రైతు జన సముద్ధరణ కోసమంటూ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు, సాగుదారుల ఆదాయం (farm income) రెండింతలు చేయడమే లక్ష్యమంటూ జాతీయ స్థాయిలో అమాత్యుల ప్రతిజ్ఞలు మోతెక్కుతున్నాయి. వాస్తవంలో రైతు దుస్థితి ఏమిటో తాజాగా వెలుగుచూసిన జాతీయ నమూనా సర్వే వివరాలు కళ్లకు కడుతున్నాయి. రోజుకూలి చేసి పొట్ట పోసుకునేవారికి గ్రామాల్లోనైతే రూ.300-500 వరకు, నగరాల్లో రూ.600-700 దాకా లభిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. అదే, హెక్టారు భూమి కలిగిన రైతు కుటుంబానికి రోజుకు సగటున దక్కుతున్న రాబడి 224 రూపాయలే. సర్కారీ కార్యాలయాల్లో చిరుద్యోగులు సైతం నెలకు రూ.20వేల కనీసాదాయం పొందుతుండగా, ఇంట్లోని వారందరూ రెక్కలు ముక్కలు చేసుకునే రైతు కుటుంబ నెలవారీ సగటు రాబడి రూ.6951గా నమోదు కావడం దిగ్భ్రాంతపరచేదే. ఈ అరకొర సంపాదన, పోనుపోను ఇంతలంతలవుతున్న సేద్య వ్యయాల కారణంగా రైతాంగంలో అత్యధికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏపీలో 93.2శాతం, తెలంగాణలో 91.7శాతం కర్షక కుటుంబాలది అదే దీనావస్థ!
జీవన భద్రత ఏది?
క్షేత్రస్థాయి స్థితిగతుల్ని సరిగ్గా పట్టించుకోకుండా పాలకశ్రేణులు వండివారుస్తున్న అరకొర పథకాలేవీ రైతన్నకు జీవన భద్రత కల్పించలేకపోతున్నాయి. జాతీయ రైతు ప్రణాళిక తక్షణావసరమన్న డాక్టర్ స్వామినాథన్ మేలిమి సిఫార్సుల స్ఫూర్తి నేటికీ నిలువునా నీరోడుతోంది. భూమి విలువను, వాస్తవిక సేద్య వ్యయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రకటిస్తున్న కంటితుడుపు మద్దతు ధర అన్నదాతకు కొరగానిదవుతోంది. విత్తు దశనుంచి విక్రయించే వరకు అడుగడుగునా ఎన్నో కడగండ్ల పాలబడుతున్న రైతుకు సంపూర్ణ బీమా రక్షణ ఎండమావినే తలపిస్తోంది. పర్యవసానంగా 130కోట్ల జనాభాకు ఆహారం పండిస్తున్న శ్రమజీవి బతుకు చిత్రం అనునిత్యం ఛిద్రమవుతూనే ఉంది!
ప్రణాళిక అవసరం..
భిన్న కారణాలతో పంట నష్టపోయిన వారే కాదు, రాబట్టిన దిగుబడుల్ని విక్రయిస్తున్న రైతులూ తీవ్రంగా ఆక్రోశించే దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? సాగుకు అవసరమైన దినుసుల్ని చిల్లర ధరకు కొనుగోలు చేస్తున్న కర్షకులు సేద్య ఉత్పత్తుల్ని టోకు ధరకు విక్రయించాల్సి రావడం, కష్టార్జితాన్ని తెగనమ్ముకోవడం కాక మరేమిటి? కోత ఖర్చులూ రావన్న వేదనతో పండించిన పంటనంతా రోడ్డు పక్కన పారబోస్తున్న రైతులకు ఆ గర్భశోకం ఇంకెన్నాళ్లు? దేశవ్యాప్తంగా రమారమి 16 కోట్ల హెక్టార్ల సేద్య యోగ్య భూములు, తగినన్ని జలవనరులు కలిగిన గడ్డ మీద ఎక్కడా ఏ పంటా వృథా కారాదంటే- వ్యవసాయోత్పత్తుల పరిశ్రమల్ని విరివిగా నెలకొల్పాలి. సుక్షేత్రాల్లో గరిష్ఠ పంట దిగుబడుల సాధనను లక్షించి శాస్త్రీయ పంటల ప్రణాళికను తీర్చిదిద్దాలి. వేర్వేరు వాతావరణ జోన్లు కలిగిన భారత్‌లో ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఏమేమి పంటల్ని సాగుచేయాలో, దేశీయావసరాలతో పాటు విదేశీ ఎగుమతుల నిమిత్తం అంచెలవారీ వ్యూహాలు ఎలా పదునుతేలాలో- జాతీయ పంటల ప్రణాళికలో అంతర్భాగం కావాలి. దాన్ని సమర్థంగా పట్టాలకు ఎక్కించడంలో దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలన్నీ క్రియాశీల పాత్ర పోషించేలా వ్యవస్థాగతంగా సాకల్య ప్రక్షాళన చురుకందుకోవాలి. వ్యవసాయ భారతావని ముఖచిత్రాన్ని మార్చేసే బృహత్తర బాధ్యతను నిభాయించే ప్రత్యేక యంత్రాంగాన్ని అవతరింపజేయాలి. ఏ దశలోనూ రైతులు ఇక్కట్ల బారిన పడకుండా కాచుకునే నిమిత్తం ప్రభుత్వం భూరి కేటాయింపులు చేయడం అత్యంత కీలకం. తాము పండించినదానికి గిట్టుబాటు లభిస్తుందన్న ధీమా అన్నదాతల్లో పాదుకోవాలి. అప్పులూ నష్టాలు కాలసర్పాల్లా కాళ్లకు చుట్టుకొని గత్యంతరం లేని స్థితిలో ఆత్మహత్యలకు తెగబడాల్సిన దురవస్థ మరే రైతుకూ దాపురించకుండా ప్రభుత్వాలు కాచుకోవాలి. అలా చేస్తేనే, జాతిజనుల ఆహారావసరాలు తీరుస్తున్న నేలతల్లి ముద్దుబిడ్డల పట్ల కనీస బాధ్యతను నిర్వర్తించినట్లవుతుంది!
ఇదీ చూడండి: మద్దతు ధరతోనే.. రైతు భద్రతకు రాజమార్గం!