ETV Bharat / opinion

హరిత వనాలతోనే జవజీవాలు - అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన గ్రామీణుల జీవనోపాధి

2030 నాటికి దేశంలో అడవుల శాతాన్ని 33శాతానికి పెంచాలని అటవీ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా నిర్దేశిత లక్ష్యానికి ఇంకా సుదూరంగా ఉన్నట్లే భావించాలి. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ముందు వరసలో ఉంటే- అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర తరవాతి స్థానాలు ఆక్రమించాయి. కేంద్ర అటవీశాఖ నివేదిక ప్రకారం 2017 గణాంకాలతో పోలిస్తే 2019 నాటికి విస్తీర్ణం 5,188 చ.కి.మీ. మాత్రమే పెరిగింది.

A special article on forests on the occasion International Forest Day
హరిత వనాలతోనే జవజీవాలు
author img

By

Published : Mar 21, 2021, 9:14 AM IST

భారతదేశంలో అడవులు 8,07,276 చదరపు కిలోమీటర్ల వరకు (మొత్తం భూభాగంలో 25శాతం వరకు) విస్తరించి ఉన్నాయి. కేంద్ర అటవీశాఖ నివేదిక ప్రకారం 2017 గణాంకాలతో పోలిస్తే 2019 నాటికి విస్తీర్ణం 5,188 చ.కి.మీ. మాత్రమే పెరిగింది. 2030 నాటికి దేశంలో అటవీ ప్రాంతాన్ని మొత్తం భూభాగంలో 33శాతానికి పెంచాలని అటవీ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా నిర్దేశిత లక్ష్యానికి ఇంకా సుదూరంగా ఉన్నట్లే భావించాలి. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ముందు వరసలో ఉంటే- అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర తరవాతి స్థానాలు ఆక్రమించాయి. గడచిన రెండేళ్లలో అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో కర్ణాటక (1,025 చ.కి.మీ.) ముందంజలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ (990 చ.కి.మీ.), కేరళ (823 చ.కి.మీ.), జమ్మూకశ్మీర్‌ (371 చ.కి.మీ.), హిమాచల్‌ప్రదేశ్‌ (334 చ.కి.మీ.) కొంత పురోగతి సాధించాయి. దీనికి ప్రధాన కారణం అటవీశాఖ సంరక్షణ చర్యలు, కఠిన చట్టాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, సామాజిక అడవుల పెంపకం వంటివిగా చెప్పుకోవచ్చు.

అడవులకు దూరమవుతున్న గిరిజనం

వాతావరణ మార్పులవల్ల సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల నుంచి బయటపడటానికి అడవుల సంరక్షణే మార్గమని అంతర్జాతీయ స్థాయిలో ప్యారిస్‌ ఒప్పందం ద్వారా నడుంబిగించారు. ఈ ప్రయత్నాలు చర్చించే ముందు అడవుల క్షీణతను శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనాదిగా గిరిజనులు అడవుల్లో నివసిస్తూ వాటితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. బ్రిటిష్‌వారి రాకతో శాస్త్రీయ పరమైన అటవీ సంరక్షణ పేరుతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1865లో వారు మొట్టమొదటిసారిగా అటవీ చట్టాన్ని చేసి దాన్ని అతిక్రమించిన వారికి శిక్షించే అధికారాలను పొందుపరిచారు. 1878లో ఈ చట్టంలో స్వల్ప మార్పులు చేసి అడవులను రిజర్వు, సంరక్షిత, గ్రామ అడవులుగా వర్గీకరించి- గిరిజనులను క్రమంగా ఆడవులనుంచి దూరం చేస్తూ వచ్చారు. స్వాతంత్య్రానంతరం 1952లో తీసుకువచ్చినా జాతీయ అటవీ విధానం కూడా జాతి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన గ్రామీణుల జీవనోపాధి, కలప, వంటచెరకు వంటి అవసరాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అసంతృప్తి పెల్లుబికి తరతరాలుగా సంరక్షిస్తూ వస్తున్నా అడవులను రహస్యంగా నరికి వేయడం, అక్రమ రవాణా వంటి చర్యలు ఎక్కువై అడవుల శాతం క్రమంగా క్షీణించింది.

ప్రజల భాగస్వామ్యంతో అడవులను రక్షణ..

