‌కు చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని ప్రియాంక ముర్ము- చదువు, ఉద్యోగావకాశాలు లేని అమ్మాయిలు తల్లిదండ్రులకు భారంగా మారతారని, వారికి విద్య ఉపాధి కల్పించాలన్నారు. ఈ క్రమంలో- వివాహ వయసును పెంచడంకన్నా ముందుగా, బాల్యవివాహానికి మూలకారణాలపై దృష్టి సారిస్తూ, బాలికల విద్య, పోషణ, ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి చర్యల ద్వారా మహిళల్ని మరింత సాధికారత వైపు నడిపించాలి. వరకట్నం, బాల్య వివాహం, అత్యాచారాలకు సంబంధించి ప్రస్తుతమున్న చట్టాల్ని బలోపేతం చేయాలి. దాంతోపాటు మహిళలకు ఆరోగ్యపరమైన, చట్ట సంబంధ అంశాలపై అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మనదేశంలో మహిళలకు చట్టపరంగా సాధికారత దక్కినా, విద్యాజ్ఞానం లేకుండా ఆ హక్కుల్ని ఉపయోగించుకోలేరన్న సంగతినీ గుర్తించాలి.
మారుతున్న ఆలోచనా ధోరణి
తాజాగా అమ్మాయిల పెళ్ళీడును 21కి పెంచాలనే ప్రతిపాదనపై అనుకూల, ప్రతికూల వాదనలు రెండూ వినిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గత పదేళ్లలో ఆడపిల్లల సగటు వివాహ వయసు పెరిగిందని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. పదేళ్ల క్రితం వరకు అమ్మాయిలకు ఎక్కువగా 20 ఏళ్లలోపే పెళ్ళి చేసేవారు. అయితే ఇప్పుడు 21 సంవత్సరాలు దాటిన తరవాతే అత్యధికులు వివాహం చేస్తున్నట్లు కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్మాయిలకు చట్టపరంగా వివాహ వయసును పెంచడం వల్ల అమ్మాయిలు మరింతగా చదువుకునేలా, ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకొనేలా, ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడేలా తోడ్పడవచ్చని, నిర్ణయాత్మక శక్తిని నైపుణ్యాలను పెంచుకుంటారని, ప్రపంచాన్ని సమర్థంగా అర్థం చేసుకుంటారనే వాదన ఉంది. వీటితోపాటు శిశు మరణాల రేటు (ఐఎంఆర్), మాతృత్వ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) వంటి అంశాల్లో పరిస్థితులు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బాలికల వివాహ వయసును పెంచడం ద్వారా లింగసమానత్వం సాధించవచ్చనే వాదనలున్నాయి. 20 ఏళ్ల పైబడిన వారితో పోలిస్తే, కౌమార వయస్కుల్లో గర్భధారణతో ముప్పు అధికంగా ఉంటోంది. 15 నుంచి 19 ఏళ్ల బాలికల మరణాలకు కారణాల్లో గర్భధారణ సంబంధ సమస్యలే అధికమని యునిసెఫ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
రచయిత- శ్రీనివాస్ దరెగోని