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 1976లో సామాజిక అడవుల పెంపకం అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ అవసరాలకు కావలసిన కలప, వంట చెరకు, పశుగ్రాసాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. అయితే ఈ పథకంలో లాభాపేక్షతో ఒకే రకమైన (యూకలిప్టస్‌) చెట్లను విరివిగా పెంచడంతో పర్యావరణానికి ఇది పెనుసవాలుగా మారింది. ఈ లోపాలను సవరిస్తూ 1988లో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానాన్ని ప్రారంభించి, ప్రజల భాగస్వామ్యంతో అడవులను రక్షించాలని సంకల్పించింది. దీని ప్రధాన ఉద్దేశం అడవుల ద్వారా జీవనోపాధిని కల్పిస్తూ వాటి నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వర్తించాలని నిర్ణయించడమే. దీనిలో భాగంగానే 1990లో ఉమ్మడి అటవీ నిర్వహణ పథకాన్ని దేశమంతటా అమలు చేసి వాటి అభివృద్ధి, సంరక్షణ చర్యలను పకడ్బందీగా చేపట్టింది. అడవి క్షీణతకు పోడు వ్యవసాయం ప్రధాన కారణంగా ఈ విధానం పేర్కొంది. దీని నుంచి గిరిజనుల దృష్టి మరల్చేందుకు, లాభాపేక్షతో కూడిన వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు అనేక ప్రతిపాదనలు చేసింది. ఈ విధానం ద్వారా అటవీ ఉత్పత్తుల సంగ్రహణకు అనుమతులు ఇస్తూనే- 2006లో అటవీ భూముల హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు అడవుల మీద హక్కులను కల్పించింది. అన్ని రకాల అడవుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించాలని 2011లో ప్రకటించింది.

విస్తరణపై దృష్టి అత్యావశ్యకం

ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2021 సంవత్సరాన్ని 'అటవీ పునరుద్ధరణ శ్రేయస్సు కోసం ఒక మార్గం' అనే ఇతివృత్తంగా నిర్ణయించారు. దీనికి ముఖ్య కారణం అడవుల పెంపకంవల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు లభ్యమవుతాయి. ఔషధ మూలికలు, తేనె, కందమూలాలు వంటి వనసంపదా పెరుగుతుంది. పోషకాహారం, మానసిక ఉల్లాసం వంటి ఎన్నో ప్రయోజనాలూ చేకూరుతాయి. లేని పక్షంలో ఇబ్బడి ముబ్బడిగా అడవుల నరికివేతవల్ల భూతాపం పెరిగి ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మధ్య ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నందాదేవి హిమానీ నదాలు కరిగి దౌలి గంగ నదికి అకస్మాత్తుగా వరద సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరగడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 2015లో జరిగిన ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను సమర్థంగా అధిగమించడానికి ప్రధాన ఉద్గార దేశాలు అడవుల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి సగటు ఉష్ణోగ్రత రెండు శాతం లోపే ఉండేలా చూడాలని తీర్మానించారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వాలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి అడవుల విస్తరణకు దోహదం చేయాలి. దీంతో పాటు గిరిజనులు, అడవుల మీద జీవించే వారికి సుస్థిరమైన జీవనోపాధిని కల్పించగలిగితే వారి భాగస్వామ్యంతో అంతరించిపోతున్న అడవులను తిరిగి పునరుద్ధరించడం అంత కష్టమేమీ కాదు.

పర్యావరణానికి విఘాతం

అడవుల విస్తీర్ణం పెంపుదల విషయంలో దేశం మొత్తం మీద పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో 3,199 చ.కి.మీ. వరకు అటవీ విస్తీర్ణం తగ్గడం గమనార్హం. ఇందుకు పోడు వ్యవసాయం, కార్చిచ్చులు, అడవుల నరికివేత, ప్రకృతి విపత్తులు వంటివి ముఖ్య కారణాలు. మన దేశంలో ఇప్పటికీ 1,70,000 గ్రామాలు (26శాతం జనాభా) కలప, వంట చెరకు, పశుగ్రాసం మొదలైన వాటికోసం అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన గిరిజనుల జీవనోపాధికి మళ్లీ అడవులే శరణ్యమయ్యాయి. ప్రపంచం మొత్తం మీద అడవులు తరిగిపోతూ ఉండటంతో జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు కరవు కాటకాలు, భూతాపం, అకాల వరదలు, నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత వంటి తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌
(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

ఇదీ చూడండి: మంచి మనసు చాటుకున్న సింధియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.